Breaking News

06/12/2019

కొలిక్కి రాని ఉద్ధవ్ క్యాబినెట్

ముంబై, డిసెంబర్ 6 (way2newstv.in)
ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారు కాని మిత్రుల నుంచి ఇంకా పూర్తి సహకారం పొందలేక పోతున్నారు. గత నెల 28వ తేదీన ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు మూడు పార్టీల నుంచి ఇద్దరు చొప్పున మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు కలసి ప్రభుత్వం ఏర్పాటయి దాదాపు వారం గడుస్తున్నా పూర్తి స్థాయి మంత్రి వర్గం ఏర్పాటు కాలేదు. దీనికి కారణం కూటమిలోని పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడమే.మహారాష్ట్ర మంత్రి వర్గంలో కాంగ్రెస్, ఎన్సీపీలకు డిప్యూటీసీఎం పదవులు ఇస్తామని ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం డిప్యటీ సీఎం ఎవరనేది తేల్చాల్సి ఉంది. 
కొలిక్కి రాని ఉద్ధవ్ క్యాబినెట్

అయితే ఇప్పటి వరకూ ఎవరినీ ఎంపిక చేయలేదు. దీనికి కారణం ఎన్సీపీలో అజిత్ పవార్. అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తున్నారు. ఆయన బీజేపీతో చేతులు కలిపి తిరిగి ఎన్సీపీ గూటికి చేరిన తర్వాత పార్టీలో కొంత సానుకూలత ఏర్పడినా ఎక్కువ మంది అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే ప్రతిపాదన వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారు.మరోవైపు కాంగ్రెస్ పార్టీలో సయితం మంత్రి వర్గ పదవులు విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకుంది. మొత్తం 44 మంది శాసనసభ్యులున్న కాంగ్రెస్ పార్టీకి పదికి మించి మంత్రి పదవులు దక్కే అవకాశంలేదు. హడావిడిగా మంత్రివర్గ సభ్యులను ప్రకటిస్తే మిగిలిన వారిలో అసంతృప్తి చెలరేగే అవకాశముంది. మరో కర్ణాటక తరహా రాజకీయాలు మహారాష్ట్రలోనూ తలెత్తే అవకాశముంది. అందుకే శాసనసభ్యులతో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతనే మంత్రి వర్గ సభ్యులను కాంగ్రెస్ అధిష్టానం ఖారారు చేయనుంది.కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇప్పటికే ఈ బాధ్యతను సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, అహ్మద్ పటేల్ కు అప్పగించారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటయి వారం రోజులు దాటుతున్నా పూర్తి స్థాయి మంత్రి వర్గం ఏర్పాటు కాలేదు. శివసేన ఇప్పటికే దీనిపై కాంగ్రెస్, ఎన్సీపీలతో చర్చించింది. వీలయినంత త్వరగా మంత్రివర్గాన్ని విస్తరించాలని ఉద్దవ్ థాక్రే భావిస్తున్నారు. అయితే పార్లమెంటు సమావేశాలు ఉండటంతో ముఖ్యనేతలంతా ఢిల్లీలోనే ఉండటంతో సభ్యుల ఖరారులో కొంత జాప్యం జరిగే అవకాశముంది. మంత్రి వర్గ విస్తరణలో అన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే అసలుకే ఎసరు వస్తుందన్నది కాంగ్రెస్ భయం. అందుకే ఆచితూచి అడుగులు వేస్తోంది.

No comments:

Post a Comment