Breaking News

07/11/2019

ప్రైవేటీకరణ దిశగా రైల్వే అడుగులు

హైద్రాబాద్, నవంబర్ 6 (way2newstv.in)
రైల్వేల ఆస్తుల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు జోరందుకున్నాయి. రైల్వే బోర్డ్ ఆదేశాలను పాటిస్తూ స్థానిక రైల్వే అధికారులు ప్రైవేటీకరణకు టెండర్లు పిలుస్తున్నారు. రైల్వేల ఆస్తులను 99 సంవత్సరాల పాటు ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇవ్వడానికి రైల్వే బోర్డ్ నిర్ణయించింది. దీంతో దక్షిణ మధ్య రైల్వేకి చెందిన వందల కోట్ల రూపాయల విలువైన స్థలాలు ప్రైవేట్ పరం కానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే  పరిధిలోని ఆరు డివిజన్లలో ఉన్న ఆస్తులను ప్రైవేట్‌కు అప్పజెప్పడంతో వాటి నుంచి గణనీయమైన ఆదాయం వస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ కేంద్రంగా ఉన్న సికింద్రాబాద్ స్టేషన్ ప్రయాణికుల సౌకర్యం కోసం పూర్తిస్థాయిలో ప్రైవేటీకరణకు పచ్చజెండా ఊపారు. రైల్వేల స్థలాలను ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు రైల్వే బోర్డ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 
 ప్రైవేటీకరణ దిశగా రైల్వే అడుగులు

రైల్వే ఆస్తులను పర్యవేక్షించడానికి రైల్వే ల్యాండ్ డెవలప్‌మెంట్ అథారిటి  కార్యాచరణకు సిద్ధం అవుతోంది. రైల్వే స్థలాల్లో షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్లు, హోటళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్, రెసిడెన్సియల్ అపార్ట్‌మెంట్ల నిర్మాణ సంస్థలకు లీజ్ పద్ధతిలో అప్పగించేందుకు ఏర్పాట్లు చరుకుగా జరుగుతున్నాయి. ప్రాంతాలు, భూముల విలువలను అంచనా వేయడానికి ఆర్‌ఎల్‌డీఏ పర్యవేక్షిస్తోంది. సికింద్రాబాద్ మెట్టుగూడ మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో దాదాపు 2.36 ఎకరాల రైల్వే మిలీనియం పార్క్ స్థలాన్ని లీజుకు ఇవ్వడానికి టెండర్లు సిద్ధం అయ్యాయి. ఈ స్థలానికి సంబంధించి ప్రైవేట్ సంస్థలు టెండర్లలో పాల్గొనడానికి డిసెంబర్ వరకు గడువును ప్రకటించింది. వౌలాలిలో దాదాపు 22 ఎకరాలను ప్రైవేట్‌కు అప్పజెప్పనున్నారు. మౌలాలి భూముల విలువ దాదాపు రూ. 100 కోట్లు ఉండవచ్చునని రైల్వే వర్గాలు అంచానా వేస్తున్నారు. దక్షిణ మధ్య పరిధిలో ఉన్న డివిజన్లు సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్, తూర్పు దక్షిణ మధ్య రైల్వేలో ఉన్న గుంతకల్ విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లో ఉన్న విలువైన రైల్వే భూములను లీజుకు ఇవ్వడానికి ఆర్‌ఎల్‌డీఏ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఆదాయం గణనీయంగా ఉంటుందన్న ప్రాంతల్లో మాత్రం 49 సంవత్సరాలకే లీజు ఉంటుందని ఆర్‌ఎల్‌డీఏ స్పష్టం చేస్తోంది.

No comments:

Post a Comment