Breaking News

29/10/2019

ఉద్యాన పంటలకు అందని రాయితీ

నిజామాబాద్, అక్టోబరు 29, (way2newstv.in)
నవన పంటలకు ప్రభుత్వం సరైన ప్రోత్సాహం ఇవ్వట్లేదు. దీంతో నానాటికీ రాష్ట్రంలో కూరగాయల పంటలు, పూల తోటలు, పండ్ల తోటలు తగ్గిపోతున్నాయి. ప్రభుత్వం ఉద్యాన పంటలను నిర్లక్ష్యం చేయడంతో సాగు గణనీయంగా పడిపోయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాలుగేళ్లలోనే లక్ష ఎకరాలకుపైగా సాగు తగ్గింది. కేవలం వరి, పత్తి పంటలకే సర్కారు ప్రోత్సాహం ఇస్తుండడంతో ఉద్యాన పంటల సాగు తగ్గిపోతోంది. దీంతో కూరగాయలు, ఉల్లిగడ్డలు, సుగంధ ద్రవ్యాల కోసం పక్క రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఒకప్పుడు రాష్ట్రంలో ఉల్లిగడ్డల సాగు జోరుగా ఉండేదని, కానీ, ఇప్పుడు ప్రోత్సాహం లేకపోవడంతో దాని కోసం జనాలు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందంటున్నారు కొందరు. ఆ నిర్లక్ష్యమే కూరగాయల ధరలు పెరగడానికి కారణమవుతోందని చెబుతున్నారు. 
ఉద్యాన పంటలకు అందని రాయితీ

ఇతర పంటలపై ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధలో ఒక్క శాతం ఉద్యానవన పంటలపై పెట్టినా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.రాష్ట్రంలో ఒకప్పుడు బంతిపూలు, చేమంతి పూలు విరగబూసేవి. ఇప్పుడు మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్ర అవసరాలకు సరిపోయే దాంట్లో ఎక్కువ భాగం పూలు హైదరాబాద్ శివార్లలో పూసేవి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లిల్లీ, జర్బేరా, ఇతర విదేశీ పూల జాతుల పెంపకమూ తగ్గిపోయింది. వాటిని బెంగళూరు నుంచి దిగుమతి  చేసుకుంటున్నాం. శంషాబాద్, పాలమాకులతోపాటు హైదరాబాద్‌లోని ఇతర శివార్లలో ఒకప్పుడు ద్రాక్ష పంటలు బాగా పండేవి. వాటితోపాటు అంజీర్‌, జామ, బొప్పాయి, సీతాఫలాలు పండేవి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో నిమ్మ, బత్తాయి తోటలు బాగా ఉండేవి. కానీ, ఇప్పుడవి కనిపించట్లేదు. దానంతటికీ కారణం ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందకపోవడమేనన్న విమర్శలున్నాయి. సుగంధ ద్రవ్యాల పంటల సాగులోనూ అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్లపై ఆధారపడుతున్నాం.గత ఏడాది కొద్దో గొప్పో నిధులిచ్చినా ఈ ఏడాది మాత్రం పూర్తిగా దాని ఊసే మరిచిపోయింది. గత ఏడాది రూ.280.41 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం, రూ.172.01 కోట్లు విడుదల చేసింది. ఈ ఏడాది మాత్రం రూ.1.03 కోట్లే ఇచ్చింది. ఉద్యాన పంటల ప్రోత్సాహానికి గానూ కేంద్ర ప్రభుత్వం మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేస్తోంది. దానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించడంలో సర్కారు నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాది కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటాగా రూ.108.40 కోట్లు ఇచ్చిన సర్కారు, ఇప్పుడు రూ.18 కోట్లు మాత్రమే ఇచ్చింది. హార్టికల్చర్ ప్రమోషన్కు గానీ, పాలిహౌస్లకు గానీ ఒక్క పైసా ఇవ్వలేదు. ఈ కేటాయింపులే ఉద్యాన పంటలపై సర్కార్ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

No comments:

Post a Comment