జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి
వనపర్తి డిసెంబర్ 18 (way2newstv.in)
పదవ తరగతి విద్యార్థులు గణితం సబ్జెక్టును ఎక్కువగా అభ్యసించే లా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు. గురువారం ఆమె వనపర్తి జిల్లా పాన్గల్ మండలం మహ్మదాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతి వారం పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేస్తున్న ఐరన్ మాత్రల పంపిణీ పరిశీలించే నిమిత్తం పాఠశాలకు వచ్చారు. ఈ సందర్భంగా పదవ తరగతి తరగతి గదిలో విద్యార్థులతో గణితంపై ప్రశ్నలు జవాబులు అడిగారు.అంతేకాక విద్యార్థులకు బోర్డుపై పైతాగరస్, ఎక్స్ స్క్వేర్ ,సమాంతర చతుర్భుజం పై ప్రశ్నలను అడిగి సమాధానాలను రాబట్టారు. ఈ సందర్భంగా గణితం ఉపాధ్యాయుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులచే ఎన్ని గంటల పాటు గణితం అభ్యసన చేయిస్తున్నారని అడిగారు.
గణితం అభ్యాసించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి
అంతేకాక గణితం అభ్యసన పుస్తకాన్ని పరిశీలించారు. గత సంవత్సరం పాఠశాలలో పదవ తరగతి ఉత్తీర్ణత శాతం , ప్రత్యేకించి గణితంలో ఉత్తీర్ణులైనవారు శాతం వివరాలను అడిగి తెలుసుకున్నారు.అంతకుముందు కలెక్టర్ పాఠశాలలో ప్రతి వారం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పంపిణీ చేస్తున్న ఐరన్ మాత్రల రిజిస్టర్ లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొంత మంది విద్యార్థులకు ఐరన్ టాబ్లెట్లు పంపిణీ చేయకపోవడం, అలాగే విద్యార్థుల ఎత్తు, బరువు, హిమోగ్లోబిన్ వంటి వివరాలను నమోదు చేయకపోవడం గుర్తించిన కలెక్టర్ ఒక వారంలో ఐరన్ మాత్రలు ఇవ్వని విద్యార్థుల కు తర్వాత వారంలో ఇవ్వాలని, అలాగే ఇప్పటివరకు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం టాబ్లెట్లు పంపిణీ చేయని వారందరికీ రెండు వారాల్లోగా పూర్తిచేయాలని, ఈ విషయమై ఏఎన్ఎం వారిగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు.2019 సంవత్సరంలో ఇప్పటివరకు డాక్టర్ పాఠశాలను సందర్శించ లేదని తెలుసుకున్న కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐరన్ మాత్రల పంపిణీ లో ఆర్ బి ఎస్ కె బృందాన్ని కూడా భాగస్వాములను చేయాలని, ఒక బృందం వారంలో కనీసం రెండు పాఠశాలలు అయినా కవర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.సర్పంచ్ జయ రాములు తో పాఠశాల, ఇతర సమస్యలపై కలెక్టర్ మాట్లాడారు. ఉన్నత పాఠశాలలో బాలికల మూత్ర శాలలకు నీటి సౌకర్యం లేదని, గతంలో పాత సిమెంట్ పైప్లైన్ ద్వారా నీటి సరఫరా అవుతుండగా ప్రస్తుతం ఆ పైపులైను లీకేజీ అవుతుందని, నీటి సమస్యను తీర్చాలని కోరారు. అలాగే విద్యుత్ స్తంభము ఒరిగి పోయిందని లైన్ మార్చాలని కోరగా, ఇందుకు స్పందించిన కలెక్టర్ పాఠశాలలో నీటి నిల్వ కోసం సింటెక్స్ తో పాటు, బోరుకు మోటార్ ఏర్పాటు, విద్యుత్ లైన్ షిఫ్ట్ చేయటం, మూత్రశాల లకు నీటి సరఫరా కోసం తక్షణమే ప్రతిపాదనలు పంపాలని, పాఠశాల ప్రహరీ నిర్మాణానికి టెండర్లు పిలవాలని, బాలికల మరుగుదొడ్ల కోసం తక్షణమే లక్ష రూపాయల అడ్వాన్స్ మంజూరు చేస్తున్నానని, ఉపాధి హామీ పథకం కింద వీటిని చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మండలంలోని చింతకుంట పాఠశాలను సందర్శించారు. వంటగదిని, భోజనం నాణ్యతను పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థలో ఉన్నందున ఉపయోగించడం లేదని, ఊరి వెలుపల కొత్త పాఠశాల భవనం నిర్మాణంలో ఉందని తెలుపగా, అక్కడికి వెళ్లి నిర్మాణంలో ఉన్న పాఠశాల భవనాన్ని పరిశీలించారు. త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసి తరగతి గదులను అందులో నిర్వహించాలని అధికారులకు సూచించారు.ఆ తర్వాత జిల్లా కలెక్టర్ రాయిని పల్లి గ్రామం సందర్శించి అక్కడ మన్యం అనే ఉపాధి హామీ కూలి ఏర్పాటుచేసిన విస్తరాకుల ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. యూనిట్ ఏర్పాటుకు ఎంత ఖర్చు చేశారని, రోజుకు ఎన్ని ఆకులు ఉత్పత్తి చేస్తున్నారని, మిషన్ల కొనుగోలుకు ఎంత ఖర్చు అయిందని కలెక్టర్ ప్రశ్నించారు. ఇందుకు మన్యం మాట్లాడుతూ తన సొంతంగా ఈ యూనిట్ ను ఏర్పాటు చేశానని, వివిధ రకాల విస్తరాకుల తయారీకి యంత్రాలను తే ప్పించడం జరిగిందని, ఐదు లక్షల వరకు తనకు ఖర్చు వస్తుందని, ఉపాధి హామీ పథకం కింద షెడ్లు, అలాగే మిషన్లు, మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని, గ్రామంలో సుమారు 150 కుటుంబాలు విస్తరాకుల ను తయారుచేసి అమ్ముతున్నారని, కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ ఉపాధి హామీ పథకం కింద ఇస్తరాకుల యూనిట్ అవసరమైన నిధులు మంజూరు చేస్తామని, అలాగే మహిళా సంఘాల ద్వారా కూడా ఇలాంటి యూనిట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డి ఆర్ డి ఓ గణేష్ ను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ రవి శంకర్, ప్రోగ్రాం అధికారి శంకర్, డి ఈ ఓ సుశీంధర్ రావు, సర్పంచ్ జయరాములు, ఎం ఈ ఓ, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
No comments:
Post a Comment