Breaking News

02/08/2019

టోల్ తీస్తున్న గేట్లు

హైద్రాబాద్, ఆగస్టు 2  (way2newstv.in)
ఏపీ రాజధానికి వచ్చే జనాలకు టోల్ తీస్తోంది ఎన్ హెచ్ ఏఐ.టోల్ ఫీజుల పేరుతో ఎడా,పెడా వాయించేస్తోంది. అటు గుంటూరు, ఇటు విజయవాడ.. ఎటు వెళ్లినా ఫీజుల మోత తప్పడం లేదు. బెజవాడకు నాలుగువైపులా ఎటువైపు వెళ్లినా టోల్ గేట్ రూపంలో పర్సులు ఖాళీ అవ్వాల్సిందే. నగరానికి 15 కిలోమీటర్ల దూరంలోనే టోల్ గేట్లు ఉండటంతో జనాలను కష్టాలు వెంటాడుతున్నాయి. బెజవాడనుంచి మచిలీపట్నం వెళ్లాలంటే దావులూరులో టోల్ గేట్.. గుంటూరు వైపు వెళ్లాలంటే కాజ వద్ద టోల్ గేట్.. ఇటు హనుమాన్ జంక్షన్ వైపు పొట్టిపాడు దగ్గర మరొకటి. ఇటు హైదరాబాద్ రూట్‌లో కీసర దగ్గర టోల్ గేట్. ఇలా నాలుగు వైపులా టోల్ గేట్లు భారంగా మారాయి. ఏ టోల్‌గేట్ దగ్గరకు వెళ్లినా.. కారుకి అప్ అండ్ డౌన్ కలిపి 135 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. బెజవాడ నుంచి మచిలిపట్నం వెళ్లే రహదారి కొత్తగా నిర్మిస్తున్నారు. అసలు ఈ రోడ్డు నిర్మాణమే పూర్తి కాలేదు.. ఇంకా పనులు జరుగుతున్నాయి. రోడ్డుకి రాళ్లు అడ్డుపెట్టి డైవర్షన్ కూడా పెట్టారు.. రోడ్డు నిర్మాణమే పూర్తికాకుండా అప్పుడే టోల్ ఫీజు వసూలు చేసేస్తున్నారు. 
టోల్ తీస్తున్న గేట్లు

ఇక కంకిపాడు దాటాక అంటే టోల్ గేట్‌కు కిలోమీటర్ దూరంలో అసలు హైవే నిర్మాణమే పూర్తి కాలేదు. అక్కడ భూమి ఇవ్వడానికి రైతులు నిరాకరించి.. కోర్టును ఆశ్రయించడంతో నిర్మాణం ఆగిపోయింది. ప్రస్తుతం సింగిల్ లైన్ మీదే రాకపోకలు సాగుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నా.. అది పట్టించుకోకుండా టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు. కొత్తగా రోడ్డు వేస్తున్నారనగానే మచిలీపట్నంకు రాకపోకలకు బావుంటుందని బెజవాడవాసులు అనుకున్నారు. ఇప్పుడు ఆ ఆనందం కాస్తా ఆవిరైపోయింది. ఒకసారి అటు వెళ్లి ఇటు రావాలంటే రూ.125 కారుకు చెల్లించాల్సి వస్తోంది. ఇక టోల్ గేట్‌కు అటు 20 కిలోమీటర్లు, ఇటు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వాహన దారులకు ఉచితంగా పాస్ ఇవ్వాలి.. అలా ఇవ్వకుండా వాహనం మీద రిజిస్ట్రేషన్ అడ్రస్, యజమాని అడ్రస్ ప్రూఫ్ ఒకేలా ఉంటే 300 కడితే పాస్ ఇస్తున్నారు. తమ భూముల్ని టోల్ గేట్ కోసం త్యాగం చేస్తే.. తమ దగ్గరే టోల్ గేట్ వసూలు చేస్తారా అంటూ భూయజమానులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు.విజయవాడ గుంటూరు మధ్య కాజ దగ్గర మరో టోల్ గేట్ ఉంది. విజయవాడకి 20 కిలోమీటర్ల దూరంలో అటు గుంటూరుకి పది కిలోమీటర్ల దూరంలో ఈ టోల్ గేట్ ఏర్పాటయ్యింది. రాజధాని అమరావతి పరిధిలో ఉన్న గుంటూరు, విజయవాడ మధ్య ఎటు వెళ్లాలన్నా.. ఈ టోల్ ఫీజు కట్టాల్సిందే. కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు సిటీల మధ్యలో ఈ టోల్ గేట్ ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గుంటూరు నుంచి ఈ టోల్ గేట్‌కు దూరం కేవలం 13 కిలోమీటర్లు. గుంటూరు వాళ్లు బెజవాడ రావాలంటే రూ.135 కట్టి రావాల్సిందే. ఇలా గత పదిహేనేళ్లుగా టోల్ గేట్ కడుతూనే ఉన్నారు. బీవోటీ పద్దతిలో (బిల్ట్ ఆపరేట్, ట్రాన్స్ ఫర్) ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించారు. ఇప్పటికి పదిహేనేళ్లు పూర్తైనా టోల్ గేట్ వసూలు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఎన్నేళ్లు వసూలు చేస్తారో కూడా తెలీని పరిస్థితి. హనుమాన్ జంక్షన్ వెళ్లే దారిలో పొట్టిపాడు వద్ద మరో టోల్ గేట్ ఉంది. విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న టోల్ గేట్.. హనుమాన్ జంక్షన్ వైపు ఏ వాహనం వెళ్లాలన్నా ఇక్కడ టోల్ గేట్ కట్టాల్సిందే. ఇక్కడా 15 ఏళ్ల నుంచి టోల్ ఫీజ్ వసూలు చేస్తున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు కేవలం ఆరుకిలోమీటర్ల దూరంలోనే ఈ టోల్ గేట్ ఉంది. ఇక్కడా కారుకు రూ.110 వసూలు చేస్తారు. ఇక మిగిలింది కీసర్ టోల్ గేట్. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన టోల్ గేట్. ఇక్కడ కారుకు అప్ అండ్ డౌన్ కారుకు రూ.100 రూపాయలు కట్టాల్సిందే. ఇలా రాజధాని ప్రాంతం టోల్‌గేట్ దిగ్భందంలో చిక్కుకుపోయింది. ఆర్టీసీ బస్సులో వెళదామా అంటే బస్సులో ఇచ్చే టికెట్‌పై టోల్ గేటు రుసుము వసూలు చేస్తున్నారు. అంతేకాదు బెజవాడ నుంచి హైదరాబాద్ రావాలంటే ఆరు టోల్ గేట్లు.. బెజవాడ నుంచి నెల్లూరు వెళ్లాలన్నా ఆరు.. బెజవాడ నుంచి వైజాగ్ వెళ్లాలన్నా ఆరు టోల్ గేట్లలో ఫీజు కట్టుకుంటూ పోవాల్సిందే. అదే ప్రైవేట్ వాహనాల్లో (క్యాబ్‌లు) వెళితే జేబు ఖాళీ అవుతోంది. ఇక రాజధానిలో సెక్రటేరియెట్ ఉండటంతో రాష్ట్ర నలుమూలల నుంచి జనాలు రావాల్సి ఉంటుంది కాబట్టి.. ఈ టోల్ ఫీజులు వారికి భారంగా మారింది. టోల్‌ గేట్ ఏదైనా జనాల జేబులకు మాత్రం చిల్లులు పడుతోంది. ప్రైవేట్ సంస్థలు నిర్మించిన రోడ్డును వాడుకున్నందుకు ఇలా అద్దె రూపంలో టోల్ ఫీజ్ మనమే కడుతున్నప్పుడు ఇక ప్రభుత్వాలు చేసేదేముంది అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. ప్రభుత్వాలు నిర్మించాల్సిన రోడ్లు ప్రైవేట్ సంస్థలకు ఎందుకు అప్పగిస్తున్నారు. ఎప్పుడో వేసిన రోడ్డుకి టోల్ ఫీజు వసూళ్లు చేయడంపై జనాలు షాక్ అవుతున్నారు. టోల్ గేట్ గడువు పూర్తయ్యాక.. ఆయా ప్రైవేట్ సంస్థలు రోడ్లు ప్రభుత్వానికి అప్పగించి టోల్ గేట్ వసూళ్లు ఆపేయాలి. కానీ అలా ఆపకుండా ఇష్టారాజ్యంగా ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఫీజులు వసూలు చేస్తున్నారని జనాలు మండిపడుతున్నారు. 

No comments:

Post a Comment