Breaking News

29/10/2019

కర్నూలులో స్వైన్ ఫ్లూ కేసులు

కర్నూలు, అక్టోబరు 29, (way2newstv.in)
స్వైన్ ప్లూ జిల్లా ప్రజలను వణికిస్తుంది. స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌ కేసుల సంఖ్య మిగతా జిల్లాలతో పోలిస్తే సాధరణంగానే ఉన్నప్పటికీ మృతుల సంఖ్య అన్ని జిల్లాలకంటే ఎక్కువనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఇప్పటిదాకా దాదాపు 30 స్వైన్‌ప్లూ కేసులు నమోదుకాగా 11 మంది మృతి చెందారు. జిల్లా అధికార యంత్రాంగం స్వైన్‌ఫ్లూపై నిర్ధిష్టమైన నివారణ చర్యలు చేపట్టకపోవడంతోనే జిల్లాలో కేసుల నమోదు, మరణాల సంఖ్య గణనీయంగా ఉందని వైద్యులు అభిప్రాయ పడుతున్నారు. చికిత్సను అందించాల్సిన కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో సరైన వైద్య సేవలందించకపోవడం మూలంగానే స్వైన్‌ప్లూ మృతుల సంఖ్య పెరగడానికి కారణమైన పరిస్థితి ఉంది. 
కర్నూలులో స్వైన్ ఫ్లూ కేసులు

స్వైన్‌ప్లూపై ప్రభుత్వ, జిల్లా అధికార యంత్రాంగ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సిపిఎం ఆందోళనలను నిర్వహించింది. స్వైన్‌ఫ్లూ నివారణ చర్యలు వెంటనే తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.. నెలరోజుల వ్యవధిలో 25 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా..వీరిలో పది మంది మృతిచెందడం ఆందోళన కల్గించే విషయం.మిగిలిన వారిలో ఏడుగురు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం ఎనిమిది మంది కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వ్యాధికి గురైన వారిలో నలుగురు మాత్రమే ఇతర జిల్లాలకు చెందిన వారున్నారు. మిగతా 21 మంది ఈ జిల్లా వారే. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ గోనెగండ్ల మండలంలో ఒకరు ఈ వ్యాధికి గురై మరణించారు. ఇవి కర్నూలు సర్వజన ఆసుపత్రిలో నమోదైన లెక్కలు మాత్రమే. స్వైన్‌ఫ్లూ ఉందంటే ఎక్కడ దూరం పెడతారేమోనని భయపడి చాలా మంది ప్రైవేటు నర్సింగ్‌హోమ్‌లలోని వైద్యుల వద్ద చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. కర్నూలు కొత్తబస్టాండ్‌ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ముగ్గురు రోగులు చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు కేవలం కర్నూలు మెడికల్‌ కాలేజీలోని మైక్రోబయాలజీ విభాగంలో మాత్రమే ఉన్నా.. వ్యాధి లక్షణాలను బట్టి ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందిస్తున్నారు. స్వైన్‌ఫ్లూ పేరిట సాధారణ రోగులను కూడా భయపెట్టి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక ఆసుపత్రిలో పది మంది  స్వైన్‌ఫ్లూ రోగులు చికిత్స పొందుతున్నారు.  కొందరు ఐసోలేషన్‌ విభాగంలో ఉండగా, మరికొందరు ఏఎంసీలో చికిత్స తీసుకుంటున్నారు. మరికొందరు వ్యాధి లక్షణాలతో జనరల్‌ వార్డుల్లోనే ఉన్నారు. రోగులు జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, ఊపిరి తీసుకోలేకపోవడం వంటి లక్షణాలతో బాధపడుతుంటే వైద్యసిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ లక్షణాలు కనిపించిన వారందరికీ ముక్కులో స్వైప్‌ ద్వారా గళ్లను తీసి పరీక్షకు పంపిస్తున్నారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్న వారి వద్దకు కొంత మంది వైద్యసిబ్బంది, నర్సులు వెళ్లేందుకు జంకుతున్నారు. ఆసుపత్రిలోని నాల్గవ తరగతి సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు, పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా వారికి వైద్యసేవలు అందేలా పనిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి

No comments:

Post a Comment