Breaking News

19/10/2019

రాజధాని కోసం 30 వేల ఎకరాలు ఉండాల్సిందే

టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ
విజయవాడ అక్టోబర్ 19 (way2newstv.in)
భావితరాలను దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం చేపట్టారని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ అన్నారు. సంపద సృష్టించే రాజధాని 13 జిల్లాల ప్రజల నాడి అయిన అమరావతిపై వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు.. 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే రాజధానిపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఇక్కడ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాజధాని కోసం 30వేల ఎకరాలు ఉండాల్సిందేనని 2014 లో జగన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. 
రాజధాని కోసం 30 వేల ఎకరాలు ఉండాల్సిందే

కానీ ఇప్పుడు 15 వేల ఎకరాలు సరిపోతాయని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే చెప్పడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. రైతులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానం ఉందా అని ప్రశ్నించారు. మాట్లాడితే నిపుణుల కమిటీ అంటున్నారని నిప్పులు చెరిగారు. శివరామకృష్ణన్ కమిటీ కాదా అని ప్రశ్నించారు. కృష్ణా, గుంటూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని నిలదీశారు. వారిని నమ్మి ప్రజలు ఓట్లేశారని అన్నారు. అవినీతి అని, ముంపు ప్రాంతం అని, ఇన్సైడ్ ట్రేడింగ్ అని ఇష్టమొచ్చిన ఆరోపణలు చేసి.. ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారని ప్రభుత్వంపై అనురాధ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 820 కిలోమీటర్లు రోడ్లు, 77కిలోమీటర్ల ఘాట్, 45 ఎకరాల్లో సెక్రటేరియట్ 6 భవనాలను నిర్మించారని పేర్కొన్నారు. 180 సంస్థలకు 1200 ఎకరాలు కేటాయించడం జరిగిందని వివరించారు. వైసీపీ నేతలు చరిత్ర హీణులుగా మారిపోతారని, నామరూపాలు లేకుండా పోతారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

No comments:

Post a Comment