Breaking News

17/09/2019

అంతా గందరగోళం (శ్రీకాకుళం)

శ్రీకాకుళం, సెప్టెంబర్ 17 (way2newstv.in): 
జిల్లాలోని గారలో ఇసుక అక్రమ నిల్వలు ఉన్నాయి. వీటిని రెవెన్యూ, మైనింగు, పోలీసు శాఖల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇసుక అవసరం ఉన్నవారు ఎవరైనా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకుంటే ఆయన ఆదేశాల మేరకు మైనింగు శాఖ నిర్దిష్ట మొత్తానికి డీడీలు తీసుకుని అనుమతులు జారీ చేస్తుంది. అదీ కూడా ఒకటీ ఆరా అంతే.. అదే విశాఖపట్నానికి రోజూ వందల లారీలు వెళ్లిపోతున్నాయి. ఇక్కడున్న ఇసుక నిల్వలు మొత్తం 6 వేల క్యూబిక్‌ మీటర్లకుపైనే. ఈ ఇసుక నిల్వలు కేటాయించాలని...కనీసం 4 వేల క్యూ.మీ ఇవ్వాలని జాతీయ రహదారుల నిర్మాణాలు చేపడుతున్న ఓ సంస్థ దరఖాస్తు చేసుకుంది. కాదు...చేయించారు. ఇంతకుముందు గోదాముల నిర్మాణాల ముసుగు వేస్తే... ప్రస్తుతం జాతీయ రహదారుల నిర్మాణం ముసుగు వేసుకున్నారంతే. 
 అంతా గందరగోళం (శ్రీకాకుళం)

దీని పేరుతో దందా సాగిస్తున్నారు. వాస్తవానికి ఆ సంస్థకు 4వ తేదీ వరకు ఇసుక తీసుకెళ్లడానికి వీలుగా 4 వేల క్యూ.మీ వరకు అనుమతులు ఇచ్చారు. ఆ మరుసటి రోజు నుంచే కొత్త విధానం అమల్లోకి వచ్చింది. దీంతో ఆగిపోవాలి కదా...ఆగలేదు సరికదా జిల్లా, డివిజనల్‌స్థాయి అధికారుల అనుమతులు లేకుండానే మండలస్థాయి అధికారులు అక్రమ దందాకు సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారు. జాతీయ రహదారుల నిర్మాణ సంస్థకు ఇసుక రవాణా చేసేందుకు అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడికి కాంట్రాక్ట్ బాధ్యతలు అప్పగించారు. ఆయనకు పది వరకు లారీలు ఉన్నాయని అప్పగించినట్లు పైకి చెబుతున్నా ఆ పేరుతోనే అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు సమాచారం. ప్రముఖుల అండదండలు పుష్కలంగా ఉండడంతో ఎవరూ జోక్యం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని వంశధార నదిలో మడపాం, యరగాం, పెద్దసవలాపురం, పురుషోత్తపురం, పర్లాం, అంధవరం, చెవ్వాకులపేట, గోపాలపెంట... నాగావళి నదిలో కిళ్లిపాలెం, కళ్లేపల్లి, ముద్దాడపేట, సింగూరులో ఇసుక నిల్వలను గుర్తించారు. అన్ని రేవుల్లో కలిసి 5.09 లక్షల క్యూబిక్‌మీటర్ల ఇసుక నిల్వలు ఉన్నట్లు తేల్చారు. వీటికి సంబంధించి మడపాం, వెన్నెలవలస, పర్లాం, కళ్లేపల్లి, ముద్దాడపేట, చెవ్వాకులపేటల్లో ఇసుక యార్డులను ఏర్పాటు చేశారు. ఆయా రేవుల నుంచి యార్డులకు ఇసుక చేరవేసే బాధ్యతలను గుత్తేదారు సంస్థలు నిర్వర్తిస్తాయి. ఇదంతా ఖనిజాభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో సాగు తుంది. ఇప్పటికే కాంట్రాక్టర్ల కుఆయా రేవులతోపాటు యార్డులను అప్పగించాయి. ఏ రేవులోనూ ఇసుక తీసుకోవడానికి వీల్లేని పరిస్థితి. అన్నీ ముంపులోనే ఉన్నాయి. పైపెచ్చు వంశధార నదికి ప్రస్తుతం వరద తాకిడి తలెత్తింది. వెన్నెలవలస, మడపాంల్లో ఏర్పాటు చేసిన యార్డుల్లోనే కొద్దిపాటి నిల్వలున్నాయి. అంతా కలిపి 2 వేల క్యూ.మీ మించి ఉండదని అధికారిక వర్గాలే చెబుతున్నాయి. స్థానికంగా యార్డుల్లో ఇసుక టన్ను రూ.375గా ప్రభుత్వం నిర్ణయించింది. క్యూబిక్‌ మీటరు అంటే 1.50 టన్నుల నుంచి 1.60 టన్నులు ఉంటుంది. ఒక ట్రాక్టరు అంటే సుమారుగా 2.83 క్యూబిక్‌ మీటర్లు. యార్డుల్లో తూకం యంత్రాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కాంట్రాక్ట్ సంస్థలదే. అయితే ఎక్కడా అలాంటి ఏర్పాట్లు లేవు. తూనికయంత్రాలు ఏర్పాటు చేస్తే గానీ తరలించే ఇసుకను అంచనా వేసేందుకు అవకాశం లేదు. జిల్లాలో నిర్మాణాలకు ఇసుక అందించేందుకు గతి లేదు. ఇక్కడ నుంచి ఇసుకను తీసుకెళ్లి విశాఖపట్నంలో అమ్మకాలు సాగించేందుకు ఖనిజాభివృద్ధి సంస్థ ఆసక్తి కనబరుస్తోంది. జిల్లాలో గుర్తించిన యార్డుల నుంచి గత వారం రోజులుగా దాదాపు ఆరేడువందల టన్నుల ఇసుకను విశాఖకు తరలించారు. అక్కడ ఏపీఎండీసీ ఒక యార్డును ప్రారంభించింది. ఆ యార్డుకు ఇక్కడ ఇసుకనే చేరుస్తోంది. అక్కడ యార్డుకు వెళ్తే టన్ను ఇసుక రూ.వెయ్యికి విక్రయిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. విజయనగరం జిల్లాకు కూడా ప్రతి రోజూ పదుల సంఖ్యలో ఇసుక లారీలు వెళ్తున్నాయి. అక్కడ కలెక్టర్‌ విజ్ఞాపన మేరకు అధికారికంగానే పంపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అవన్నీ సక్రమంగా చేరితే ఏ ఇబ్బంది లేదు.. ఆ వంకతో ఇతరత్రా దారి మళ్లుతుండడమే ఆక్షేపణీయం. ఇసుకను సక్రమంగా అందించేందుకు వీలుగా ప్రభుత్వ పక్కా ఏర్పాట్లు చేస్తోంది. అమరావతి నుంచి ఖనిజాభివృద్ధి సంస్థలో పని చేస్తున్న డీడీ స్థాయి అధికారిని జిల్లాకు ఇన్‌ఛార్జిగా నియమించింది. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అక్రమార్కులకు కళ్లెం వేయలేకపోవడం విశేషం. జిల్లాలోని ఇసుక యార్డుల నుంచి ఇసుకను తీసుకెళ్లి వినియోగదారుల అవసరాలు తీర్చేందుకు వీలుగా వాహనాలను ముందుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో గడిచిన రెండు రోజులుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వాహనాల సంఖ్య 27కు మించకపోవడం గమనార్హం. విశాఖపట్నానికి కిలోమీటరుకు రూ.4.90గా నిర్ణయించారు. జిల్లాలోని వినియోగదారులకూ ఇసుక రవాణా చేసుకోవచ్ఛు మరోపక్క గుత్తేదారు సంస్థలు రేవుల నుంచి యార్డులకు ఇసుక రవాణా చేసుకోవడానికి సొంతంగానే ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. దీంతో స్థానికంగా ఉపాధి పొందుతున్న ట్రాక్టర్ల యజ మానులు ఇందుకు భిన్నంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నారు. తమ ఊళ్లో ఉన్న తమకు ఇన్నాళ్లు ఉపాధి కల్పించిన ఇసుక రవాణాలో వేరే ప్రాంతాల నుంచి తెచ్చిన వాహనాలను వినియోగించడాన్ని అడ్డుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.

No comments:

Post a Comment