Breaking News

10/10/2019

కార్పొరేట్ స్టైల్ లోకి మారిన కమలం

న్యూఢిల్లీ, అక్టోబరు 10 (way2newstv.in)
భారతీయ జనతా పార్టీ పూర్తిగా మారిపోయింది. ఆనాటి పార్టీ బీజేపీ కాదన్నది వాస్తవం. పాలనలోనూ, పార్టీలోనూ తీసుకుంటున్న నిర్ణయాలు కాషాయం పార్టీ మూల సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నాయనే చెప్పాలి. అయితే ప్రస్తుతానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల క్రేజ్ దేశవ్యాప్తంగా నడుస్తుండటంతో వారి నిర్ణయాలకు తిరుగులేకుండా పోయింది. వారికి అడ్డుచెప్పే వారు కూడా లేకుండా పోయారు. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికలోనూ మోడీ, షాలు విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.గతంలో పార్టీ సిద్ధాంతాలను తెలిసిన వారిని, సంఘ్ పరివార్ లో పనిచేసి పార్టీ కోసం కష్టపడిన వారిని అభ్యర్థులుగా ఎంపిక చేసేవారు. గెలుపోటములు గతంలో చూసేవారు కాదు. అద్వానీ, వాజ్ పేయి హయాం వరకూ అలాగే నడిచింది. 
కార్పొరేట్ స్టైల్ లోకి మారిన కమలం

పార్టీ రాష్ట్ర కార్యవర్గం అభ్యర్థుల ఎంపికను ఎక్కువగా చేపట్టేది. అభ్యర్థుల ఎంపికలో అప్పట్లో కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకునేది కాదు. ఫలితాల తర్వాత గెలుపోటములపై కేంద్ర నాయకత్వం విశ్లేషణలు చేసేది.కానీ మోదీ, షాల హయాంలో పరిస్థితి పూర్తిగా మారింది. రాష్ట్ర పార్టీ నాయకత్వం నామమాత్రంగా మారింది. సర్వే నివేదికలు, స్టార్ డం ఉన్న వారినే అభ్యర్థులుగా ఎంపిక చేస్తూ వస్తున్నారు. నేరుగా అమిత్ షా అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తున్నారు. స్థానిక నేతల అభిప్రాయాలు కొంత మేర తీసుకున్నప్పటికీ ఎక్కువగా ప్రజాదరణ ఉన్న వారికే టిక్కెట్లు కేటాయిస్తూ వస్తున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, ఢిల్లీ లోక్ సభ ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. ఢిల్లీలో క్రికెటర్ గౌతమ్ గంభీర్ ను ఎన్నికల బరిలోకి దింపి బీజేపీ గెలిపించుకుంది.ఇక తాజాగా హర్యానా రాష్ట్ర ఎన్నికల్లో కూడా ఇదే తంతు మొదలయింది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని ఇక్కడా పక్కన పెట్టారు. రెజ్లర్ యోగీశ్వర్ దత్, బబితా ఫొగట్, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ లకు టిక్కెట్లు కేటాయించారు. వీరితో పాటు టిక్ టాక్ వీడియోలతో హర్యానాలో ఫేమస్ అయిన సొనాలికి కూడా టిక్కెట్ దక్కిందంటే బీజేపీ కేంద్ర నాయకత్వం ఏ రూట్లో వెళుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దీంతో టిక్కెట్లు దక్కని బీజేపీ నేతలు ఇప్పుడు రెబెల్స్ గా మారారు. మొత్తం మీద మోడీ, షాలు కాషాయ పార్టీ రంగు తప్ప రుచి, వాసనలన్నీ మార్చేస్తున్నారు

No comments:

Post a Comment