Breaking News

10/09/2019

తెలంగాణలోకి ఏపీ వ్యాపారులు

ఖమ్మం, సెప్టెంబర్ 10, (way2newstv.in)
ఏపీ మద్యం వ్యాపారుల కన్ను తెలంగాణపై పడింది. దశలవారీగా లిక్కర్ బ్యాన్ చేస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు  ఏటా 20 శాతం చొప్పున వైన్ షాపులు, బార్లు మూసివేయాలని నిర్ణయించింది. దీంతో సిండికేట్ గా మారిన  ఏపీ లైసెన్స్డ్ మద్యం వ్యాపారులు తెలంగాణవైపు చూస్తున్నారు. ఏపీతో పోలిస్తే టెండర్ ధరలు కాస్త తక్కువగా ఉండటంతో పాగా వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నెల 30వ తేదీతో ప్రస్తుతం నడుస్తున్న మద్యం దుకాణాల గడువు ముగుస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం కొత్త లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ ఇచ్చింది. త్వరలో టెండర్ల ప్రక్రియకు చర్యలు తీసుకొంటోంది. సాధారణంగా మద్యం దుకాణాల టెండర్లు అంటేనే పోటాపోటీగా దరఖాస్తులు వస్తాయి. పాత వ్యాపారులతోపాటు ఎప్పటికప్పుడు కొత్తవాళ్లు వేలంలో పాల్గొంటారు. ఒక ఏరియా వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి టెండర్లు వేస్తారు. 
తెలంగాణలోకి ఏపీ వ్యాపారులు

తర్వాత గడువు కొద్దీ వ్యాపారం చేసుకుంటారు. ఈ సిండికేట్లోకి ఏపీ వ్యాపారులు చేరుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, పాలమూరు జిల్లాల్లోని మద్యం వ్యాపారులతో ఏపీ సిండికేట్ చర్చలు మొదలైనట్లు సమాచారం. ఈ సారి మద్యం టెండర్లలో దరఖాస్తుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.తెలంగాణ లిక్కర్ వ్యాపారులతో సిండికేట్ గా ఏర్పడ్డవాళ్లలో కృష్ణా, గోదావరి జిల్లాల వాళ్లే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. పాలమూరు జిల్లాలో స్థానిక వ్యాపారులను కర్నూలు, అనంతపురం జిల్లాల మద్యం వ్యాపారులు సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఈ ఏడాది కొనసాగించే 80 శాతం వైన్ షాపులను కూడా ప్రభుత్వం నిర్వహించేందుకు ఉత్తర్వులు ఇవ్వడంతో మద్యం వ్యాపారులకు పని లేకుండా పోయింది. దీంతో ఆంధ్రా బోర్డర్ జిల్లాల్లో ఉన్న స్థానిక మద్యం వ్యాపారులతో కలిసి టెండర్లలో పాల్గొనేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఉన్న మద్యం వ్యాపారులకు కమీషన్ ఆశచూపి ఏపీ సిండికేట్ పాగా వేస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో టెండర్ల దాఖలు భాగస్వామ్య పద్ధతిలో చేసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి.ప్రస్తుతం ఏపీలో 4,500పైగా వైన్ షాపులు, 750కిపైగా బార్లు ఉన్నాయి. మొదటి విడతలో బెల్టు షాపులను పూర్తిగా బ్యాన్ చేశారు. రెండో విడతలో 20 శాతం వైన్ షాపులు, బార్లకు ఈ ఏడాది లైసెన్స్ రెన్యూవల్ చేయకుండా ఆపేశారు. ఈ నిర్ణయంతో 800 వైన్ షాపులు అధికారికంగా రద్దయ్యాయి. ఈ నెల 1 నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. 3,500 మద్యం దుకాణాలను ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వమే నిర్వహించేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఎక్సైజ్ శాఖ పర్యవేక్షణలో ప్రభుత్వం వైన్ షాపులను ఏర్పాటు చేసి మద్యాన్ని అమ్ముతుంది. దీనికోసం 16 వేల మందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకోనున్నారు. ఏటా 20 శాతం చొప్పున లైసెన్సు రద్దు చేస్తూ రాబోయే నాలుగేళ్లలో మద్య నిషేధాన్ని అమలు చేయాలని, మద్యాన్ని స్టార్ హోటళ్లకే పరిమితం చేయాలని జగన్ సర్కారు భావిస్తోంది.

No comments:

Post a Comment