Breaking News

05/08/2019

ఇక కశ్మీర్ లో స్థలాలు కొనుగోలు చేసుకోవచ్చు

శ్రీనగర్, ఆగస్టు 5  (way2news.in - Swamy Naidu ):
ఆర్టికల్ 370 రద్దు కారణంగా జమ్మూ కశ్మీర్ భారత్‌లో పూర్తి భాగమైనట్టే. ఈ ఆర్టికల్ రద్దుతో ఇతర ప్రాంతాల ప్రజలకూ అక్కడ ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఏర్పడుతుంది. పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం అవుతుంది. ఇప్పటి వరకూ రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సమాచార శాఖల వ్యవహారాలు మాత్రమే కేంద్రం పరిధిలో ఉండగా.. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడంతో.. ఇక మీదట ప్రతీది మోదీ సర్కారు కనుసన్నల్లోనే జరుగుతుంది. జమ్మూ కశ్మీర్ ప్రజలకున్న ద్వంద్వ పౌరసత్వం రద్దువుతుంది. ఆటోమెటిగ్గా జమ్మూ కశ్మీర్‌కున్న ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక పీనల్ కోడ్ రద్దవుతాయి. మరో రకంగా చెప్పాలంటే.. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ కారణంగా ఇప్పటి వరకూ దేశంలోని మిగతా ప్రాంతాలు, జమ్మూ కశ్మీర్ మధ్య ఓ విభజన రేఖ ఉంది. ఇప్పుడు అది తొలగడంతో.. ఇక్కడి ఆస్తులను వేరే వ్యక్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
 ఇక కశ్మీర్ లో స్థలాలు కొనుగోలు చేసుకోవచ్చు
దీంతో పరిశ్రమల స్థాపనకు వీలవుతుంది. ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఇక్కడ స్థిరపడేందుకు అవకాశం కలుగుతుంది. కశ్మీర్ విడిచి వెళ్లిన కశ్మీరీ పండిట్లు మళ్లీ వెనక్కి వచ్చేందుకు వీలవుతుంది. అక్కడి ఉద్యోగాల్లో బయటి వారు చేరడానికి కూడా వీలవుతుంది. స్థానికులకు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీని వల్ల హింస తగ్గుముఖం పట్టి, రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకెళ్లే అవకాశం ఉంది. ఆర్టికల్ 35ఏ ప్రకారం ఇక్కడి అమ్మాయిలను బయటి వ్యక్తులు పెళ్లాడితే.. ఆమెతోపాటు ఆమె సంతానానికి వారసత్వంగా వచ్చే ఆస్తి దక్కదు. ఇక మీదట ఇక్కడ అలాంటి పరిస్థితి ఉండదు. 1965, 1971 యుద్ధాల సమయంలో పాకిస్థాన్‌ నుంచి వలస వచ్చిన వారికి ఇప్పటి వరకూ కశ్మీర్ పౌరసత్వం దక్కలేదు. ఇక మీదట వీరి కష్టాలు తీరినట్టే. ఆర్టికల్ 370 రద్దు వల్ల కశ్మీర్లో కొన్నేళ్లపాటు సంఘర్షణ తలెత్తినప్పటికీ.. పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాలు పెరగడంతో.. కశ్మీరీ యువత ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది. క్రమంగా ఘర్షణలకు దూరం కావడంతో కశ్మీర్ లోయలో శాంతియుత వాతావరణం ఏర్పడొచ్చు. అదే జరిగితే కశ్మీర్ మళ్లీ పర్యాటకుల స్వర్గంగా మారుతుంది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక జెండా, అజెండా లాంటివేం ఉండబోవు. అక్కడ జాతీయ జెండాను అవమానించడం ఇక మీదట కుదరదు. సుప్రీం తీర్పులు, దేశంలోని మిగతా ప్రాంతాలకు వర్తించిన చట్టాలు కశ్మీర్‌కు కూడా వర్తిస్తాయి. ఈ రెండు ఆర్టికల్స్‌ను రద్దు చేసినందువల్ల ప్రతికూల పర్యావసనాలకు కూడా ఆస్కారం ఉంది. కశ్మీరీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎలాంటి హింసాత్మక ఘటనలు తలెత్తకుండా కేంద్రం భారీగా సాయుధ బలగాలను మోహరించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని జమ్మూ కశ్మీర్లోని పార్టీలు న్యాయస్థానాల్లో సవాల్ చేసే అవకాశం ఉంటుంది

No comments:

Post a Comment