Breaking News

27/08/2019

ఇసుక వాహనాలకు ట్రాకింగ్ ఏర్పాట్లు

నాగర్ కర్నూలు ఆగష్టు 27  (way2newstv.in - Swamy Naidu)
జిల్లాలో ఇసుక, మట్టి అక్రమ రవాణాను అరికట్టేందుకు గాను ప్రభుత్వ అనుమతితో ఇసుక సరఫరా చేసే అన్ని వాహనాలకు జిపిఎస్ ట్రాకింగ్ పద్ధతిని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఇ. శ్రీధర్ ఆదేశించారు. సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో జిల్లాలో గనులు, నీటిపారుదల శాఖ ద్వారా ఇస్తున్న మైనింగ్ అనుమతులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక, మట్టి తరలింపు లపై ప్రభుత్వం తరఫున అనుమతించిన వాహనాల కు సంబంధించి, అవి తరలిస్తున్న ఇసుక, వాటికి సంబంధించి రోజువారి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. చిన్న నీటి చెరువుల నుండి తరలిస్తున్న మట్టి కి సంబంధించి పూర్తి నియంత్రణ ఉండాలని, చిన్న నీటి పారుదల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మురళిని ఆదేశించారు. 
ఇసుక వాహనాలకు ట్రాకింగ్ ఏర్పాట్లు
జిల్లాలో అనుమతి ఉన్న వాహనాలు మాత్రమే ఇసుకను, ఒండ్రు మట్టిని తరలించాలని, అనుమతులు లేకుండా ఇసుకను, మట్టిని తరలిస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అంతేకాక ప్రాజెక్టుల,  పనుల పేరుమీద అనుమతులు తీసుకుని ఇతర ప్రాంతాలకు ఇసుక తరలించినట్లు అయితే వాహనాలతో పాటు, సంబంధిత శాఖ అధికారులపై కూడా కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. అక్రమ ఇసుక, మట్టి రవాణా ను అరికట్టేందుకు గాను వాహనాలకు జిపిఎస్ పద్ధతిని అనుసంధానం చేయాలని అన్నారు. గనుల శాఖ ద్వారా వివిధ రకాల మైనింగ్ అనుమతులు తీసుకున్నవారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా అంతే  పరిమాణంలో హరితహారం కింద మొక్కలు నాటాలని, ఇప్పటివరకు ఇచ్చిన మైనింగ్ అనుమతులకు సంబంధించి పూర్తి వివరాలతో పాటు, అలాగే ఇప్పటివరకు నాటిన మొక్కలకు సంబంధించిన వివరాలను కూడా సమర్పించాలని, గనుల శాఖ ఏడి శ్రీనివాస్ ను ఆదేశించారు. ఇసుక రిజిస్ట్రేషన్కు సంబంధించి ఒక నిర్దేశిత సమయాన్ని నిర్ణయించాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తో కోరారు. ఇసుక రవాణాపై రోజువారి నివేదికతో పాటు  వీక్లీ రిపోర్టు కూడా సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీవో హనుమానాయక్, గ్రౌండ్ వాటర్ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

No comments:

Post a Comment