Breaking News

07/11/2019

ల్యాండ్ మాఫియాల్లో రియల్ దందా

అదిలాబాద్, నవంబర్ 7, (way2newstv.in)
ఓ పెద్దాయన... పదవీ విరమణ తర్వాత పిల్లల భవిష్యత్ కోసం ఓ స్థలం కొంటాడు... అక్కడకు ఈ భూమి మాదని ఒకడొస్తాడూ... నిలువ నీడ కోసమో... చిన్నపాటి వ్యాపారం కోసమో... కొనుగోలు చేసిన భూమిలో నిర్మాణం మొదలు పెట్టగానే అది మా తాత భూమి అంటూ కాగితం చూపిస్తాడు మరొకడు. ఒకే భూమిని ఇక్కడ పది మందికి అమ్ముతుంటారు..! రిజిస్ట్రేషన్లు కూడా చేస్తుంటారు..! ఈ ఆగడాల నేపథ్యంలో... ఎదురు తిరిగితే బెదిరింపులు... దాడులు... కోర్టు నోటీసులు వెరసి ఇక్కడ భూ దందా కోరులు అసాంఘిక కార్యక్రమాలతో దర్జాగా రాజ్యమేలుతున్నారు. రియల్ దందాలో ఒక భయనక వాతావరణం జూలు విప్పుకుంటుంది. చెప్పుకోవడానికి సినిమా స్టోరీల్లా ఉన్నా... పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని సింగరేణి కోల్‌బెల్ట్ ప్రాంతంలో కొంత కాలంగా నెలకొన్న వాస్తవ పరిస్థితులివి. 
ల్యాండ్ మాఫియాల్లో రియల్ దందా

భూదందాల వ్యవహారాల్లో ల్యాండ్ మాఫియాలు రౌడీ షీటర్లను పెంచిపోషిస్తున్నారన్న అపవాదు కూడా ఇక్కడ బాహాటంగానే వినిపిస్తుంది. భూముల కొనుగోళ్లలో సంబంధం ఉన్నా... లేకున్నా... రాజకీయ నేతలు, అధికారులు, రౌడీ షీటర్లు అంతా కూడా కమీషన్ల కోసం భూ దందా కోరులకు అండగా నిలుస్తూ ఈ దందాను మరింత విస్తృతం చేస్తారన్న ఆరోపణలు కూడా మస్తుగానే ఉన్నాయి. అన్నివర్గాల ‘పెద్ద’లను శాసించే స్థాయికి ఎదిగిపోతున్న భూదందాల కథకమామిషు ఇది. కొందరు కింది స్థాయి పోలీసులనే రక్షణగా వాడుకుంటోన్న అసహజ, అనైతిక, అన్యాయమైన ధోరణి ఇది..! రెవెన్యూ అధికారులనూ నయానో... భయానో... మచ్చిక చేసుకొని అమాయకులపై చెలరేగిపోతున్న నయా చోరుల వాస్తవ గాథ ఇది. పారిశ్రామిక ప్రాంతం కావడం, మొదటి నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ప్రముఖమైన ప్రాంతంగా పేరొందడం... జాతీయ-అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పుణికి పుచ్చుకోవడం వంటి పరిస్థితులకు తోడు... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత భూముల విలువ అమాంతం పెరిగిపోవడం ఈ పరిణామాలకు ప్రధాన కారణంగా మారింది. ఇదే అదునుగా తొందరగా ఆర్థికంగా స్థిరపడాలని కొందరు ఈ రియల్ భూ దందాలను ఎన్నుకున్నట్టు తెలుస్తోంది.  ఒకరిపై రిజిస్ట్రేషన్లున్న మరొకరు అంతకు ఎక్కువ ధరలిచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ భూ గొడవలకు ఆజ్యం పోస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ పరిణామాలల్లో ఘర్షణలు, ఇవి చిలికిచిలికి గాలివానలా ఆగకుండా భూ వివాదాల సమస్యల నేపథ్యం హత్యలకు కూడా దారి తీసే పరిస్థితులు ఇక్కడున్నాయి. గతంలో గోదావరిఖనిలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దార వీరాస్వామి భూ వివాదాల నేపథ్యంలో దారుణ హత్యకు గురైన ఘటన సంచలనమైంది. అంతేగాకుండా బెల్లంపల్లి ప్రాంతానికి చెందిన మంద రవి అనే వ్యక్తి కూడా భూ వివాదాల కారణంగానే హత్యకు గురైన్నట్టు, మరికొందరు ప్రత్యేక్ష దాడులకు తెగపడ్డారన్న సందర్భాలు కూడా అనేకం చోటు చేసుకున్నాయి. అదేవిధంగా గోదావరిఖనిలో అరుకోల్ల శ్రీనివాస్ అలియాస్ బుగ్గ శ్రీను అనే విలేఖరి హత్యకు కూడా భూ వివాదాల సమస్యే కారణంగా అప్పుడు ఇక్కడ చర్చ జరిగింది.కమీషనరేట్ ఏర్పడ్డ తరువాత అసాంఘిక శక్తుల ఆటను ఎప్పటికప్పుడు పసిగడుతూ చెక్ పెడుతున్నా... కొందరి రాజకీయ నేతలు, కొందరి అధికారుల అండ దండలతో పావులు కదుపుతూ భూ మాఫియా పెట్రేగిపోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సవాలుగా మారుతున్న ఈ రియల్ భూ దందాను కూకటి వేళ్లతో పెకిలించి వేయాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. భూములు కొనుగోలు చేయాలన్న ఆలోచనలో ఉన్న వాళ్లకు ఈ మాఫియా శాపంగా దాపురించిందని... ఈ భూ మాఫియాను సమూలంగా అణచివేసి శాంతి భద్రతలను పరిరక్షించాలని ప్రజానీకం కోరుతోంది.

No comments:

Post a Comment