Breaking News

22/10/2019

కుయ్..కుయ్ నడిపేందుకు ఫార్మా కంపెనీలు

వరంగల్, అక్టోబరు 22 (way2newstv.in)
108 అంబులెన్సులు నడిపేందుకు బడా ఫార్మా కంపెనీలు ముందుకొస్తున్నయ్. ఇందుకు ప్రతిఫలంగా అంబులెన్సులపై తమ కంపెనీల లోగో ముద్రించుకుంటామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నయ్. ప్రస్తుతం అంబులెన్సులు నడిపించేందుకు ఏడాదికి సుమారు రూ.70 కోట్లు ఖర్చవుతుండగా.. నిర్వాహణ బాధ్యతలు తమకు ఇస్తే 30 నుంచి 40% భరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఓ సంస్థ సర్కారుకు దరఖాస్తు పెట్టుకుంది. 108 వాహనాలపై లోగో పెట్టుకుంటే తమకు రాష్ర్టవ్యాప్తంగా పబ్లిసిటీ లభిస్తుందని సదరు కంపెనీ భావిస్తోంది.ప్రస్తుతం ఎలాంటి ఖర్చు భరించకుండానే జీవీకే సంస్థ అంబులెన్సులపై తన లోగోను ముద్రించుకుంది. ఈ నేపథ్యంలో డబ్బులు పెట్టుకుంటామని ముందుకొచ్చిన సంస్థలకే నిర్వాహణ బాధ్యతలు ఇచ్చేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. 
కుయ్..కుయ్ నడిపేందుకు ఫార్మా కంపెనీలు

108 అంబులెన్సులు రాష్ర్టంలో ప్రస్తుతం 358 ఉన్నాయి. ఈ వాహనాలన్నీ ప్రభుత్వానివే, నిర్వాహణ బాధ్యతలు మాత్రం జీవీకే సంస్థ చూస్తోంది. ఉమ్మడి రాష్ర్టం నుంచే ఈ సంస్థకు నామినేషన్ పద్ధతిలో 108 నిర్వాహణ బాధ్యతలు అప్పగిస్తూ వచ్చారు. 2016లో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాన్ని రెన్యువల్ చేసింది. ఒప్పందం ముగియడంతో కొత్త 108 పాలసీ రూపొందిస్తున్నారు. ఇందుకోసం ఏపీ, ఢిల్లీ, గుజరాత్ సహా పలు రాష్ర్టాల్లో సక్సెస్‌‌ఫుల్‌‌గా అమలవుతున్న విధానాలను రాష్ర్ట వైద్యారోగ్యశాఖ అధికారులు స్టడీ చేశారు.ప్రస్తుతం రాష్ర్టాన్ని 333 సెగ్మెంట్లుగా విభజించి, సెగ్మెంట్‌‌కో 108 నడిపిస్తున్నారు. రూల్స్ ప్రకారం ఘటనా స్థలానికి 20 నిమిషాల్లో 108 చేరుకోవాల్సి ఉండగా, అంతకన్నా ఎక్కువ సమయం అవుతోంది. దీంతో సెగ్మెంట్ల సంఖ్యను పెంచాలని, 70 వేల జనాభాకు (ప్రస్తుతం లక్ష మందికి ఒక వాహనం చొప్పున ఉన్నాయి) ఓ వాహనం ఉండేలా 108 సంఖ్య పెంచాల్సిన అవసరముందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 108లో 790 మంది ఎమర్జెన్సీ మేనేజ్‌‌మెంట్ టెక్నీషియన్లు, 809 మంది డ్రైవర్లు, కాల్ సెంటర్‌‌‌‌లో 76 మంది సహా మొత్తం 1,781 మంది పని చేస్తున్నారు. వీళ్లంతా 12 గంటల చొప్పున రెండు షిఫ్టులుగా పని చేస్తున్నారు. అయితే 8 హవర్స్ చొప్పున 3 షిఫ్టులకు సరిపోయేలా ఉద్యోగుల సంఖ్యను పెంచాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 108ల నిర్వహణ వ్యయం మరింత పెరిగే అవకాశముంది. దీంతో టెండర్లు పిలిచి తక్కువ కోట్‌‌ చేసిన వాళ్లకు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.అంబులెన్స్‌‌ల నిర్వహణలో అనుభవం ఉన్నవాళ్లే టెండర్‌‌‌‌లో పాల్గొనేందుకు అర్హులుగా ప్రస్తుత రూల్స్ పేర్కొంటున్నాయి. టెండర్లు పిలిస్తే డబ్బులు పెట్టేందుకు ముందుకొస్తున్న ఫార్మా కంపెనీలకు కాంట్రాక్ట్ దక్కడం కష్టమేనని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇంతకుముందులాగే నామినేషన్‌‌ పద్ధతిలోనే ఎక్కువ డబ్బులు పెట్టేందుకు ముందుకొచ్చిన సంస్థకు 108 బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇలా చేస్తే ఎదురయ్యే సమస్యలు ఏంటో చెప్పాలని అధికారులను హెల్త్‌‌ మినిస్టర్‌‌‌‌ ఈటల రాజేందర్‌‌‌‌ ఆదేశించినట్టు తెలిసింది. అనుభవ లేమితో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశముందని, దీన్ని అధిగమించేందుకు ఏం చేయాలన్నదానిపై ఆలోచన చేస్తున్నామని  అధికారులు చెబుతున్నారు.

No comments:

Post a Comment