Breaking News

14/09/2019

యడ్డీకి 17 మంది టెన్షన్

బెంగళూర్ , సెప్టెంబర్ 14, (way2newstv.in)
త్రిశంకు స్వర్గంలోనే అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు ఉన్నారు. కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి కారణమైన అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులోనూ నిన్న చుక్కెదురయింది. తమపై స్పీకర్ రమేష్ కుమార్ విధించిన అనర్హత వేటుపై స్టే ఇవ్వాల్సిందిగా వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు వీరికి స్టే ఇవ్వడానికి నిరాకరించింది. స్పీకర్ నిర్ణయం పై తీర్పు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలది.తమపై పడిన అనర్హత వేటు విషయంలో స్టే సంపాదించుకుంటే కొంత ఊరట పొందవచ్చని భావించారు. 
యడ్డీకి 17 మంది టెన్షన్

అయితే ఇప్పుడు తీర్పు కోసం ఎదురు చూడాల్సి రావడంతో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు ఎటూ కాకుండా పోయారు. తమ వల్లనే బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలో ఏర్పడినప్పటికీ, తాము చూస్తూ ఉండిపోవడం తప్ప ఏమీచేయలేని పరిస్థితి. అందుకే ఢిల్లీలో ఉన్న అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ పెద్దలను కలవాలని నిర్ణయించుకున్నారు. తమ పరిస్థితి, తమ భవిష్యత్తు ఏంటో వారి వద్దనే తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.మరోవైపు ముఖ్యమంత్రి యడ్యూరప్ప బెంగళూరులో ఉన్నప్పటికీ వారికి అన్ని రకాలుగా సాయం అందిస్తూనే ఉన్నారు. వారిలో అసంతృప్తి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీజేపీ పెద్దల అపాయింట్ మెంట్ కూడా యడ్యూరప్ప దగ్గరుండి ఇప్పిస్తున్నారు. వారికి వసతి దగ్గర నుంచి న్యాయ సలహాల వరకూ అంతా బీజేపీయే చూసుకుంటుంది. ఉప ఎన్నికలు జరిగినా వారి సహకారం యడ్యూరప్పకు అవసరం అవుతుంది. వారు పోటీ చేయకపోయినా వారి మద్దతుతోనే అధిక స్థానాలను గెలుచుకునే అవకాశముండటంతో యడ్యూరప్ప నిత్యం అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేలను బుజ్జగిస్తూనే ఉన్నారు.యడ్యూరప్ప మాత్రం వారికి త్వరలోనే తీర్పు వచ్చే అవకాశాలున్నాయని సర్ది చెబుతున్నారు. వారిని సంతృప్తి పర్చడానికి నామినేటెడ్ పోస్టులను కూడా యడ్యూరప్ప సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. కొన్ని కీలక పోస్టులకు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల పేర్లను సిఫార్సు చేస్తూ కేంద్ర కార్యాలయానికి కూడా పంపారని చెబుతున్నారు. కేంద్ర కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ అందితే వారికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చేయడానికి యడ్యూరప్ప సిద్ధంగా ఉన్నారు. ఇటు సుప్రీంకోర్టు,అటు బీజేపీ అధిష్టానం వైఖరితో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు నలిగిపోతున్నారు.

No comments:

Post a Comment