Breaking News

17/09/2019

నత్తకే నడకలు (కరీంనగర్)

కరీంనగర్, సెప్టెంబర్ 17 (way2newstv.in):
సుల్తానాబాద్‌ మండలంలోని పలు గ్రామాల్లో పంచాయతీల భవన నిర్మాణాలు నత్తనడక సా(ఆ)గుతున్నాయి. నిధులు మంజూరై సంవత్సరం గడుస్తున్నా నిర్మాణ పనులు ముందుకు సాగటం లేదు. బిల్లుల చెల్లింపుల్లో కొనసాగుతున్న జాప్యంతో నిర్మాణాలు పూర్తి చేయటానికి గుత్తేదారులు ఆసక్తి చూపటం లేదు. దీంతో గ్రామాల్లో నూతనంగా పంచాయతీ భవనాల నిర్మాణాలు పూర్తికాకపోవటంతో పాత భవనాల్లో అరకొర వసతులతో అవస్థలు తప్పటం లేదు. మండలంలో 27 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో పంచాయతీ నూతన భవనాల నిర్మాణానికి దశల వారీగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. ఇందులో భాగంగా గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో గట్టెపల్లి, నీరుకుళ్ల, సాంబయ్యపల్లి, గొల్లపల్లి, కదంబాపూర్‌, తదితర నూతన పంచాయతీల భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. 
నత్తకే నడకలు (కరీంనగర్)

ఉపాధిహమీ పథకం కింద ఒక్కో భవన నిర్మాణానికి రూ.13 లక్షల చొప్పున మంజూరయ్యాయి. మంజూరైన నిధులతో స్థలం కొరతలేని గ్రామాల్లో ఒకే భవనం...ప్రతిపాదనల ప్రకారం స్థలం అందుబాటులోని గ్రామంలో ఒక అంతస్థుతో భవనాన్ని నిర్మించాలని అధికారులు ప్రణాళికను సిద్ధంచేశారు. దీని ప్రకారం ప్రతి భవనంలో రెండు సమావేశ మందిరాలు, పంచాయతీ కార్యదర్శి, సర్పంచి కార్యాలయాలు ఒక్కొక్కటి చొప్పున నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. ఆ ప్రకారం నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇప్పటికీ సంవత్సరం గడిచినా పనులు ముందుకు సాగటం లేదు. మండలంలోని పలు గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ పనులు నత్తనడకన సా(ఆ)గుతున్నాయి. నిర్దేశించిన సమయం ప్రకారం పనులు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ నిర్మాణం పనులు పూర్తైన భవనాలు ఎక్కడా కన్పించవు. నీరుకుళ్లలో భవన నిర్మాణం పిల్లర్ల వరకే పూర్తయింది. గట్టెపల్లిలో శ్లాబ్‌వరకు పనులు పూర్తయ్యాయి. సాంబయ్యపల్లి, గొల్లపల్లి, కదంబాపూర్‌లో పనులు అసంపూర్తిగా పూర్తయ్యాయి.భవన నిర్మాణ పనులు సకాలంలో పూర్తికాక పోవటానికి బిల్లుల చెల్లింపుల్లో కొనసాగుతున్న జాప్యం ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. తరచూ నెలల తరబడి ఫ్రీజింగ్‌ విధిస్తుండటంతో పూర్తయిన పనులకు బిల్లుల చెల్లింపు సక్రమంగా ఉండటం లేదు. పంచాయతీ భవనాలతోపాటు గతంలో నిర్మించిన సీసీ రహదారుల బిల్లుల చెల్లింపు సైతం నెలల తరబడి నిలిచిపోయింది. బిల్లుల చెల్లింపుపై స్పష్టత లేకపోవటంతో పనులు పూర్తిచేయటంలో గుత్తేదారులు మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారు. పంచాయతీ భవన నిర్మాణాలకు సంవత్సరం కిందట ప్రణాళికలు రూపొందించగా అప్పటి ధరలతో అధికారులు రూ.13 లక్షలుగా నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సిమెంట్‌ బస్తాలు, ఇనుపకడ్డీలు, కూలీలరేట్లు, ఇసుక, తదితర నిర్మాణ సామగ్రి రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో గుత్తేదారులు అనాసక్తిగా, నాణ్యతలోపంతో పనిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. భవన నిర్మాణాలకు రూ.20 లక్షలు నిధులు కేటాయిస్తే బాగుంటుందని పలువురు గుత్తేదారులు అభిప్రాయపడ్డారు. పంచాయతీ భవన నిర్మాణ పనులు కొనసాగుతుండగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పంచాయతీ భవనాలతో ఇటు ప్రజలు, అటు అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. కంప్యూటర్లు, విలువైన రికార్డులు, సామగ్రి భద్రపర్చేందుకు సరైన భద్రత కరవైంది.

No comments:

Post a Comment