Breaking News

10/10/2019

కాకాని వర్సెస్ కోటంరెడ్డి

నెల్లూరు, అక్టోబరు 10 (way2newstv.in)
వైసిపి ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి నెల్లూరు జిల్లాలో పార్టీ నేతల నడుమ ఆధిపత్య పోరు తలపోటుగా మారింది. తాజాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాణి గోవర్ధన రెడ్డి నడుమ అంతర్యుద్ధం తో అధినేత జగన్ కి కొత్త సమస్యలు మొదలు అయ్యాయి. పది స్థానాలకు పది గెలుచుకుని నెల్లూరు జిల్లాలో వైసిపి క్లిన్ స్వీప్ చేసి టిడిపి కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అలాంటి జిల్లాలో నేతల నడుమ సఖ్యత కొరవడటం తో పార్టీ బలం సన్నగిల్లుతోందని సంకేతాలు పంపిస్తుంది.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంపిడివో ను బెదిరించిన కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై విడుదల అయ్యారు. ఆ తరువాత ఈ కేసు వెనుక తమ పార్టీ ఎమ్యెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి ఉన్నారంటూ సంచలన ఆరోపణలు సంధించారు. ఈ వివాదంపై జగన్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. 
కాకాని  వర్సెస్ కోటంరెడ్డి

ఎమ్యెల్యే ల నడుమ గొడవ చిలికి చిలికి గాలివాన అవుతుండటం తో అధిష్టానం దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. అందులో భాగంగా నెల్లూరు లోని వైవి సుబ్బారెడ్డి ని ఈ పంచాయితీ పెద్దగా పెట్టారు జగన్. ఇద్దరు ఎమ్యెల్యేలకు అంతకుముందే అధినేత తలంటు పోశారని అంటున్నారు. దాంతో వైవి ఇంట్లో పెద్దమనుషుల సమక్షంలో ఇద్దరు యుగళగీతం పాడేశారు.రాజకీయాలు చిత్రంగా ఉంటాయి. రక్త సంబంధీకులైనా శత్రువులు గా ఉండొచ్చు. అవసరం కోసం శత్రువులు మిత్రులుగాను క్షణంలో మారిపోతారు. ఇప్పుడు అదే జరిగింది. అధిష్టానం వార్నింగ్ తో దారికొచ్చిన నేతల విభేదాలు అలానే కనిపిస్తున్నాయి. కాకాని పై ఒంటికాలిపై నేటి వరకు లేచిన కోటంరెడ్డి క్లైమాక్స్ లో మంచి ముక్తాయింపు ను ఇచ్చి మీడియా కు పార్టీ శ్రేణులకు షాక్ ఇచ్చారు. కాకాణి ఎవరో కాదని స్వయంగా తన మేనమామ అని రొట్టెల పండగ చూస్తా అంటే తాను స్వయంగా వెళ్లి ఆయన కుటుంబాన్ని మొత్తం తీసుకువచ్చామని అంటూ ఇక గొడవల్లేవనే సంకేతాలు ఇచ్చేశారు. వైవి ఇంట్లో కూడా తమ మధ్య జరిగింది పంచాయితీ కాదని రాబోయే ముఖ్యమంత్రి పర్యటన కోసం ఏర్పాట్ల కోసమంటూ చెప్పడం విశేషం. ప్రస్తుతానికి ఈ వివాదం సద్దుమణిగినా నెల్లూరు వైసిపి లో మాత్రం నేతల నడుమ సఖ్యత అంత అంత మాత్రమే అన్నది పబ్లిక్ టాక్.

No comments:

Post a Comment