Breaking News

10/09/2019

సిటీ శివార్లలో పెరిగిన అద్దెలు

రెండు వేలకు పైగా పెరిగిన అద్దెలు
హైద్రాబాద్, సెప్టెంబర్ 10, (way2newstv.in)
హైదరాబాద్ లో మెట్రో రైలు నగర రూపురేఖలు, రవాణా  వ్యవస్థలో మార్పులు తెచ్చినట్లుగానే జీవన స్థితిగతులపై కూడా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఇంటి అద్దెలు పెరగడంతోపాటు భూముల ధరలకు కూడా రెక్కలొచ్చాయి. -నగర శివారు అంటే ఒకప్పుడు అందుబాటు ధరల్లో ఇళ్లు అద్దెకు దొరికేవి. మెట్రో పుణ్యాన ఏటా అద్దెలు పెరుగుతున్నాయి. సామాన్యుడిపై ఖర్చుల భారం పెరిగింది. చిరు ఉద్యోగంతో తక్కువ ఖర్చుతో ఇంటి ఖర్చులను నెట్టుకొచ్చినా గత ఏడాది కాలంగా పెరిగిన కిరాయిలు భారంగా మారాయి. దీనికి తగినట్లుగా సంపాదన పెరగకపోవడంతో కిరాయిదారులకు కష్టంగా మారుతోంది. 
సిటీ శివార్లలో పెరిగిన అద్దెలు

ఏడాది క్రితం రూ. 3,500 నుంచి 4,500కే దొరికిన సింగిల్ బెడ్రూం రూ.6 వేలకు చేరితే,  డబుల్‌‌ బెడ్‌‌రూమ్‌‌ రూ. 5 వేల నుంచి రూ.9 వేలకు పెరిగింది. దీంతో అన్ని వర్గాల వారికీ ఇంటి అద్దెలు భారంగా మారాయి. మెట్రో స్టేషన్లు, బస్ స్టేషన్లకు అందుబాటులో ఉండే ప్రాంతాలు, కాలనీల్లో  అద్దెకు ఇల్లు కావాలంటే కోర్ సిటీ ధరలకు సమానంగా రెంట్లు ఉన్నాయి. -ఒకప్పుడు నీటి వసతి, రోడ్లు, వెంటిలేషన్, రూం విస్తీర్ణం ఆధారంగా అద్దెలను ఇంటి యజమానులు నిర్ణయించేవారు. కానీ ఇప్పుడు మెట్రో అందుబాటులో ఉన్నందుకే రెంట్లు పెంచేస్తున్నారు.ఉప్పల్, ఎల్బీనగర్, హైటెక్ సిటీ, మియాపూర్  మార్గాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో గతేడాది పోల్చితే రూ. వెయ్యి నుంచి రూ.2వేల వరకు అద్దె పెంచేశారు.ఎల్బీనగర్, ఉప్పల్ పరిసరాల్లోనే కాదు.. శివారులోని నాగోల్‌‌, బండ్లగూడ, అల్కాపురి, స్నేహపురి, సాయినగర్‌‌, రాక్‌‌టౌన్‌‌, వినాయకనగర్‌‌, ఆర్టీసీ కాలనీ, లెక్చరర్స్ కాలనీ, మన్సూరాబాద్‌‌, రాజీవ్‌‌ గాంధీ నగర్‌‌, భాగ్యలత, ఆటోనగర్‌‌, బీఎన్ రెడ్డి నగర్,  మేడిపల్లి,  బోడుప్పల్, ఉప్పల్, చిలుక నగర్, హబ్సిగూడ, మెట్టుగూడల్లోనూ రెంట్లు పెంచేశారు. గతేడాది కంటే రూ.1,000 నుంచి రూ. 2,000 వరకు రెంట్లు పెరిగాయని రెంటల్ ఏజెన్సీ నిర్వాహకులు చెప్పారు. మెట్రో దగ్గర్లోనే ఉండటంతో పరిస్థితులు మారాయని చెబుతున్నారు. మెట్రో స్టేషన్ల నుంచి ఆటోలు, క్యాబ్ లు అందుబాటులోకి రావడంతో మెయిన్ రోడ్డుకు దూరంగా ఉన్న ఇళ్ల రెంట్లలో కూడా ఏ మార్పు లేదు.

No comments:

Post a Comment