కరీంనగర్, అక్టోబరు 18, (way2newstv.in)
ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధం అయ్యారు. కరీంనగర్జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ ధాన్యం సేకరణకు ఐకేపీ, ప్రాథమిక సహకార సంఘాలు, డీసీఎంఎస్, మెప్మా ఆధ్వర్యంలో మొత్తం 170 కొనుగోలు కేంద్రాలను ఈ నెలాఖరు వరకు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. జిల్లాలో నెలకొన్న వర్షభావ పరిస్థితుల దృష్ట్యా ఖరీఫ్ వరినాట్లు ఆలస్యమయ్యాయి. జూన్‌లో నాట్లు వేసినట్లయితే ఈ నెల మొదటివారంలో వరిపంట కోతకు వచ్చినట్లయితే ధాన్యం సేకరణ ప్రారంభించేవాళ్లు. ఆగస్టు నెలాఖరు వరకు వరినాట్లు వేయడంతో పంట దిగుబడి వచ్చేందుకు ఈ నెలాఖరు వరకు అవకాశముంది. ప్రస్తుత ఖరీఫ్‌లో హుజూరాబాద్, గన్నేరువరం, మానకొండూరు, తిమ్మాపూర్, చిగురుమామిడి, వీణవంక, సైదాపూర్, కొత్తపల్లి, కరీంనగర్ మండలాల్లో వరిపంట ఎక్కువగా సాగైంది.
25 తర్వాత ధాన్యం కొనుగోళ్లు ...
వరికోతలు ఆలస్యమయ్యే అవకాశం ఉండడంతో ఈ నెలాఖరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఖరీఫ్‌లో 66,422 హెక్టార్లలో వరి సాగు కాగా.. 2.20 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు రూ.1835, సాధారణ రకానికి రూ.1815 చెల్లించనున్నారు. సింగిల్‌విండో ఆధ్వర్యంలో 104, ఐకేపీ 50, డీసీఎంస్ 15, మెప్మా ఆధ్వర్యంలో ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ధాన్యం కొనుగోళ్లలో గతంలో తలెత్తిన సమస్యలను అధిగమించేందుకు ప్రస్తుత సీజన్ నుంచి కొత్త నిబంధనల అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా జిల్లా స్థాయిలో కమిటీని ఏర్పాటు చేశారు. ధాన్యం రవాణా, పర్యవేక్షణ, కనీస మద్దతు ధర, వివిధ శాఖల సమన్వయం కోసం ఈ కమిటీ పనిచేస్తుంది. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీలో జిల్లా పోలీస్ కమిషనర్, జిల్లా లేబర్ ఆఫీసరు, లీడ్‌బ్యాంకు మేనేజరు సభ్యులుగా ఉంటారు.ధాన్యం కొనుగోళ్లలో కీలకపాత్ర పోషించిన వీఆర్‌వోలను తప్పించి కొత్తగా ఏఈవోలకు బాధ్యతలు అప్పగించారు. గతంలో రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకెళ్లాలంటే ఆయా గ్రామాల వీఆర్‌వోలు సంబంధిత పంట ఎంత పండించారంటూ నిర్ధారణ చేసి ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. ప్రస్తుతం ధరణి వెబ్‌సైట్‌ను సహకార సంఘాలు, ఐకేపీ సంఘాలకు లింకేజీ చేయడంతో సంబంధిత రైతుల వివరాలన్నింటిని ఏఈవోలు సమగ్రంగా పరిశీలిస్తారు. రైతులు తెచ్చిన ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేస్తారు.ధాన్యం కొనుగోళ్లలోని కొత్త నిబంధనలతో కౌలురైతులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు తమకున్న కొద్దిపాటి భూమి తోపాటు ఇతర భూమిని కౌలుకు తీసుకుని పం టలు పండిస్తున్నారు. కౌలురైతులు పండించిన ధాన్యం కేంద్రాలకు తీసుకొచ్చినప్పుడు అసలైన రైతుల వివరాలే ధరణి వెబ్‌సైట్‌లో ఉంటాయి. ఈ రైతుల పేరిటనే ధాన్యం విక్రయించడంతోపాటు డబ్బులు సైతం వారి బ్యాంకు ఖాతాల్లోనే జమయ్యే అవకాశం ఉండడంతో కౌలురైతులు కేంద్రాలకు వచ్చేందుకు వెనుకంజ వేస్తారని అధికారులు పేర్కొంటున్నారు
No comments:
Post a Comment