Breaking News

04/11/2019

కమలం పుంజుకుంటోందా....

గుంటూరు, నవంబర్ 4, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం మీద బీజేపీకి క్రేజ్ పెరుగుతోంది. గతంలో నేతలు లేక ఓటు బ్యాంకు లేక డీలా పడిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటోంది. ఒక బీజేపీ సీనియర్ నేత తెలుగుదేశం పార్టీ ఓటమితోనే బీజేపీ బలపడుతుందని చేసిన విశ్లేషణ నిజమేననిపిస్తోంది. ఎందుకంటే పేరుమోసిన నేతలందరూ ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ పార్టీ కంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు చూస్తున్నారన్నది కాదనలేని వాస్తవం. ప్రాంతాలకు అతీతంగా బీజేపీలో చేరికలు ఉండటంతో కొంత ఇక్కడ సానుకూలత వాతావరణం ఏర్పడిందనే చెప్పాలి.నిజానికి బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో చోటుకూడా లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. టీడీపీతో పొత్తు కారణంగా అరకొర సీట్లు అప్పుడప్పుడూ వచ్చి రెండు పార్టీలూ లాభపడ్డాయి. అంతే తప్ప బీజేపీ స్వయంగా ఏపీలో ఎదిగడం కష్టమేనని అందరూ అంగీరించే అంశమే. 
కమలం పుంజుకుంటోందా....

ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఒక్కసీటు రాకపోవగా నోటా కంటే అనేక నియోజకవర్గాల్లో తక్కువ ఓట్లు పోలవ్వడం విశేషం. ఈ నేపథ్యంలో ఏపీలో బలపడేందుకు బీజేపీ తన వంతు ప్రయత్నాలు చేస్తుంది. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది.ఇదిలా ఉండగా బీజేపీలో ఇటీవల నలుగురు తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు చేరిన సంగతి తెలిసింది. వారిలో సుజనా చౌదరి, సీఎం రమేష్ లు జనంలో పెద్దగా పట్టు లేని వారు. ఒక్క టీజీ వెంకటేష్ కర్నూలు నియోజకవర్గంలో పలుకుబడి ఉన్న నేత. వీరి వల్ల పార్టీ బలపడుతుందన్న నమ్మకం బీజేపీ అధిష్టానానికి ఏ కోశానా లేదు. అందుకే ఇతర పేరున్న నేతలను పార్టీలో చేర్చుకునే కార్యక్రమం మొదలు పెట్టారు. తాజాగా కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఆదినారాయణరెడ్డి వచ్చే ఎన్నికల వరకూ పార్టీలో ఉంటారా? లేదా? అన్నది పక్కన పెడితే జిల్లాలో కొంత గ్రిప్ తెచ్చుకునేందుకు బీజేపీకి వీలుపడుతుంది.అలాగే కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా బీజేపీలో చేరేందుకు రెడీ అయిపోయినట్లు తెలుస్తోంది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తొలుత తెలుగుదేశం, తర్వాత సొంత పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ కు కూడా రాజీనామా చేశారు. మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరాలని ప్రయత్నాలు చేద్దామనుకున్నా ఆ పార్టీ పరిస్థితి బాగాలేకపోవడంతో బైరెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ నెల 24వ తేదీన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తన అనుచరులతో సమావేశమై బీజేపీలో చేరే విషయం ప్రకటిస్తారని తెలుస్తోంది. ఓటు బ్యాంకు పెద్దగా లేకపోయినా బీజేపీ బలం ఉన్న నేతలను చేర్చుకోవడం ద్వారా కొంత పట్టుపెంచుకునే ప్రయత్నం చేస్తుందనే చెప్పాలి.

No comments:

Post a Comment