Breaking News

20/11/2019

టీపీసీసీ రేసులో శ్రీధర్ బాబు

హైద్రాబాద్, నవంబర్ 20 (way2newstv.in)
ఉత్తమ్ కుమార్ రెడ్డి తరువాత టీ పీసీసీ చీఫ్ పగ్గాలు ఎవరికి దక్కుతాయనే అంశంపై చాలాకాలం నుంచి కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే టీ పీసీసీ చీఫ్ పదవి కోసం కాంగ్రెస్‌లోని సీనియర్ నేతలతో పాటు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి టీ పీసీసీ చీఫ్ ఇవ్వొద్దని కొందరు నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రెడ్డి సామాజికవర్గం నుంచి కాకుండా... మాజీమంత్రి శ్రీధర్ బాబుకు టీ పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలనే కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
టీపీసీసీ రేసులో శ్రీధర్ బాబు

దీనిపై సీఎల్పీలో భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, విశ్వేశ్వర్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌నే కొనసాగించాలని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ఒకవేళ మార్పు ఉంటే తనకు మద్దతు ఇవ్వాలని భట్టి విక్రమార్కను జగ్గారెడ్డి కోరారు. అయితే జగ్గారెడ్డి ఆసక్తిపై స్పందించిన మిగతా నేతలు.. సిరియస్‌గా ప్రయత్నం చేస్తున్నావా అని జగ్గారెడ్డిని ప్రశ్నించారు. ఎన్నికల ముందు రెడ్డి సామాజిక వర్గానికి పీసీసీ ఇస్తే బాగుంటుందన్న జగ్గారెడ్డి... సైలెంట్‌గా పని చేసుకుపోయే శ్రీధర్ బాబుకు పీసీసీ ఇవ్వాలని అధిష్టానానికి చెబుదామని నేతలతో జగ్గారెడ్డి అన్నారు. మరి... టీపీసీసీ చీఫ్ రేసులో జగ్గారెడ్డి ఉన్నారో లేదో తెలియదు కానీ... ఆయనకు ఈ పదవి ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి రావడం రేవంత్ రెడ్డి అవకాశాలకు గండికొట్టడమే అనే ప్రచారం జరుగుతోంది.

No comments:

Post a Comment