Breaking News

23/08/2019

తమ దారి వెతుక్కుంటున్న టీటీడీపీ

హైద్రాబాద్, ఆగస్టు 23, (way2newstv.in - Swamy Naidu
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా కనుమరుగై పోయింది. ఇప్పటికే పార్టీలో అగ్రనేతలందరూ ఇతరపార్టీల్లోకి వెళ్లిపోయారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మనుగడ లేదని భావించిన తెలుగుతమ్ముళ్లు తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మిగిలిన నేతలే వేళ్ల మీద లెక్క పెట్టేంత మందే కావడం విశేషం. వారు కూడా త్వరలోనే పార్టీకి గుడ్ బై చెబుతారంటున్నారు. అయితే ఇందుకు ప్రధాన కారణం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలేనన్నది తెలుగు తమ్ముళ్ల నుంచి విన్పిస్తున్న మాట.చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికలకు ముందు వరకూ తెలంగాణ తెలుగుదేశం పార్టీపై కూడా దృష్టి పెట్టేవారు. తరచూ పర్యటించేవారు. కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు తెలంగాణ పార్టీని పూర్తిగా గాలికి వదిలేశారు. 2014 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ గెలవడంతో తెలంగాణ పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. 
 తమ దారి వెతుక్కుంటున్న టీటీడీపీ
పైగా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి మహాకూటమిని చంద్రబాబు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పడిన టీడీపీ అదే పార్టీతో జత కట్టడాన్ని సంప్రదాయంగా వస్తున్న ఓటర్లతో పాటు నేతలు సయితం జీర్ణించుకోలేకపోయారు.2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కేవలం రెండుసీట్లు మాత్రమే గెలచుకుంది. పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న జిల్లాల్లోనూ కనీసం టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. దీంతో నేతల్లో నైరాశ్యం ఆనాడే కన్పించింది. మరోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ క్రమంగా ప్రాధాన్యత కోల్పోతూ వచ్చింది. రేవంత్ రెడ్డి లాంటి నేతలు పార్టీని వీడటం కూడా బలహీన పడటానికి మరొక కారణంగా చెబుతున్నారు.ఇక 2019 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు తన శక్తినంతా ఆంధ్రప్రదేశ్ మీదనే పెట్టారు. అక్కడి ఎన్నికల్లో తలమునకలై ఉన్న నేపథ్యంలో తెలంగాణ లో జరిగిన పార్లమెంటు ఎన్నికలకు దూరంగా ఉండటమూ పార్టీ నేతలు వెళ్లిపోవడానికి కారణంగా చెబుతున్నారు. పార్టీని ఇక్కడ బలోపేతం చేయాలన్న ఆలోచన లేకపోబట్టే చంద్రబాబు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయించకుండా తొలిసారి నిర్ణయం తీసుకున్నారంటున్నారు. ఇప్పుడు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ తప్ప పెద్దగా చెప్పుకునే నేతలు ఎవరూ పార్టీలో లేకపోవడం గమనార్హం. ఇక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు త్వరలోనే తాళాలు పడతాయన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి.

No comments:

Post a Comment