అదిలాబాద్, ఆగస్టు 22, (way2newstv.in)
రోడ్డు సౌకర్యం లేక నరకయాతన అనుభవించిన మారుమూల ప్రాంతాల ప్రజల కల ఇక నెరవేరనుంది. ఇప్పటివరకు నల్ల తారు(బీటీ) రోడ్డు ఎరగని ఆ గ్రామాల ప్రజల రవాణా కష్టాలు ఇక తీరనున్నాయి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై) పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆయా గ్రామాలకు మొదట గ్రావెల్(మొరం, కంకర) రోడ్లను నిర్మించి, ఆ తర్వాత దాని ఉన్నతీకరణలో భాగంగా బీటీ రోడ్డుగా మారుస్తుంది.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ఆవాసాలకు గతంలో గ్రావెల్ రోడ్లను పీఎంజీఎస్‌వై కింద నిర్మించారు.
వడివడిగా కొత్త రోడ్ల నిర్మాణాలు
ఆ రోడ్ల ఉన్నతీకరణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 11వ విడతలో రూ.168 కోట్లతో 95 ఆవాసాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి వారం రోజుల క్రితం జాతీయ గ్రామీణ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్‌ఆర్‌ఆర్‌డీఏ)కు ప్రతిపాదనలు పంపించాయి. 392 కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్న ఈ రోడ్లకు ఒక్కో కిలోమీటర్‌కు సగటున రూ.42.92 లక్షల వ్యయం అవుతుందని అధికారులు అంచనాల్లో పేర్కొన్నారు.ఆదిలాబాద్, కుమురంభీం(ఆసిఫాబాద్) జిల్లాలకు సంబంధించి మారుమూల ఆవాసాలు అధికంగా ఉండగా, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు సంబంధించి తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతిపాదనలకు సంబంధించి డిటేల్ ప్రాజెక్టు(డీపీ) యాక్ట్ తయారు చేసుకోవాలని ఎన్‌ఆర్‌ఆర్‌డీఏ నుంచి ఆదేశాలు వచ్చాయి. జిల్లా అధికారులు ఈ డీపీ యాక్ట్ తయారు చేసిన తర్వాత స్టేట్ టెక్నికల్ ఏజెన్సీ(ఎస్టీఏ)కు పంపిస్తారు. అక్కడి నుంచి ఎన్‌ఆర్‌ఆర్‌డీబీ ఆ ప్రొసీజర్ పూర్తిగా నిబంధనల మేరకు జరిగిందా అని పరిశీలన చేసి క్లియరెన్స్ ఇస్తుంది. ఎంపవర్ కమిటీలో దీనికి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఎన్‌ఆర్‌ఆర్‌డీబీ నుంచి అప్రూవల్ రాగానే ఈ పనుల టెండర్లు, అగ్రిమెంట్ చేస్తారు. ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన కింద ఆవాసాల్లో రోడ్ల నిర్మాణం కోసం గతంలో కేంద్ర ప్రభుత్వం 90శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు భరించేవి. ఇప్పటివరకు పది విడతల్లో ఇదే నిష్పత్తిలో రోడ్ల కోసం నిధుల మంజూరు, పనుల నిర్మాణం కొన్ని పనులు పురోగతిలో ఉండగా, ఎక్కువశాతం పూర్తయ్యాయి. 11వ విడత నుంచి కేంద్ర ప్రభుత్వం తన వాటాను తగ్గించుకుంది. పీఎంజీఎస్‌వై కింద 60శాతం నిధులను మాత్రమే కేంద్రం భరిస్తుండగా, రాష్ట్రం వాటాను 40 శాతానికి పెంచింది. 2009–10లో దేశంలో ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ కింద 60 వెనుకబడిన జిల్లాల్లో రోడ్ల అభివృద్ధి చేపట్టాలని కేంద్రం గుర్తించిన జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉంది
No comments:
Post a Comment