Breaking News

16/09/2019

శ్రీరాం సాగర్ కు ప్రాణం పోస్తున్న కాళేశ్వరం

నిజామాబాద్, సెప్టెంబర్ 16, (way2newstv.in)
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతం నుంచి ఆశించిన స్థాయిలో వరద నీటి చేరిక జరగడం లేదు. దీంతో ప్రాజెక్టు ద్వారా పంటలకు నీరందించే కాకతీయ, సరస్వతీ, లక్ష్మీ కాలువల పరిధిలోని ఆయకట్టుకు రెండు పంటలకు నీరందించే పరిస్థితి కనబడడం లేదు. ఈ నెలలోనే ఎస్సారెస్పీ ఎగువ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో వరదనీరు వచ్చి చేరితేనే ప్రాజెక్ట్‌లో నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. వారం క్రితం ప్రాజెక్ట్‌లోకి 50వేల క్యూసెక్కుల వరదనీరు ప్రవాహం మూడు రోజుల పాటు కొనసాగింది. దీంతో ప్రాజెక్ట్‌లో 10 టీఎంసీల మేర పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతం నుంచి 4500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 1070 అడుగల నీటిమట్టం నమోదు కాగా 30టీఎంసీల నీటినిల్వలు ఉన్నాయి. 
శ్రీరాం సాగర్ కు ప్రాణం పోస్తున్న కాళేశ్వరం

అయితే ఇప్పటి దాకా ప్రాజెక్ట్‌ నుంచి కాలువ ద్వారా ఈ సీజన్‌లో నీటి విడుదల జరగలేదు. కాలువ పరిధిలోని చెరువులు కొంతమేర ఖాళీగానే ఉన్నాయి. అయితే చెరువులను నింపడానికి వచ్చే నెలలో నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంటుంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి రోజుకి ఒక టీఎంసీ చొప్పున కాళేశ్వరం జలాలను తరలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగా పనులు కొనసాగుతున్నాయి. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి కాళేశ్వరం జలాలు రావాలంటే రాజేశ్వర్‌రావుపేట్‌ వద్ద ఏర్పాటు చేసిన పంపుల ద్వారా వరద కాలువలోకి నీటి పంపింగ్‌ చేపట్టాలి. ఈ మేరకు రాజేశ్వర్‌రావుపేట్‌ నుంచి వరద కాలువలోకి శనివారం నీటి పంపింగ్‌ ప్రయోగత్మకంగా చేపట్టారు.ఈ నీరు వరద కాలువలోకి రావడంతో అక్కడి ప్రాంత రైతులు ఆసక్తిగా తిలకించారు. వరద కాలువలోని నీరు ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌ కాలువ గేట్ల వద్ద శనివారం రాత్రికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే వరదకాలువలో నుంచి ఎలాంటి పంపింగ్‌ లేకుండా నేరుగా ప్రాజెక్ట్‌లో 1077 అడుగల వరకు నీటిమట్టం చేరే వరకు వెళ్తుంది. అనంతరం ప్రాజెక్ట్‌ సమీపంలో ఏర్పాటు చేస్తున్న పంపుల ద్వారా ప్రాజెక్ట్‌లోకి నీటిని ఎత్తిపోయనున్నారు. ఎగువ ప్రాంతం నుంచి ఆశించిన స్థాయిలో వరదనీరు రాని కారణంగా ఎస్సారెస్పీ ఆయకట్టు రైతాంగం కాళేశ్వరం జలాలపైనే ఆశలు పెంచుకున్నారు.ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు సరస్వతీ, కాకతీయ కాలువలకు నీటిని వారబందీ పద్ధతి ద్వారా విడుదల చేసి చెరువులు నింపడానికే సరిపోతుంది. అయితే ప్రాజెక్ట్‌లో వరద నీరు రాకముందు 5 టీఎంసీల నీరు ఉండగా ఇప్పటి దాక ఈ సీజన్‌లో ప్రాజెక్ట్‌లోకి  25 టీఎంసీల నీరు వచ్చి చేరింది. కాకతీయ, లక్ష్మీ, సరస్వతీ కాలువల పరిధిలోని ఆయకట్టు మొత్తానికి రెండు పంటలకు నీరందించాలంటే కనీసం ప్రాజెక్ట్‌లో 75 టీఎంసీల నీరు నిల్వ ఉంటేనే సాధ్యమవుతుంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనబడడం లేదు. దీంతో ఇప్పట్లో కాలువల ద్వారా సైతం నీరు విడుదల చేసే పరిస్థితి లేదు.

No comments:

Post a Comment