Breaking News

19/09/2019

జ్వరమొస్తే జేబులు ఖాళీ (కర్నూలు)

కర్నూలు, సెప్టెంబర్ 19 (way2newstv.in): 
జ్వరాలతో జనం వణికిపోతున్నారు. పల్లెల్లో ఎటుచూసినా పారిశుద్ధ్యం పడకేసింది. మరోవైపు వర్షాకాలం కావడం.. దోమల బెడద తీవ్రంగా ఉండడంతో బెంబేలెత్తిపోతున్నారు. అధికారికంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదవుతున్న గణాంకాలు కలవరపెడుతుంటే అనధికారికంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో రెండింతల కేసులు నమోదవుతున్నాయి. ఇదే అదనుగా కొందరు ప్రైవేటు వైద్యులు డెంగీ పేరుతో భయపెడుతున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు కర్నూలు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో 17 డెంగీ కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు 30 మలేరియా కేసులు నిర్ధరణ అయ్యాయి. ఇవికాక ప్రైవేటు గడప తొక్కుతున్న రోగుల్లో ఎందరికి మలేరియా, డెంగీ సోకిందో సరైన గణాంకాలు అధికారుల వద్ద లేవు. 
జ్వరమొస్తే జేబులు ఖాళీ (కర్నూలు)

నిత్యం జ్వరాలతో వస్తున్న రోగుల్లో 30 శాతానికిపైగా డెంగీ, మలేరియా అనుమానంతో పరీక్షలు చేయించుకుంటున్నపరిస్థితి. నంద్యాల జిల్లా ఆసుపత్రిలో సైతం ఈ సీజన్‌లో ఐదు మలేరియా కేసులు నమోదవగా.. 20 మంది డెంగీ లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు.కర్నూలు సర్వజన వైద్యశాలలో జనరల్‌ వార్డులో ఇన్‌పేషెంట్లుగా చేరుతున్న వారిలో 60 మంది వైరల్‌ జ్వరాల బారిన పడ్డవారే. నంద్యాల జిల్లా ఆసుపత్రికి విష జ్వరాలతో ప్రతి రోజూ 200 మంది వస్తున్నారు. ఇందులో 80 మంది ఇన్‌పేషెంట్లుగా చేరుతున్నారు. జిల్లా ఆసుపత్రిలో జనరల్‌ మెడిసిన్‌కు సంబంధించి ఐదుగురు వైద్యులు అందుబాటులో ఉండాల్సి ఉండగా.. కేవలం ఇద్దరే ఉన్నారు. వీరు సైతం ఓపీకే పరిమితమవడంతో వైద్యసేవలు సరిగా అందడం లేదు. చిన్నారులు సైతం ఎక్కువగా వైరల్‌ జ్వరాల బారిన పడుతున్నారు. మహిళల వార్డులో 36 పడకలు ఉండగా 50 మందికి.. పిల్లల వార్డులో 30 పడకలు ఉండగా 50 మంది చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక ప్రైవేటు గడప తొక్కుతున్న వారు అధికమే. దీంతో ముందస్తు ఓపీల పేరుతో ఓపీకి రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. నంద్యాల పరిధిలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక్కో ఆసుపత్రిలో 300 మందికిపైగా ఓపీ చూస్తుండడం గమనార్హం. వైరల్‌ జ్వరమైతే ఒక్కరోజు వైద్య సేవలకే రూ.5 వేల వరకు బిల్లులు వేస్తున్నారు. విష జ్వరాలతో వచ్చే పల్లె ప్రజలను డెంగీ బూచి చూపి రక్త పరీక్షలు, అత్యవసర విభాగంలో చికిత్స అంటూ డబ్బులు గుంజుతున్నారు. ప్లేట్‌లెట్లు పూర్తిగా పడిపోయాయని.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదమంటూ భయపెడుతున్నారు. దీంతో రోగులు అప్పులు చేసి మరీ ప్రైవేటు వైద్యులకు బిల్లులు చెల్లిస్తున్నారు.

No comments:

Post a Comment