Breaking News

13/08/2019

పంటలకు ప్రాణం పోసిన వరుణుడు

కరీంనగర్, ఆగస్టు 13, (way2newstv.in)
ముందుస్తుగా పలకరించి.. ఆ తరువాత అడపాదడపా మురిపించిన వానలు గత నెలరోజులకుపైగా మేఘాల్లోనే నిద్రపోగా, వర్షం జాడలేక వాడిపోతున్న చిగురాకుపై ఎట్టకేలకు చినుకు రాలింది. వానలను నమ్ముకుని సాగు చేసిన అన్నదాతలు వర్షం కోసం ఆకాశానికేసి తదేకంగా చూస్తున్న తరుణంలో వరుణ దేవుడు కరుణించి, చిరు జల్లులతో పంటలకు జీవం పోశాడు. అన్నదాతలకు ఊరట కలిగించాడు. సోమవారం వేకువజాము నుంచి రాత్రి వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతటా వర్షం కురిసింది. కొన్ని మండలాల్లో చిరు జల్లుల నుంచి మోస్తరు వరకు వర్షం కురిసింది. మరికొన్ని మండలాల్లో భారీ వర్షం పడింది. 
పంటలకు ప్రాణం పోసిన వరుణుడు

ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, మెట్‌పల్లి, ముత్తారం, కమాన్‌పూర్ మండలాల్లో భారీ వర్షం కురువగా, సైదాపూర్, పెద్దపల్లి, గోదావరిఖని, సుల్తానాబాద్, కొడిమ్యాల, యైటింక్లయిన్‌కాలనీ, ఇబ్రహీంపట్నం, మానకొండూర్, వెల్గటూర్, చొప్పదండి, ఓదెల, సిరిసిల్ల, ముస్తాబాద్, ఇల్లంతకుంట, ధర్మారం, శంకరపట్నం, కోరుట్ల, జూలపల్లి తదితర మండలాల్లో చిరు జల్లుల నుంచి మోస్తరు వరకు కురిసింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో ప్రజలు ఇబ్బందులుపడాల్సి వచ్చింది. భారీ వర్షం కురిసిన చోట లోతట్టు ప్రాంతాల ప్రజలు అవస్థలు పడ్డారు. అటు మిషన్ భగీరథ పనులు కొనసాగుతుండటంతో కొద్దిపాటి వర్షానికే రహదారులు చిత్తడి చిత్తడిగా మారి, వాహనదారులకు చుక్కలు చూపించగా, కొన్ని రహదారులు బురదయమంగా మారాయి. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కాగా, ఉమ్మడి జిల్లాలో సుమారు 3.50లక్షల హెక్టార్లలో వివిధ పంటలను రైతులు సాగు చేయగా, నెలరోజులుగా వానలు లేక ఇప్పటికే పంటలు ఎండిపోగా, కొన ఊపిరితో ఉన్న పంటలకు ఈ వర్షాలు కాస్త ప్రాణం పోసినట్లు కాగా, రైతులకు కొంత ఊరట కలిగింది. మరో రెండ్రోజులు వానలు ఉంటాయన్న వార్తలతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

No comments:

Post a Comment