Breaking News

18/09/2019

మారని టౌన్ ప్లానింగ్ అధికారులు

హైద్రాబాద్, సెప్టెంబర్ 19, (way2newstv.in)
అక్రమ నిర్మాణాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మున్సిపల్ శాఖా మంత్రి కెటిఆర్ పలు మార్లు ప్రకటించినా టౌన్‌ప్లానింగ్ అధికారుల తీరు మాత్రం మారక పోగా ఇటీవల కాలంలో అక్రమ నిర్మాణాలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి.ముఖ్యంగా కూకట్‌పల్లి, మూసాపేట సర్కిళ్ల టౌన్‌ప్లానింగ్ విభాగంలో గతంలో ఎప్పుడూలేని విధంగా   ఎసిపిలతోపాటు సెక్షన్ అధికారులందరికీ బదిలీ చేశారు. నగరంతోఅనుబంధం లేని అధికారులకు కొత్తగా ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడం విశేషం. ఇదిలా ఉండగా గతంలో అక్రమ నిర్మాణాలపై వచ్చే ఫిర్యాదులకు అడపా దడపా స్పందించే అధికారులు గత కొంతకాలంగా స్పందించడం కూడా మానేశారు.
మారని టౌన్ ప్లానింగ్ అధికారులు

ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణ లోపం,  క్రింది స్థాయి అధికారులతో లాలూచి పడటం,  ఏళ్లతరబడి స్థానం చలనం లేకుండా ఒకే చోటఉండటం, కార్పొరేటర్ల ఒత్తిడి తదితర కారణాలతో అక్రమ నిర్మాణాలు జోరందుకోవడానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. ముఖ్యంగా కూకట్‌పల్లి, మూసాపేట జంట సర్కిళ్లలో గత కొంతకాలంగా అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వీటిని అడ్డుకోవాల్సిన టౌన్‌ప్లానింగ్ ఎసిపిలు,  సెక్షన్ అధికారులు ప్రేక్షక పాత్ర పోషించడం, అందిన కాడికి దండుకోవడంపై దృష్టి సారించారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ నేపధ్యంలో జరిగిన మూకుమ్మడి బదిలీలు టౌన్‌ప్లానింగ్ విభాగంలో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడుతుందా  లేక  పాత సీసాలో కొత్త సారా అన్నట్లుగా ఉంటుందా అనేదే ప్రధాన ప్రశ్న. భవిష్యత్ కాలంలో ప్రజలు రోడ్లు, డ్రైనేజీ, ట్రాఫిక్ వంటి మౌళిక సదుపాయల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొవద్దంటే ప్రణాళిక బద్ధమైన పట్టణం  అవసరం.  ఇందుకోసం ప్రభుత్వం పట్టణ ప్రణాళిక విభాగాన్ని  ఏర్పాటు చేసింది. క్రమపద్దతిలో ఇళ్లను, కమర్షియల్ భవనాలు నిర్మించుకునేవిధంగా చూడటం, సహజసిద్ధంగా ఉన్న చెరువులు, కుంటలు, వరద నీటి కాలువలు అతిక్రమణలకు గురికాకుండా పర్యవేక్షిస్తూ వాటిని పరిరక్షించే బాధ్యతను కూడా చేపట్టాలి. లక్షల రూపాయలు జీతాల రూ పంలో ప్రభుత్వం చెల్లిస్తొంది. కాని టౌన్‌ప్లానింగ్ అధికారులు ఈ బాధ్యతలు పూర్తిగా విస్మరించి కేవలం అమ్యామ్యాలు దండుకోవడమే ద్యాసగా పెట్టుకుని పనిచేస్తుండటం, వీరికి ఎసిబి, విజిలెన్స్,  ఉన్నత  స్థాయి అధికారులు  సహకారం  అందడంతో వీరు ఆడింది ఆట పాడింది పాటగా తయారైంది. దీంతో ప్రజలు నిత్యం ట్రాఫిక్, డ్రైనేజీ, మంచినీటి సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. ఇరుకైన రోడ్లు, గ్రీనరీకి నోచుకోని కాలనీలు ఎన్నొ దర్శనమిస్తున్నాయి. మూసాపేట, కూకట్‌పల్లి జంట సర్కిళ్లలో గత రెండేళ్లుగా అక్రమ నిర్మాణాలు అడ్డూ అదుపులేకుండా సాగుతున్నాయి. అక్రమ నిర్మాణాలపై  వచ్చి న ఫిర్యాదులను బేఖాతరు చేయడంతో చివరకు మంత్రి కెటిఆర్ స్పందించి  కూల్చివేతకు ఆదేశించిన సంఘటనలు ఉన్నాయి. స్వయంగా మంత్రి ఆదేశించినా ఎసిపిలు మాత్రం నామమాత్రపు కూల్చివేతలతోనే సరిపెట్టుకున్నారు.  అక్రమ నిర్మాణాలు, చెరువుల, కుంటల స్థలాల కబ్జాల విషయంలో, నాలా ల ఆక్రమణల విషయంలో స్థానిక సర్కిల్ టౌన్‌ప్లానింగ్ అధికారులకు ప్రజలు  ఫిర్యాదు చేయడమే మానేశారు. వాట్సప్, ట్విటర్‌లలో మంత్రి కెటిఆర్, జిహెచ్‌ఎంసి కమిషనర్, సిటి చీఫ్ ప్లానర్లకు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు.  మూసాపేట సర్కిల్ పరిధిలోని   కెపిహెచ్‌బికాలనీ, బాలాజీనగర్ డివిజన్‌లలో గత ఏడాదిన్నకాలంలో వంద గజాల లోపు స్థలాల్లో కూడా ఐదంతుస్తుల నిర్మాణాలు జోరుగా సాగాయి. రంగదాముని చెరువుతోపాటు నాలా స్థలాలపై ఆక్రమణలు పెద్ద ఎత్తున జరిగిన సంబంధిత టౌన్‌ప్లానింగ్‌అధికారులు కనీసం స్పందించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. టౌన్‌ప్లానింగ్ అధికారి ఇక్కడికి వచ్చిన నాటినుంచి విధులపై పూర్తి స్థాయి దృష్టి సారించక పోవడం, ఫిర్యాదులను పట్టించుకోలేదన్న ఫిర్యాదులు ఉన్నతాధికారులకు వెళ్లాయి. కూకట్‌పల్లి సర్కిల్‌పరిధిలో ఆల్వీన్‌కాలనీ పరికి చెరువునాలాపై గత కొంతకాలంగా యథేచ్ఛగా అక్రమనిర్మాణాలు జరిగాయి.  అదేవిధంగా హైదర్‌నగర్, ఆల్వీన్‌కాలనీ, వివేకానందనగర్ డివిజన్ తదితర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన అక్రమ నిర్మాణాల విషయంలో   టౌన్‌ప్లానింగ్ అధికారి ప్రేక్షకపాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉన్నత స్థాయి అధికారులు పలుమార్లు హెచ్చరికలు, మెమోలు కూడా జారీ చేసినట్లు తెలిసింది. యధా రాజా తధా ప్రజా అన్నట్లు టౌన్‌ప్లానింగ్‌లోని సెక్షన్ అధికారులు కూడా  తమ బాసుల పనితీరుకనుగుణంగా అందినకాడికి దండుకుని అక్రమ నిర్మాణాలపై ఉదాసీనంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.టౌన్‌ప్లానింగ్ విభాగంలో  హెచ్చుమీరిపోతున్న అవినీతి అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ప్రక్షాళన చేపట్టింది. ఇందుకోసం మున్సిపల్ యాక్టునును సవరించి నగరం వెలుపల పనిచేసే వారిని లోపలికి, ఇక్కడ పనిచేసే వారిని  మున్సిపాలిటీలకు బదిలీలు చేసింది. మున్సిపాలిటీలలో పనిచేసి  కొత్తగా పొస్టింగ్‌పొంది  నగంతో అంత అనుబంధం లేని అధికారులు  గత కొంతకాలంగా అడ్డూ అదుపులేకుండా అక్రమ నిర్మాణాలను నిలువరిస్తారా లేక  గతంలో పనిచేసిన అధికారుల మాదిరిగానే  వ్యవహరిస్తారా అనేదానిపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. ప్లానింగ్ విభాగంలో  పాలసీలను పారదర్శకంగా, నిబంధనలు సరళీకృతంగా మార్చితే తప్ప బదిలీలతో   పెద్దగా ఒరిగేదేమి ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

No comments:

Post a Comment