Breaking News

08/08/2019

దినకరన్ సోదిలో లేకుండా పోయారే....

చెన్నై, ఆగస్టు 8, (way2newstv.in -Swamy Naidu)
అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అధినేత టీటీవీ దినకరన్ డల్ అయ్యారా? వరస అపజయాలతో ఆయనను వెన్నంటి ఉన్న నేతలు పార్టీని వీడి వెళుతుండటంతో దినకరన్ పార్టీని ఏం చేయనున్నారు? 2021లో జరిగే ఎన్నికల్లో టీటీవీ దినకరన్ పార్టీ పోటీ చేస్తుందా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు తమిళనాడులో విన్పిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు టీటీవీ దినకరన్ అలికిడి రాజకీయాల్లో లేకపోవడమే ఇందుకు కారణం.తమిళనాడులో కొత్త పార్టీలు పుట్టుకురావడం కొత్తేమీ కాదు. వరసగా పార్టీలు వస్తుంటాయి. పోతుంటాయి. కమల్ హాసన్ కూడా మక్కల్ నీది మయ్యమ్ పార్టీని పెట్టారు. అయితే దినకరన్ ది ప్రత్యేక పరిస్థితి. తమ కుటుంబం చేతుల్లో నుంచి అధికార అన్నాడీఎంకే పార్టీ పోవడంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీని పెట్టారు. 
దినకరన్ సోదిలో లేకుండా పోయారే....

మేనత్త శశికళ సూచన మేరకు ఆయన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించడంతో పార్టీ పెట్టాలన్న ఆలోచన వచ్చింది.అన్నాడీఎంకేను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. పూర్తిగా పళనిస్వామి, పన్నీర్ సెల్వం చేతుల్లో ఉండటం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వారికి సహకరిస్తుండటంతో దినకరన్ ఏమీ చేయలేకపోయారు. ఇటవల జరిగిన లోక్ సభ, శాసనసభ ఉప ఎన్నికల్లో దినకరన్ పార్టీ అభ్యర్థులు సోదిలో లేకుండా పోయారు. ఏమాత్రం ప్రభావంచూపించలేక పోయారు. అధికార అన్నాడీఎంకే పార్టీ కూడా చచ్చీ చెడీ ఒక పార్లమెంటు స్థానాన్ని గెలుచుకుంది.అయితే అన్నాడీఎంకే అభ్యర్థుల ఓటమికి దినకరన్ పార్టీ కారణం కాదని విశ్లేషణల్లో తేలింది. ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాకపోవడం దీనిని తేలుస్తోంది. దీంతో అనేక మంది నేతలు దినకరన్ పార్టీని వదిలి అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేల్లో చేరిపోతున్నారు. దీంతో టీటీవీ దినకరన్ కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. 2021 నాటికి మరో కొత్త పార్టీ తమిళనాడులో వచ్చే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో దినకరన్ పార్టీని నడపగలరా? లేదా? అన్న సందేహం కలుగుతుంది. చిన్నమ్మ జైలు నుంచి సహకారం అందిస్తున్నా దినకరన్ వైఖరి కారణంగానే పార్టీ పుంజుకోవడం లేదన్న వ్యాఖ్యలు కూడా విన్పిస్తున్నాయి

No comments:

Post a Comment