Breaking News

31/10/2019

మూడో ఓటమిని మూటగట్టుకున్న పీసీసీ ఛీఫ్

నల్గొండ, అక్టోబర్ 31, (way2newstv.in)
తెలంగాణ కాంగ్రెస్ టిపిసిసి అధ్యక్ష పదవిపై ఉత్కంఠ కొనసాగుతోందా....? వరుసగా పార్టీ మూడు ఎన్నికల్లో ఓటమిని చవిచూడ్డంతో, పార్టీ అధ్యక్షున్ని మార్చడం ఖాయమా..? తన సిట్టింగ్ సీటు కూడా గెలిపించుకోక పోవడంతో, ఉత్తమ్‌పై ఒత్తిడి పెరుగుతోందా...? మున్సిపల్ ఎన్నికల వరకు అధిష్టానం వేచి చూస్తుందా...? లేదంటే అంతలోపే ప్రెసిడెంట్‌ను ప్రకటిస్తుందా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములు చవిచూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఇటీవల ముగిసిన ఉప ఎన్నికల వరకు పార్టీ ఆశించిన విజయాలు మూట గట్టుకోలేకపోయింది. అసెంబ్లీ, పార్లమెంటు, ఉపఎన్నికల్లో ఎక్కడ హస్తం పార్టీ తన స్థాయికి దగ్గ సీట్లను దక్కించుకోలేక చతికిలపడింది. 
మూడో ఓటమిని మూటగట్టుకున్న పీసీసీ ఛీఫ్

పార్లమెంటు ఎన్నికల్లో మూడు సీట్లు గెలిచి కాస్త గౌరవం దక్కేలా ప్రదర్శన చేసినా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెంది బొక్కబోర్లా పండింది.  దీంతో మరోసారి తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలపై పార్టీలో జోరుగా ఊహగానాలు వినిపిస్తున్నాయి. హుజూర్ నగర్ ఉపఎన్నికల ఫలితం తరువాత రోజు ఉదయాన్నే పిసిసి అధ్యక్షుడు ఉత్తం ఢిల్లికి చేరడంతో, పార్టీలో పిసిసి పగ్గాలు మారుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోనే ఉత్తంను పిసిసి పదవి నుంచి మారుస్తారని ప్రచారం జరిగినా, పార్లమెంటు ఎన్నికల్లో కొత్తవారికి పార్టీని లీడ్ చేయడం సాధ్యం కాదని చర్చ సాగింది. ఇక తన సొంత సిట్టింగు సీటును కూడా ఉత్తంకుమార్ రెడ్డి దక్కించుకోలేపోవడంతో, ఉత్తమ్‌కు మరింత ఇబ్బందికరంగా మారింది. సొంతపార్టీ నేతలే పిసిసి పదవి మారడం ఖాయమని జోరుగా చర్చించుకుంటున్నారట. తన సీటును గెలుపుంచుకోలేని నాయకుడు, రాష్ట్రంలో పార్టీని ఎలా బాగు చేస్తాడనే విమర్శలు కూడ పార్టీలో వినిపిస్తున్నాయి. అయితే పిసిసి అధ్యక్షుడు ఉత్తం ఇప్పటికే పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి హూజూర్ నగర్ ఓటమిపై నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్దం అవుతుండడంతో, ఇప్పటికిప్పుడు పిసిసి మార్పు సాధ్యం కాదనే చర్చ కూడా పార్టీలో వినిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఇక ఎన్నికలు ఉండవు కాబట్టి, కొత్తగా బాధ్యతలు తీసుకునే వారికి పార్టీని చక్కదిద్దుకోవడానికి సమయం దొరుకుందనే ప్రచారం కూడా పార్టీలో ఉంది. ఇప్పటికే ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవిపై కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన సైతం మున్సిపల్ ఎన్నికలు కూడా పాత పిసిసి సారథ్యంలోనే జరగాలన్న భావనతో ఉన్నట్లు సమచారం. మున్సిపల్ ఎన్నికల తరువాతనే అధిష్టానం సైతం కొత్త పిసిసిని నియమించే అవకాశమున్నట్లు ఢిల్లి వర్గాలు చర్చించుకుంటున్నాయి. హూజూర్ నగర్ ఓటమి తరువాత పిసిసి అధ్యక్షున్ని మార్చడానికి పార్టీ సిద్దంగా ఉన్నా, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అందుకు సిద్దంగా లేవు. ఇప్పటికిప్పుడు పిసిసిని మార్చినా అందుకు సిద్దంగా ఉండి పార్టిని నడిపంచే ప్రత్యమ్నాయ నేత కూడ రడీగా లేడు. ప్రత్యామ్నాయ నేతను సైతం, మూకుమ్మడిగా అంగీకరించే పరిస్థితి కాంగ్రెస్‌లో వుండే అవకాశం లేదు. దీంతో పీసీపీ మార్పు కాంగ్రెస్‌ అధిష్టానానికి సైతం కత్తిమీద సాములా మారింది.

No comments:

Post a Comment