విజయవాడ, డిసెంబర్ 6 (way2newstv.in)
వైసీపీ అధినేత జగన్ స్థానిక సంస్థల ఎన్నికలపై గట్టి నమ్మకం పెట్టుకుని ఉన్నారు. తాను ఆరు నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలను గ్రౌండ్ చేయడంతో స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా వైసీపీ గెలుపు ఉండి తీరాల్సిందేనని పదే పదే చెబుతున్నారు. మంత్రి వర్గ సమావేశంలోనూ, తనతో భేటీ అయిన సీనియర్ నేతలతోనూ జగన్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై పదే పదే ప్రస్తావిస్తుండటం విశేషం. స్థానిక సంస్థల ఫలితాల్లో తేడా వస్తే అది తన పాలనపై పడుతుందన్నది జగన్ కు తెలియంది కాదు. అందుకోసమే స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి పార్టీ నేతలను జగన్ ఇప్పటి నుంచే సమాయత్తం చేస్తున్నారు.అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఆరు నెలలు మాత్రమే అవుతుంది. ఇప్పటికే విపక్షాలు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కాయి. ఇసుక కొరత ప్రభుత్వాన్ని కొన్నాళ్లు ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు సెట్ రైట్ అయింది.
సంక్షేమ పథకాలపైనే మున్సిపల్ ఆశ
మరోవైపు అన్ని సంక్షేమ పథకాలు దాదాపుగా జగన్ అమల్లోకి తెచ్చేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లవచ్చన్న ధీమాతో జగన్ ఉన్నట్లు పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ, మున్సిపాలిటీలు, నీటి సంఘాల పదవీకాలం ముగిసి చాలా రోజులయినా వాటికి ఇప్పటివరకూ ఎన్నికలను నిర్వహించలేదు. గత ప్రభుత్వం కూడా ఆ సాహసం చేయలేకపోయంది.అయితే జనవరి నెలలోనే సంక్రాంతి పండగ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. వైసీపీ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ బలంగానే ఉంది. పట్టణ ప్రాంతాల్లోనే వీక్ గా ఉంది. అందుకే జగన్ ఇన్ ఛార్జి మంత్రులను పిలిచి క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బలమైన నేతలను పార్టీలోకి తీసుకుని తద్వారా విజయం సాధించాలని జగన్ వారిని ఆదేశించారు. ఎట్టిపరిస్థితుల్లో వందశాతం వైసీపీ వైపే ఫలితాలు ఉండాలని, ఏమాత్రం తేడా వచ్చినా ఉపేక్షించబోనని జగన్ వారికి టార్గెట్ విధించినట్లు తెలుస్తోంది.అభ్యర్థుల ఎంపిక కూడా స్థానిక నాయకత్వానికే వదిలిపెట్టాలని జగన్ నిర్ణయించారు. అందుకే మాజీ ఎమ్మెల్యేలను కూడా పార్టీలోకి చేర్చుకోవాలని జగన్ నిర్ణయించారు. అయితే వారు స్థానికసంస్థల ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపేలా ఉండాలని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు మాజీ ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమయిన తరుణంలో వారి చేరికకు కూడా జగన్ ఓకే చెప్పినట్లు సమాచారం. పార్టీ నేతల మధ్య విభేదాలను తొలగించాల్సిన బాధ్యతను కూడా మంత్రులపైనే ఉంచారు. మొత్తం మీద జగన్ స్థానిక సంస్థల ఎన్నికలపై సీరియస్ గా ఉండటంతో మంత్రులు సయితం జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు
No comments:
Post a Comment