Breaking News

02/10/2019

సోషల్ మీడియా కేంద్రంగా విమర్శలు

హర్షకుమార్ టార్గెట్
రాజమండ్రి, అక్టోబరు 2, (way2newstv.in)
విపక్ష నేతలకు కేసులతో చుక్కలు చూపిస్తున్న జగన్ సర్కార్ తాజాగా ఏ పార్టీలో లేని ఒక మాజీ ఎంపీ పై న్యాయస్థాన సిబ్బంది పెట్టిన కేసులో వేట మొదలు పెట్టింది. అమలాపురం మాజీ ఎంపి కోస్తాలో గట్టి పట్టున్న దళిత నేత జివి హర్ష కుమార్ కొద్ది రోజుల క్రితం రాజమండ్రి కోర్టు ఆవరణలో నాలుగు దశాబ్దాలుగా వున్న కొన్ని కుటుంబాలను రెవెన్యూ విభాగం ఖాళీ చేయిస్తుండగా అడ్డు తగిలారు. వారికి ప్రత్యామ్నాయం చూపకుండా 24 గంటలు కూడా సమయం ఇవ్వకుండా ఎలా ఖాళీ చేయిస్తారంటూ నిలదీశారు. హై కోర్టు నుంచి స్టే వచ్చే సమయానికి ఆ స్థలం లో ఏమి లేనట్లు చూపాలన్న యంత్రాంగం తీరుపై విమర్శలు గుప్పించారు. గుండాల మాదిరి ఇల్లు కూలగొట్టడాన్ని హర్ష కుమార్ ప్రశ్నించారు. 
సోషల్ మీడియా కేంద్రంగా విమర్శలు

మాజీ ఎంపీ జివి హర్ష కుమార్ బాధితుల తరుపున పోరాడుతున్న సందర్భంలోనే హై కోర్టు నుంచి స్టే మంజూరు అయ్యింది. ఈ సందర్భంలో ఆయన జిల్లా జడ్జి పైనా వైసిపి ప్రభుత్వం అధికారుల వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. పేదలకు న్యాయం చేయాలిసిన వారే గుండాల మాదిరి ఎలా వ్యవహరిస్తారంటూ ఘాటుగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో జివి హర్ష కుమార్ పై జ్యుడీషియరీ విభాగానికి చెందిన సిబ్బంది కేసు పెట్టారు. తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ ఈ కేసులో ఆరోపించారు.వైసిపి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదిక ద్వారా మాజీ ఎంపి జివి హర్ష కుమార్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పనిలో పనిగా టిడిపి ని వదిలిపెట్టడం లేదు. తాను ఏ పార్టీలో లేనని ప్రజల తరపున ప్రశ్నలు వేస్తానంటూ ఆయన స్పందిస్తున్నారు. ఇటీవల గోదావరి లో బోటు ప్రమాదం జరిగినప్పుడు సైతం హర్ష కుమార్ జగన్ సర్కార్ పనితీరుపై నిప్పులే కురిపించారు. బోటు ప్రమాదం జరిగిన సందర్భంలో 93 మంది అని సర్కార్ వారి వివరాలు బయటకు రాకుండా జలసమాధి చేసిందంటూ ఆరోపించారు. మంత్రి అవంతి శ్రీనివాసరావు వత్తిడి వల్లే వరద ఉన్నా బోటు ను పోలీసులు అనుమతించాలిసి వచ్చిందంటూ బాంబులు పేల్చారు. బాధితుల పక్షాన తాను పోరాడతా అంటూ రంగంలోకి దిగారు. బోటు వెలికి తీయాలంటూ పదేపదే ఆందోళన మొదలు పెట్టారు. అంతేకాదు అఖిలపక్షం సమావేశంలో ముఖ్యమంత్రి పైనా, మంత్రులు అధికారులపై విమర్శల దాడిని జివి హర్ష కుమార్ కొనసాగిస్తూ వస్తున్నారు.హర్ష కుమార్ రోజుకో రకంగా తలపోటుగా మారుతున్న నేపథ్యంలోనే జ్యుడీషియరీ సిబ్బంది పెట్టిన కేసు ప్రభుత్వానికి చక్కని అవకాశంగా అందివచ్చింది. దాంతో రంగంలోకి దిగిన పోలీస్ బృందాలు భారీ సంఖ్యలో ఆయన ఇల్లును చుట్టుముట్టి అరెస్ట్ కి ప్రయత్నం చేశాయి. అయితే పోలీసుల మోహరింపు ముందే గమనించిన హర్ష కుమార్ తన కారులో వారిముందే అతివేగంగా దూసుకువెళ్లారు. అలా వెళ్ళిన హర్ష కుమార్ కట్ చేస్తే ఢిల్లీ లో తేలారు.పోలీసులు తనను అన్యాయంగా నమోదు చేసిన కేసులో లోపల పెట్టాలని చూశారని వారినుంచి తప్పించుకుని వచ్చేశానని వారు ఛేజ్ చేసినా పట్టుకోలేక పోయారన్నారు. పారిపోయే పిరికి వాడిని కాదంటూ తన ఫేస్ బుక్ లైవ్ లో వీడియో విడుదల చేశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం తనను తరచూ గృహ నిర్బంధానికి గురి చేసి ప్రశ్నించే వారి నోరు మూయించాలని చూసిందని జగన్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తుందని తన వీడియో లో జివి హర్ష కుమార్ చెప్పుకొచ్చారు. అక్రమ కేసులు పెట్టి తనను వేధించలేరని ఇలాంటివి ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసన్నారు. ఒక పేద కుటుంబానికి అండగా నిలిచిన పాపానికి తప్పుడు కేసులు పెట్టారని జ్యుడీషియరీ సిబ్బందిని, మహిళలపై దౌర్జన్యం చేశారని నమోదైన కేసు నిజాయితీగా విచారించి ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. బోటు ప్రమాదంలో నిజాలు చెబుతున్నందునే ఇవన్నీ చేస్తున్నారని జివి హర్ష కుమార్ ఆరోపించారు.వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఎందుకు ఛేదించలేదని ? కోడి కత్తి కేసు తనకు ప్రాణ హానీ ఉందని ఎందుకు రక్షణ కోరుతున్నారని ? విద్యుత్ కోతలు లేకుండా చంద్రబాబు నుంచి పాఠాలు నేర్చుకోవాలంటూ ఒకటి కాదు రెండు కాదు హర్ష కుమార్ పలు ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ పాలన సరిగా లేదని తన కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులకు మేలు చేశామని వైసిపి ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. తనకు ఎలాంటి మచ్చ లేదని తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించలేదంటూ తనపై అవినీతి మరకలు లేవంటూ చెలరేగిపోయారు హర్ష కుమార్. తనను అరెస్ట్ చేసి తీరాలని జగన్ ఇచ్చిన ఆదేశాలతోనే తన ఇల్లును పోలీసులు చుట్టుముట్టారని ధ్వజమెత్తారు.హర్ష కుమార్ ను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులకు చేదు అనుభవమే ఎదురైంది. ఆయన దొరక్క పోగా ఢిల్లీ లో ప్రత్యక్షమై ప్రభుత్వంపైనా పోలీసులపైనా తిరిగి ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుండంతో ఖాకీలు తలపట్టుకుంటున్నారు. తాజాగా హర్ష కుమార్ ఈ కేసుపై కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాకే ఇక రాజమండ్రి వస్తారన్న క్లారిటీ రావడంతో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. హర్షకుమార్ ను అరెస్ట్ చేస్తారా ఆయన బెయిల్ తెచ్చుకుంటారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. మరోపక్క హర్ష కుమార్ కదలికలపై ఇంటెలిజెన్స్ నిరంతర నిఘా కొనసాగిస్తుండటం విశేషం.

No comments:

Post a Comment