Breaking News

20/11/2019

ఏజెన్సీ ప్రాంతాల్లో చెక్ డ్యాంలతో సశ్యశ్యామలం

ఖమ్మం, నవంబర్ 20, (way2newstv.in)
తుపాకీ మోతలతో దద్దరిల్లుతూ అభివృద్ధికి ఆమడదూరంలో ఉంటున్న ఏజన్సీలో ఎవరి సహకారం లేకుండానే తమంత తామే ప్రాజెక్టులు నిర్మించుకునే స్థాయికి గిరిజనులు చేరుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పలు గ్రామాలు చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి సరిహద్దులో ఉంటాయి. ఆ ప్రాంతంలోకి వెళ్ళాలంటే ఎవరైనా భయపడుతుంటారు. అక్కడి ప్రజలు కూడా వానొస్తే పంటలు సాగుచేస్తారు.కరవొస్తే వలస వెళుతుంటారు. దీనికి పరిష్కారంగా ఎవరో వచ్చి ఏదో చేస్తారని భావించకుండా తమంతట తామే కొత్త విధానానికి శ్రీకారం చుట్టి సత్ఫలితాలు సాధించారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా వరిని వర్షాధార పంటగానే పండిస్తారు. కొండ ప్రాంతాల్లోని చెన్నాపురం, బత్తినిపల్లి, యర్రంపాడు, బోదనెల్లి, బక్కచింతలపాడు, కొండెవాయి, యర్రబోరు, క్రాంతిపురం, కొర్కట్‌పాడు, రామచంద్రుని కుంట, కందిపాడు, ఉయ్యాలమడుగు గ్రామాల్లో సుమారు 9వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తుంటారు. 
ఏజెన్సీ ప్రాంతాల్లో చెక్ డ్యాంలతో సశ్యశ్యామలం

ఇదంతా దాదాపుగా సారవంతమైన భూమి కావడంతో వర్షం ఆధారంగా గిరిజనులు పంటలు సాగు చేస్తుంటారు. ఒక్కోసారి పంటలు చేతికొచ్చే సమయంలో కనీస స్థాయిలో కూడా నీరు కరవై పంట ఇంటికి తెచ్చుకునే పరిస్థితి లేకుండా ఉండేది. దీనికి కారణం చెరువులు లేకపోవడమేనని తెలిసినా, చెరువులు తవ్వించే పరిస్థితి లేకపోవడంతో అనేక మంది ఆ ప్రాంతాలను విడిచి బతుకుతెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళారు. కానీ అక్కడే ఉన్న కొందరు ఆదివాసీ రైతులు తమ స్వంత ఆలోచనలకు పదును పెట్టారు. అటవీ గ్రామాల్లోని పంట సాగుచేసే భూములున్న చోట మట్టి కట్టడాలు కట్టాలని నిర్ణయించుకున్నారు. నీరు ప్రవహించే ప్రాంతాల్లో మట్టితో ప్రాజెక్టుల తరహాలో నిర్మాణాలు చేపట్టారు. ఆ మట్టితోనే బలంగా కట్టలను పోసి కుంటలను తవ్వారు. దీంతో తమ స్వంత ఖర్చుతో ఏర్పాటు చేసుకున్న విధానంతో నీరు నిలిచేలా చేసుకొని అక్కడి నుంచి తమ పంటలకు నీరు చేరేలా ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో ఈ ఏడాది సత్ఫలితాలు రావడంతో ఆ ప్రాంతాల్లోని ఇతర గ్రామస్తులు కూడా ఇదే విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.తమ వద్ద దొరికే మట్టితో కుంటలు, చెక్‌డ్యాంలు నిర్మించడం ద్వారా తాము వ్యవసాయంలో లాభం పొందే అవకాశం వచ్చిందని, ఇక వలసలు వెళ్ళే పరిస్థితి ఉండదని రైతులు చెబుతున్నారు. గతంలో కురిసిన వర్షాలతో కుంటలు, చెక్‌డ్యాంలు నీటితో కళకళలాడుతున్నాయి. అవసరమైతే రెండవ పంటను వేసుకునేందుకు కూడా వెనుకాడమని చెప్పుకొస్తున్నారు

No comments:

Post a Comment