Breaking News

24/09/2019

ఉపాధ్యాయ సంఘాల ప్రక్షాళన!

ఇన్ని సంఘాలెందుకు అంటున్న ముఖ్యమంత్రి
హైదరాబాద్ సెప్టెంబర్ 24  (way2newstv.in)          
రాష్ట్రంలో 60 కిపైగా ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. మరే ఇతర ప్రభుత్వ శాఖలో లేనన్ని సంఘాలు కేవలం ఒక్క విద్యా శాఖలోనే ఉన్నాయి. వీటిలో కేవలం 8 సంఘాలకు మాత్రమే ప్రభుత్వ గుర్తింపు ఉంది. మిగతావన్నీ రిజిస్ట్రేషన్తో కొనసాగుతున్నవే. ఎస్సీ ఉపాధ్యాయ సంఘం, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం, బీసీ ఉపాధ్యాయ సంఘం, పండిట్ల ఉపాధ్యాయ సంఘం, ఎస్జీటీ ఉపాధ్యాయుల సంఘం, స్కూల్ అసిస్టెంట్ల సంఘం.. ఇలా ఎవరికి వారు కులాలు, కేడర్ల వారీగా సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘాల నాయకులంతా అదర్ డ్యూటీ (ఓడీ) పేరిట పాఠశాలలకు వెళ్లకపోవడం, పైరవీలు చేసుకోవడంతదితరాలు ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు తెలిసింది. 
ఉపాధ్యాయ సంఘాల ప్రక్షాళన!

దాంతో, సంఘాల వ్యవహారంపై సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే, ఉపాధ్యాయ సంఘాలను ప్రక్షాళన చేయాలనిఆయన నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఇటీవల తనను కలిసిన ఓ ఉపాధ్యాయ సంఘం నేతల వద్ద కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ‘‘రాష్ట్రంలో ఇన్ని ఉపాధ్యాయ సంఘాలు ఎందుకు? నాయకులకు ఓడీలు ఎందుకు? ఆర్టీసీ, సింగరేణితోపాటు మరే ఇతర శాఖలోనైనా ఇన్ని సంఘాలు ఉన్నాయా? మరి మీ శాఖలోనే ఇన్ని సంఘాలు ఎందుకున్నాయి?’’అని ప్రశ్నించినట్లు తెలిసింది. అనంతరం, రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలు, వాటి పనితీరు, నేతల వ్యవహారంపై ఆయన ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే త్వరలో ఉపాధ్యాయ సంఘాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఇందులో భాగంగానే సంఘాల నేతలకు ఓడీలు కూడా ఇవ్వలేదు. ఎన్ని సంఘాలు ఉండాలి? ఎవరెవరికి గుర్తింపు ఇవ్వాలి? ఎవరికి ఓడీలు ఇవ్వాలనేది త్వరలోనే తేల్చనున్నట్లు సమాచారం. సాధారణంగా ఏప్రిల్లో ఓడీని రెన్యువల్ చేస్తూ ఉత్తర్వులు జారీ అవుతాయి. కానీ, ఈ ఏడాది ఇప్పటి వరకు ఆదేశాలు ఇవ్వలేదు.

No comments:

Post a Comment