Breaking News

24/08/2019

పొలిటికల్ కరప్షన్ పైనే జగన్

విజయవాడ, ఆగస్టు 24, (way2newstv.in)
ప్రమాణ స్వీకార వేదికపై నుంచే అవినీతిపై శంఖారావం పూరిస్తున్నట్లుగా ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్. ఆ తర్వాత ఉన్నతస్థాయి సమావేశం జరిగిన ప్రతిచోటా అవినీతిలేని పాలన అందిస్తానంటూ వై.ఎస్.జగన్ పునరుద్ఘాటిస్తున్నారు. అమెరికా పర్యటనలో సైతం అదే మాటను పదేపదే చెప్పారు. ఒకవైపు అధికారయంత్రాంగం, రాజకీయనేతాగణం కలగలసి అవినీతిని స్ట్రీమ్ లైన్ చేసేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గద్దె దిగిపోవడానికి అదొక ముఖ్య కారణంగా నిలిచింది. ప్రజలు కూడా పనులు అయితే చాలు ఎంతోకొంత ముట్టచెప్పాల్సిందే అని సిద్ధపడిపోతున్నారు. అన్ని విభాగాలలోనూ కరప్షన్ పర్సంటేజీలు పక్కాగా అమలయిపోతున్నాయి. ఈదశలో అధికారపగ్గాలు చేపట్టారు వై.ఎస్.జగన్. 
పొలిటికల్ కరప్షన్ పైనే జగన్ 

దీర్ఘకాలం అధికారంలో కొనసాగదలచుకున్న తనకు సంబంధించి స్పష్టమైన సంకేతాలు ప్రజలకు, పార్టీ నాయకులకు, యంత్రాంగానికి ఇస్తేనే పాలన గాడిన పడుతుందని గ్రహించారు. తెలంగాణలో పెద్ద స్థాయిలో కరప్షన్ ఉన్నప్పటికీ నియోజకవర్గాల్లో అదుపు తప్పి అవినీతికి పాల్పడటానికి నాయకులు భయపడుతున్నారు. కేసీఆర్ ఏరకమైన చర్యలు తీసుకుంటారోననే ఆందోళన ఉంది. ఎన్నికలకు సంబంధించిన వ్యయాన్ని అధిష్ఠానమే చూసుకొంటోంది. అందువల్ల విచ్చలవిడి అవినీతి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల స్థాయిలో లేదనే చెప్పాలి. కానీ అధికారులు మాత్రం ఇంకా దారికి రాలేదు. అందుకే రెవిన్యూ , ఇతర విభాగాలపై సీఎం కేసీఆర్ సీరియస్ అవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. తెలంగాణ మోడల్ ను అనుసరిస్తే పొలిటికల్ కరప్షన్ దిగువస్థాయిలో కంట్రోల్ చేయవచ్చని వైసీపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు ఆంతరంగిక సమాచారం. పార్టీ నిర్వహణ, ఎన్నికలకు అవసరమైన ఖర్చులు భవిష్యత్తులో అధిష్టానం నుంచే అందించవచ్చనుకుంటున్నారు. దీనికి అవసరమైన ఫండింగ్ కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలనుంచి సమకూర్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. దీనివల్ల విచ్చలవిడితనం తగ్గుతుందనే అంచనా. దిగువస్థాయిలో ప్రతిపనికీ పర్సంటేజీలే అన్నట్లుగా పాకిపోయి ప్రజల్లో పలచనైపోతున్న స్థితిలో అవినీతి నిన్నామొన్నటివరకూ కనిపించింది. దీనిని పై స్థాయికి పరిమితం చేసి కట్టడి చేయాలనే ప్రయత్నం ఎంతవరకూ ఫలితాలనిస్తుందనేది వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే తాజాగా ఎన్నికైన ప్రతినిధులు, చోటామోటా నోళ్లను వై.ఎస్.జగన్ కుట్టేసినట్లే కనిపిస్తోంది.ఆమేరకు అవినీతిపై హెచ్చరికతో కూడిన సంకేతాలు, సందేశాలు అందిస్తూ వస్తున్నారు. దీనివెనక కూడా రాజకీయ వ్యూహం దాగి ఉందని పేర్కొంటున్నారు జగన్ ఆంతరంగికులు.ప్రతిపక్షంలో ఉన్న ఏడు సంవత్సరాలకు పైబడిన కాలంలో వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు కోట్ల రూపాయల్లో భారీగానే ఖర్చయింది. 2014 ఎన్నికల్లో దాదాపు అధికారంలోకి వచ్చేస్తున్నామన్న అంచనాతో పెద్ద మొత్తంలోనే అభ్యర్థులకు తోడు పార్టీశ్రేణులు సైతం వెచ్చించాయి. అప్పట్లో అధిష్ఠానం మాత్రం కొంత పొదుపు పాటించింది. మితిమీరిన ఆత్మవిశ్వాసమే అందుకు కారణం. నియోజకవర్గాల్లోనే నాయకులు ఖర్చును సమకూర్చుకున్నారు. రిజర్వ్ డ్ నియోజకవర్గాలకు మాత్రమే వైసీపీ హెడ్ క్వార్టర్స్ నుంచి నిధులు సమకూర్చారు. అది తెలుగుదేశం పార్టీ అడ్వాంటేజ్ గా మార్చుకుని అధికారంలోకి వచ్చింది. అప్పటికే పదేళ్లు అధికారంలో లేకపోవడంతో చావోరేవో తేల్చుకోవాలనుకున్న చంద్రబాబు అన్నిరకాలుగానూ నిధులను కుమ్మరించారు. 2019 ఎన్నికలు వచ్చేసరికి సీన్ రివర్స్ అయ్యింది. అటు కేంద్రప్రభుత్వం ఆదాయపన్నుశాఖ, నిఘా విభాగాలతో టీడీపీ నిధుల పంపిణీ, ఆదాయమార్గాలను నియంత్రించింది. అదే సమయంలో పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వమూ అక్కడి పారిశ్రామిక, వ్యాపార వర్గాలనుంచి టీడీపీకి ఫండ్స్ రాకుండా చూసింది. అదే సమయంలో వై.ఎస్.జగన్ కి ఫ్రీ హ్యాండ్ లభించింది. పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో వై.ఎస్.జగన్ సైతం చేతికి ఎముక లేదన్నట్లుగా నిధులను విడుదల చేశారు. ఆర్థికంగా బలోపేతంగా ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేశారు. దాంతో అధికారంలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి వెన్ను విరిగిపోయింది.తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇసుక దగ్గర నుంచి కాంట్రాక్టుల వరకూ సాగిన దోపిడీని వైసీపీ నాయకులు చాలా దగ్గర నుంచే చూశారు. రెండు ఎన్నికలలో ఖర్చుకు తోడు వై.ఎస్.జగన్ పాదయాత్ర సందర్భంగానూ భారీ మొత్తమే వారు వెచ్చించాల్సి వచ్చింది. దీనికితోడు నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాల నిర్వహణ భారమూ పడింది. ఆస్తులు అమ్ముకుని, అప్పులు చేసి దివాలా తీసిన స్థితిలో ఉన్న నాయకులకు అధికారం అనేది అద్భుతమైన వరంగా కనిపిస్తోంది. క్యాడర్ ఆవురావురుమంటూ ఉంది. అధికారాన్ని ఆసరాగా చేసుకుని వెంటనే వసూళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుడితే వైసీపీ ప్రతిష్ఠ మసకబారుతుంది. టీడీపీకి కంటే ముందుగానే ప్రజల్లో పలచన అయిపోతారు. పైపెచ్చు రాజకీయ నాయకుల కరప్షన్ అధికారులకు అలుసుగా మారుతుంది. వారు మరింతగా పేట్రేగిపోయే ప్రమాదం ఉంటుంది. అందులోనూ ఇంతకాలం పార్టీని నడపడానికి తాము పడిన శ్రమంతా వై.ఎస్.జగన్ కు తెలుసు కాబట్టి అవినీతి విషయంలో చూసీ చూడనట్లుగా ఉంటారనే భావన వైసీపీ వర్గాల్లో ఏర్పడింది. దీనికి మొదట్లోనే ఫుల్ స్టాప్ పెట్టకపోతే పరిస్థితి అదుపు తప్పిపోతుంది. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ప్రతిష్ట కు మచ్చ ఏర్పడుతుంది. అందుకే వై.ఎస్.జగన్ వ్యూహాత్మకంగా అవినీతిని సహించేది లేదంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పార్టీ నాయకుల కాళ్లు చేతులు కట్టేసినట్లయ్యింది.

No comments:

Post a Comment