Breaking News

22/08/2019

సంక్షేమ హాస్టళ్లకు పెరుగుతున్న డిమాండ్

నల్గొండ, ఆగస్టు 22, (way2newstv.in)
 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత విద్యార్థి వసతి గృహాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. గతానికి భిన్నంగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.  ఎస్టీ వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానానికి శ్రీకారం చుట్టి సత్ఫలితాలను రాబట్టిన ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి అన్నపూర్ణ సాఫ్ట్‌వేర్ పేరుతో ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ సాఫ్ట్‌వేర్‌తో ఇకపై విద్యార్థుల హాజరుశాతం ఆధారంగానే మెనూ.. కాస్మోటిక్ తదితర చార్జీల చెల్లింపులు జరుగుతాయి. ఎస్టీ వసతిగృహాల్లో మరింత పారదర్శకతను పెంపొందింపజేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విద్యార్థుల తల్లిదండ్రుల్లో అమితానందాన్ని కల్గిస్తున్నాయి. 
 సంక్షేమ హాస్టళ్లకు పెరుగుతున్న డిమాండ్

జిల్లాలో 23ఎస్టీ హాస్టళ్లు ఉండగా.. 8ఆశ్రమ పాఠశాలలు, 11ప్రీమెట్రిక్ హాస్టళ్లున్నాయి. సూర్యాపేట జిల్లాలో 10హాస్టళ్లు, 3ఆశ్రమ పాఠశాలలు, 8ప్రీమెట్రిక్ హాస్టళ్లు, భువనగిరియాదాద్రి జిల్లాలో 5హాస్టళ్లు, ఒక ఆశ్రమ పాఠశాల, రెండు ప్రీమెట్రిక్ హాస్టళ్లున్నాయి. వసతి గృహాల్లో భోజనం చేసే విద్యార్థుల సంఖ్య పక్కాగా నమోదు చేసేలా ఇప్పటికే చాలావరకు ఎస్టీ వసతిగృహాల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తున్నారు. అయినా కొన్ని వసతిగృహాల్లో విద్యార్థుల సంఖ్యను అధికంగా చూపించి బియ్యంతోపాటు ఇతరత్రా బిల్లులను కాజేస్తున్నారని ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. దీంతో అక్రమాలకు కళ్లెం వేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్నపూర్ణ సాఫ్ట్‌వేర్ పేరుతో ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకు వస్తోంది.ఎస్టీ వసతిగృహాల్లో 2014 సంవత్సరం నుంచి సన్నబియ్యంతో ఆహార పట్టిక ప్రకారం పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ప్రతి రోజు కోడిగుడ్డుతోపాటు బుధ, ఆదివారాల్లో చికెన్, మటన్‌తో భోజనం పెడుతున్నారు. దీంతోపాటు క్రీడా వస్తువులు, పుస్తకాలు, నోట్ పుస్తకాలు, దుప్పట్లు, కార్పెట్లు, ట్రంక్‌బాక్స్‌లను ప్రభుత్వం ప్రతి యేటా అందిస్తోంది. ప్రస్తుతం రిజిస్టర్లలో ఉన్న విద్యార్థుల నమోదు ఆధారంగా రేషన్‌తోపాటు ఇతర సదుపాయాలను కల్పిస్తున్నారు. అయితే ఎక్కువ మంది పేర్లు రాసి వసతి గృహంలో లేని విద్యార్థులకు కూడా హాజరు వేసి కొందరు వార్డెన్లు వారి పేరుపై వచ్చే రేషన్, ఇతర నగదును స్వాహా చేస్తున్నారనే అరోపణలు ఉన్నాయి. వీటిని నియంత్రించడానికి అన్నపూర్ణ సాఫ్ట్‌వేర్ ఎంతగానో ఉపయోగపడనుంది. హాజరు శాతం ఆధారంగా ఒక్కో విద్యార్థికి అందించే రేషన్‌తోపాటు, ఇతర బిల్లుల లెక్కలను ఈ సాఫ్ట్‌వేర్ తేల్చుతుంది. స్థానికంగా కొనుగోలు చేసే నిత్యావసర సరుకులు, కూరగాయలు తదితర వాటి రేట్లను కూడా అన్నపూర్ణ సాఫ్ట్‌వేర్ ఏరోజుకారోజే నిర్ధారిస్తుంది. ఇక నుంచి నెలవారీగా కాకుండా ప్రతి రోజు క్లోజింగ్ బ్యాలెన్స్‌ను సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయనుండడంతో ఆ ప్రకారంగా అదే రోజు బిల్లు జనరేట్ అవుతుంది. బయోమెట్రిక్ యంత్రానికి అనుసంధానంగా అన్నపూర్ణ యాప్‌ను అమలుచేసేందుకు ప్రతి వసతి గృహానికి కంప్యూటర్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. నూతన విధానంతో ప్రతి రోజు విద్యార్థుల హాజరు శాతాన్ని రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు అక్కడినుంచే నేరుగా పర్యవేక్షించవచ్చు. ఏ వసతి గృహంలో ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారు.. వారి పేరున ఆ రోజు ఎంత బిల్లు జనరేట్ అయ్యింది తదితర వివరాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు. ప్రతి నెలా విద్యార్థుల హాజరు శాతాన్ని నివేదికల రూపంలో తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా ఏ రోజుకారోజు తెలిసిపోతుంది.

No comments:

Post a Comment