Breaking News

10/08/2019

జెండా పండుగ తర్వాత కేబినెట్ విస్తరణ

హైద్రాబాద్, ఆగస్టు 10 (way2newstv.in - Swamy Naidu)
తెలంగాణ మంత్రివర్గాన్ని విస్తరించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాజా విస్తరణలో నలుగురు సీనియర్‌ నేతలకు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఈ విస్తరణలో హరీశ్ రావు, కేటీఆర్‌కు చోటుదక్కే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే ఆగస్టు మొదటి వారంలోనే క్యాబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేసీఆర్ సెంటిమెంట్ ప్రకారం.. ఆగస్టు16న మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. తెలంగాణలో గత డిసెంబర్‌లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత రెండోసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన కేసీఆర్.. పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. మహమూద్ అలీకి హోంమంత్రిత్వ శాఖ ఇచ్చి రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేశారు. దీంతో పాటు పార్టీ సీనియర్ నేతలను పక్కన పెట్టడం చర్చనీయాంశమైంది. 

 జెండా పండుగ తర్వాత కేబినెట్ విస్తరణ
ఉద్యమ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావును కేసీఆర్ తన క్యాబినెట్‌లోకి తీసుకోకపోవడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. హరీశ్‌తో పాటు కేటీఆర్‌కు చోటు కల్పించకపోవడం విస్మయానికి గురిచేసింది. ఇదే సమయంలో కేటీఆర్‌ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించడం విమర్శలకు తావిచ్చింది. మంత్రి పదవి దక్కకపోవడంతో హరీశ్ రావుకు అలిగారని.. ఇతర పార్టీల వైపు చూస్తున్నారని పత్రికల్లో అప్పట్లో వార్తా కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే.. హరీశ్ వాటన్నింటినీ ఖండించారు. పార్టీలో సైనికుడిగా పనిచేయడానికి సిద్ధమని ప్రకటించారు. తాజాగా ఆయణ్ని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారనే వార్తలతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు కూడా మంత్రివర్గంలో చోటుదక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ కేబినెట్‌లో మహిళలకు స్థానం ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా మంత్రి పదవి ఇస్తారనే హామీ మేరకే కాంగ్రెస్ నుంచి సబిత.. టీఆర్‌ఎస్‌ పార్టీలోకి మారినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే జరిగితే తెలంగాణలో తొలి మహిళా మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి గుర్తింపు తెచ్చుకోనున్నారు. తెలంగాణ కేబినెట్‌లో ప్రస్తుతం ముఖ్యమంత్రితో పాటు 12 మంది మంత్రులున్నారు. పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరిస్తే మరో ఆరుగురిని తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతానికి నలుగురికే అవకాశం ఇవ్వాలని సీఎం భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ సహా, మునిసిపాలిటీ ఎన్నికల తర్వాత మరో ఇద్దరికీ అవకాశం కల్పించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ జిల్లాలో ఖమ్మం మినహా అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ దఫా తనకు మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌ భావిస్తున్నారు.పార్టీ అంతర్గత కలహాల కారణంగా తుమ్మల ఓడిపోయారని భావిస్తున్న కేసీఆర్‌.. చివరకు ఆయన వైపే మొగ్గు చూపుతున్నారని సమాచారం. అంతేకాకుండా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావుకు టిక్కెట్‌ కేటాయించినప్పుడే తుమ్మలకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని సీఎం హమీ ఇచ్చినట్లు సమాచారం. 

No comments:

Post a Comment