Breaking News

23/08/2019

జీవోలు ను పట్టించుకోని అధికారులు

రంగారెడ్డి, ఆగస్టు 23, (way2newstv.in - Swamy Naidu )
అక్రమ లే ఔట్లతో రియల్టర్లు మోసాలకు పాల్పడుతున్నారు. జీఓ 111 అమల్లో ఉన్న గ్రామాల్లో అక్రమ లే ఔట్ల ద్వారా విక్రయించే ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయవద్దని సబ్ రిజిస్ట్రార్లకు లేఖలు రాసిన వారు స్పందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ వద్ద ఏయే సర్వే నెంబర్లను రిజిస్ట్రేషన్ చేయవద్దు, ఎక్కడ ప్రభుత్వ భూమి ఉందన్న తదితర వివరాలపై స్పష్టత ఉన్నా వారు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జీఓ 111 పరిధిలో 84 గ్రామాలు ఉండగా, గండిపేట మండలంలో ఉన్న వట్టినాగులపల్లి, ఖానాపూర్, శంకర్‌పల్లి, శంషాబాద్ గ్రామాలు కొత్త మున్నిపాలిటీలుగా ఏర్పడక ముందు గ్రామ పంచాయతీ పాలనలో ఉన్నాయి.కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు కావడంతో ఈ నాలుగు గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం అయ్యాయి. నార్సింగ్ పేరుతో కొత్త మున్సిపాలిటీని ఏర్పాటు చేయడంతో వట్టినాగులపల్లి, ఖానాపూర్ గ్రామాలను అందులో విలీనం చేశారు. 
 జీవోలు ను పట్టించుకోని అధికారులు
శంకర్‌పల్లి గ్రామం ప్రస్తుతం శంకర్‌పల్లి మున్సిపాలిటీలో, శంషాబాద్ గ్రామాన్ని శంషాబాద్ మున్సిపాలిటీలో విలీనం కావడంతో కొన్నిచోట్ల పాత తేదీలతో అనుమతి ఉన్నట్టుగా పత్రాలను సృష్టించి అక్రమ లే ఔట్లను చేసినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.బహుళ అంతస్తులను నిర్మించకూడదు.ప్రస్తుతం సర్పంచ్‌ల పాలన సమయం అయిపోవడంతో ప్రస్తుతం ఇక్కడ మున్సిపల్ కమిషనర్‌ల పాలన కొనసాగుతోంది. అయితే ఈ నాలుగు గ్రామాల పరిధిలో జీఓ 111 ప్రకారం బహుళ అంతస్తులను నిర్మించకూడదు. లే ఔట్‌లను చేయకూడదు. పరిశ్రమలను ఏర్పాటు చేయరాదు. కానీ అధికారుల నిర్లక్షంతో పాటు గతంలో ప్రజా ప్రతినిధులుగా పనిచేసిన వారు ఇక్కడ అక్రమాలకు తెరతీస్తున్నారు. జీఓ 111 పరిధి కింద ఉన్న నాలుగు గ్రామాలు ప్రస్తుతం మున్సిపాలిటీల్లో విలీనం అయ్యాయి. ఈ నేపథ్యంలో చాలా చోట్ల అక్రమ లే ఔట్లకు రియల్టర్లు తెరతీశారు. దీనికి స్టాంపులు, రిజిస్ట్రేషన్‌కు చెందిన సబ్ రిజిస్ట్రార్లు వంత పాడడంతో ఈ దందా మూడుపువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోందన్న ఆరోప ణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ జీఓ పరిధిలో ఉన్న గ్రామాలు ప్రస్తుతం భూముల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో అక్రమ లే ఔట్లను చేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.అయితే కొన్నిచోట్ల సర్పంచ్‌లు మృతిచెందినా వారి సంతకాన్ని పోర్జరీ చేసి గ్రామ పంచాయతీల అనుమతి తీసుకున్నట్టు రియలర్లు తప్పుడు పత్రాలు సృష్టించి వెంచర్లు చేసి అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయానికి సైతం గండిపడుతుండడంతో అధికారులు వాటిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే ఈ విషయమై పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. చాలా వెంచర్లకు హెచ్‌ఎండిఏ అనుమతి ఇవ్వకుండానే అనుమతి ఉన్నట్టుగా కొనుగోలు దారులను ఆకర్శించడానికి రియల్టర్లు మోసాలకు పాల్పడుతున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి చెందిన వారితో పాటు ఐటి ఉద్యోగులు ఇక్కడ ప్లాట్లను కొనుగోలు చేసి అందులో నిర్మాణాలను చేపడుతున్నారని, ఇలా అనుమతులు లేకుండా కొన్న వారికి కూడా అధికారులు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలిసింది.జంట జలాశయాల పరిరక్షణ నిమిత్తం మొదటగా జీఓ 50ను అమల్లోకి తెచ్చారు. ఆ జీఓ పరిధిలో సుమారు 300 గ్రామాలు ఉండేవి. అప్పటి ప్రభుత్వం దానిపై సమీక్షించి 1989 సంవత్సరంలో 184 జీఓను అమల్లోకి తీసుకొచ్చింది. పాత జీఓలో ఉన్న కొన్ని నిబంధనలను సడలించి ఈ కొత్త జీఓను అప్పటి ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. 1994 సంవత్సరంలో 184 జీఓపై మరోసారి పునరాలోచించాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి 300 గ్రామాల ప్రజలు, నాయకులు విజ్ఞప్తి చేశారు. అప్పటి సిఎం దీనిపై ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.1996 సంవత్సరంలో ఈ కమిటీ మధ్యంతర నివేదిక సమర్పించింది. చెరువు కిందిభాగం 1 కి.మీల పరిధి ఉంచి మిగతా భాగం వలన ఎలాంటి ఇబ్బందులు లేవని, పైభాగం మాత్రం 10 కి.మీలు ఉండాలని ఆ కమిటీ అప్పట్లో ప్రభుత్వానికి సూచించింది. ఈ కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికతో ఏకీభవించిన అప్పటి ప్రభుత్వం 184 జీఓను రద్దు చేస్తూ 1996 మార్చిలో 111 జీఓను అమల్లోకి తీసుకురావడంతో పాటు 300లుగా ఉన్న గ్రామాలను 84 గ్రామాలుగా కుదిస్తూ కొత్త జీఓను అమల్లోకి తీసుకొచ్చింది.

No comments:

Post a Comment