హైద్రాబాద్, నవంబర్ 4, (way2newstv.in)
హైదరాబాద్ మహానగరానికి పనులమీద అనునిత్యం కొన్ని వేలమంది వస్తూ.. పోతూ ఉంటారు. అలాగే ఇక్కడ ఏదో ఓ పనిచేసుకుని జీవనం సాగించేందుకు సైతం వందలమంది నగరానికి వస్తుంటారు. వీరిలో కొంతమంది కుటుంబ సమేతంగా వస్తే, మరికొందరు ఒంటరిగానే వస్తుంటారు. అలాగే విద్యా, ఉద్యోగాల కోసం కూడా విద్యార్థులు, ఉద్యోగార్థులు భాగ్యనగరానికి వస్తుంటారు. వీరందరికి వసతి కల్పించేవి హాస్టళ్లు. ఇలా నగరానికి వచ్చే వారికోసం ఇప్పుడు ఎక్కడ చూసినా ఇబ్బడిముబ్బడిగా హాస్టళ్లు వెలిశాయి. అలా వచ్చిన వారికందరికి తల దాచుకునేందుకు ఇవే ప్రత్యామ్నాయం. కానీ వీటి ఏర్పాటులోనే అనేక లోపాలు ఉన్నాయి. హాస్టళ్ల నిర్వహణపై ఏకంగా హైకోర్టు ధర్మాసనం స్పందించి వాటి నిర్వహణపై అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందని, ఆలాగే అక్కడ ఉంటున్న వారికోసం తీసుకుంటున్న చర్యలపై కూడా నిఘా ఉంచాలని వ్యాఖ్యానించింది.
ఆకట్టుకున్న పేయింగ్ గెస్ట్ హౌస్ లు
నర్సింహ్మాచారి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం పై విధంగా స్పందించింది. సికింద్రాబాద్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో కొన్ని వందల హాస్టళ్లు. వీటిలో అమ్మాయిలు, అబ్బాయిలకు హాస్టళ్లు ఉన్నాయి. అలాగే పేయింగ్ గెస్ట్ పేరుతో మరికొంతమంది ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వారికోసం తమ ఇంటిలోనే వసతి కల్పిస్తున్నాయి. కానీ వీటిలో చాలావాటికి ఎలాంటి అనుమతులు లేవు. సాధారణంగా ఒక హాస్టల్ నిర్వహించాలంటే జీహెచ్‌ఎంసీ, పోలీస్, ఫైర్ సేఫ్టీ తదితర శాఖల నుంచి విధిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలామంది హాస్టల్ నిర్వాహకులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అదీగాక అందుకు వాడుతున్న బిల్డింగ్‌ల నాణ్యత విషయంలోనూ ఎన్నో లోపాలు ఉంటున్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే హాస్టళ్లలో ఉంటున్న వారి భద్రతను కూడా పట్టించుకోవడం లేదు. కేవలం ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న కొందరు నిర్వాహకులు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. శాఖల మధ్య సమన్వయం కూడా వీరికి కలిసి వస్తుంది. దీంతో ఒక్కోరు రెండు, మూడు హాస్టళ్లను కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.హాస్టల్‌లో ఉరివేసుకుని యువతి ఆత్మహత్య, లేదా యువకుడు బలవన్మరణం, లేదా హాస్టల్ భవనం పైనుంచి పడి మృతి, ఇలా వారంలో నాలుగుసార్లు పేపర్లలోనూ, టీవీలోనూ వార్తలు చూస్తూనే ఉన్నాం. వారికి ఏ వ్యక్తిగత కారణాలు ఉన్నప్పటికీ చనిపోతుంది మాత్రం హాస్టళ్లలో తీరాచూస్తే మాకేం సంబంధం లేదు. ఎలా చనిపోయిందో మాకు తెలియదు అంటూ సదరు నిర్వాహకులు తప్పింకుంటున్నారు. అటు పోలీసులు సైతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దాని విచారణ సాగిస్తుంటారు. ఇంత జరుగుతున్న హాస్టళ్ల నిర్వహణపై ఎవరూ స్పందించరు. కేవలం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కంటి తుడుపు చర్యలు తీసుకోవడం మినహా తిరిగి అటువైపు చూడరు అన్న ఆరోపణలు ఉన్నాయి. హాస్టల్ లో ఉండే వారి భద్రత కూడా నిర్వాహకులదే అనడంలో సందేహం లేదు. వేలకు వేలు డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే మెరుగైన వసతులు కల్పించాలని సూచించింది. హాస్టల్ విద్యార్థుల ఆహార విషయంలోనూ సదరు నిర్వాహకులు కనీస ప్రమాణాలు పాటించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి తిరిగి భోజనాలు పెడుతున్నా కనీస ప్రమాణాలు పాటించడం లేదని కొన్ని హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం చప్పిడి తిండి, నీళ్లచారు, ఉడికి ఉడకని భోజనం వడ్డిస్తున్నారని కన్నీటి పర్యాంతం అవుతున్నారు. వాటిని తినలేక, బయట హోటళ్ల నుంచి కొని తెచ్చుకునేందుకు డబ్బులు లేక కడుపు మాడ్చుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు.చాలా సార్లు మంచినీళ్లు తాగి పడుకున్న సందర్భాలు ఉన్నాయని కుములిపోతున్నారు. అలాగే ఎండకాలం వస్తే మంచినీటి సమస్య కూడా తీవ్రంగా వేధిస్తోందని అయినా తప్పడం లేదని హాస్టళ్లలో ఉంటున్నవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యున్నత ధర్మాసనం చెప్పినట్లు ఇప్పటికైనా సంబంధిత అధికారులు హాస్టళ్ల నిర్వహణపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అనుమతులు లేని హాస్టళ్లపై కూడా కొరడా ఝలిపించాలని విద్యార్థులు, ఉద్యోగులతో పాటు సాధారణ ప్రజానీకం కూడా కోరుతున్నారు.
No comments:
Post a Comment