Breaking News

03/10/2019

ప్రైవేట్ సోలార్ ప్రాజెక్టుల పేరుతో అక్రమాలు

అనంతపురం, అక్టోబరు 3, (way2newstv.in)
అనంతపురం జిల్లాల్లో  ప్రైవేటు సోలార్‌ ప్లాంట్ల అక్రమాలను ఫొటో ఆధారాలతో సహా నిరూపించేందుకు విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం ‘గూగుల్‌ ఎర్త్‌’ను వినియోగించుకునేందుకు డిస్కంలు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాయి. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకున్న సామర్థ్యానికి మించి సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అది కూడా సోలార్‌ విద్యుత్‌ ధరలు భారీగా తగ్గుతున్న క్రమంలో.. అదనపు సామర్థ్యాన్ని జోడించడం ద్వారా అదనపు విద్యుత్‌ను ఉత్పత్తి చేసి అధిక ధరను డిస్కంల నుంచి కాజేశాయనేది ప్రధానమైన విమర్శగా ఉంది. పీపీఏ చేసుకున్న తర్వాత 12 నెలల కాలంలో నెలకొల్పాల్సిన విద్యుత్‌ ప్లాంట్లను ఆ తర్వాత కూడా అదనపు సోలార్‌ ప్యానల్స్‌ను ఏర్పాటు చేసి అదనపు విద్యుత్‌ను ఆ సంస్థలు ఉత్పత్తి చేశాయి. 
ప్రైవేట్ సోలార్ ప్రాజెక్టుల పేరుతో అక్రమాలు

ఈ విధంగా 619 మెగావాట్లకు కుదిరిన పీపీఏలతో ఏకంగా 950 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లను నెలకొల్పాయి. వాస్తవానికి సోలార్‌ విద్యుత్‌ ధరలు క్రమంగా తగ్గి యూనిట్‌ ధర రూ. 2.50కు కూడా పడిపోయింది. అయినా ఈ ప్రైవేటు సోలార్‌ ప్లాంట్లు మాత్రం.. పాత ధర అంటే రూ. 6.80 చొప్పున బిల్లులు చేసుకున్నాయి. దీనికి సబంధించి గూగుల్‌ ఎర్త్‌ ద్వారా ఆధారాలు సేకరించి వాటికి చెక్‌ పెట్టేందుకు డిస్కంలు సిద్ధమయ్యాయి.  వాస్తవానికి 500 మెగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు 2014 ఆగస్టులో డిస్కంలు టెండర్లను పిలిచాయి. అయితే, అప్పటి సీఎం చంద్రబాబు బంధువు కోసం 500 619 మెగావాట్లకు పెంచి.. 14 కంపెనీలకు బదులు 19 కంపెనీలతో యూనిట్‌ విద్యుత్‌ ధర రూ. 6.80గా పీపీఏలను ప్రభుత్వం చేసుకుంది. 2015 జనవరిలో లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌ఓఐ)ను అందజేసిన డిస్కంలు.. 12 నెలల్లో ప్లాంట్లను ఏర్పాటు చేసి విద్యుత్‌ను సరఫరా చేయాలని పీపీఏలో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ తర్వాత సోలార్‌ ప్యానల్స్‌ ధరలు అంతర్జాతీయంగా తగ్గడంతో సోలార్‌ విద్యుత్‌ ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ ధరలు రూ. 2.50కి తగ్గిపోయిన క్రమంలో ప్రైవేట్‌ సోలార్‌ ప్లాంట్లు దోపిడీకి స్కెచ్‌ వేశాయని తెలుస్తోంది. 619 మెగావాట్లకు పీపీఏలు కుదరగా.. ఏకంగా 950 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌ ప్లాంట్లను నెలకొల్పాయి.ఈ పెరిగిన 950 మెగావాట్లకు యూనిట్‌కు రూ. 6.80 చొప్పున డిస్కంలు బిల్లులు చెల్లిస్తూ వస్తున్నాయి. అయితే, ఈ విషయం ట్రాన్స్‌కో విజిలెన్స్‌ విచారణలో గతంలోనే తేలినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయాన్ని పక్కనపెట్టింది. ఇటీవల మొత్తం 19 కంపెనీలలో ట్రాన్స్‌కో విజిలెన్స్‌ విభాగం తనిఖీలు నిర్వహించగా.. 8 నుంచి 54 శాతం వరకూ అధిక సామర్థ్యంతో ప్లాంట్లను నెలకొల్పినట్టు తేలింది. ఇందుకు అనుగుణంగా ఈ అదనపు సామర్థ్యాన్ని ఎప్పుడెప్పుడు సదరు కంపెనీలు నెలకొల్పాయనే అంశాన్ని నిరూపించేందుకు గూగుల్‌ ఎర్త్‌ ద్వారా పాత ఫొటోలను సేకరించి ఆధారాలతో సహా నిరూపించాలని డిస్కంలు భావిస్తున్నాయి.

No comments:

Post a Comment