Breaking News

10/08/2019

జేడీ, పవన్ మధ్య పెరిగిన దూరం...

హైద్రాబాద్, ఆగస్టు 10 (way2newstv.in - Swamy Naidu)
జనసేనలోకి జేడీ అనగానే హైఓల్టేజీ పవర్‌కు, మరింత హైఓల్టేజీ జత అయ్యిందని అందరూ అనుకున్నారు. పవన్‌ అంత మాస్ ఇమేజ్ లేకపోయినా, పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా జేడీ లక్ష్మీనారాయణకూ ఎంతోకొంత పాపులారిటీ ఉంది. అందుకే ఇద్దరూ కలిస్తే, విశాఖ తీరంలో జనసేన కెరటాలు ఎగసిపడతాయని అనుకున్నారు. ఎంపీగా ఓడిపోయినా, భారీ ఓట్లతో ఓటర్ల హృదయాలను గెలుచుకున్న లీడర్‌గా జేడీకి పేరొచ్చింది. మరో ఐదేళ్ల కొరకు పునాదులు వేసుకోవాల్సిన ఈ జనసేన జోడీలో, అప్పుడే లుకలుకలు పెరిగిపోయాయన్న వార్తలే, షాకింగ్‌లా అనిపిస్తున్నాయి. అవును.
జేడీ, పవన్ మధ్య పెరిగిన దూరం...
జనసేనలో జేడీ ఒంటరి అవుతున్నారో, లేదంటే పార్టీనే ఒంటరి చేస్తుందో తెలీదు కానీ, మొత్తానికి జనసేనలో జేడీ హడావుడి కనిపించడం లేదు. అయితే జోడీ చెడటం వెనక, అసలైన కథ వేరే ఉందన్న మాటే, అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఏంటది? జనసేనలో మాజీ జేడీ ఉలుకులేదు పలుకులేదు ఎందుకు? జేడీ ఒంటరి అయ్యారా? లేదంటే జేడీని ఒంటరి చేశారా? మొన్నటిదాకా యాక్టివ్‌గా ఉన్న జేడీ ఇప్పుడెందుకు డీయాక్టివ్‌ అయ్యారు? పార్టీ కార్యకలాపాలకు అనూహ్యంగా దూరంగా ఉండటం వెనుక పెద్ద కథే ఉందా? జేడీ ఫౌండేషన్‌ చుట్టే వివాదం ఎందుకు తిరుగుతోంది? సీబీఐ మాజీ జేడీ, జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ గురించి, ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి. విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి, ఓటమిపాలైన తర్వాత కూడా పలు కీలక జనసేన సమావేశాలకు హాజరయ్యారు జేడీ లక్ష్మీనారాయణ. అంతేకాకుండా విశాఖ నియోజకవర్గంలో చాలా వరకు పార్టీ తరఫున పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు. కానీ నిన్న మొన్నటి వరకు పార్టీలో ఒక కీలక నేతగా ఉన్న జేడీ లక్ష్మీనారాయణ, ఇపుడు మౌనం వహిస్తుండటం, అనేక ప్రచారాలకు తావిస్తోంది. జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తర్వాత, జేడీ లక్ష్మీనారాయణ పలు కార్యక్రమాలు విశాఖలో నిర్వహించారు. అయితే ఆ కార్యక్రమాలకు పార్టీ జెండా లేకుండా ఆయన వ్యక్తిగతంగా చేసుకుంటూ వెళ్లడమే, ఆయనను పార్టీ దూరంగా పెట్టడానికి కారణమని పార్టీలో జోరుగా చర్చ వినిపిస్తోంది. మొదటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు జేడీ. అయితే జనసేన కమిటీల్లో తనకు స్థానం లేకపోవడంతో ఆయన అలిగి, దూరం పాటించారన్న చర్చ కూడా నడిచింది. కానీ కమిటీల్లో స్థానం లేకపోవడానికి జేడీ నడవడిక ఒక కారణంగా పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా జేడీ ఫౌండేషన్ కోసం జనసేన కార్యకర్తలను సైతం, జేడీ లక్ష్మీనారాయణ వాడుకున్నారు అంటూ పార్టీలో చర్చ సాగుతోంది. పార్టీ కార్యక్రమాలకు జన సైనికులును ఉపయోగించుకోవాల్సిన జేడీ, లక్ష్మీనారాయణ జేడీఫౌండేషన్ కోసం వినియోగించడంపై, పార్టీలోని కొంతమంది కీలక నేతలు, అధినేత పవన్‌ కల్యాణ్‌ చెవిలో వేశారట. అందుకే జేడీ విషయంలో పవన్ కళ్యాణ్ సైతం మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో చేరినప్పటి నుంచి జేడీకి కీలక స్థానం ఉంటుందని పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు ప్రకటించారు. అయితే జేడీ ఫౌండేషన్ కోసం జనసేన పార్టీని, జేడీ వాడుకుంటున్నారని పవన్ కాస్త ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. అంతేకాకుండా జనసేనలో ఉంటూ కూడా ఇతర పార్టీ నేతలతో జేడీ లక్ష్మీనారాయణ ఎక్కువగా టచ్లో ఉన్నారని కూడా పవన్ దృష్టికి వచ్చినట్టుగా సమాచారం. ఈ రెండు అంశాలే జేడీని పవన్‌కి దూరం చేశాయన్న మాటలు వినిపిస్తున్నాయి. జేడీ లక్ష్మీనారాయణ వ్యక్తిగత స్వలాభం కొరకు పనిచేస్తున్నారంటూ పార్టీలోని కొంతమంది కీలక నేతలు బాహాటంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అయితే పార్టీలోని కొందరి ప్రవర్తన మూలంగానే జేడీ లక్ష్మీనారాయణ పార్టీకి దూరంగా ఉంటున్నారని చర్చ కూడా సాగుతోంది. పవన్‌ని కలవాలంటే ఒక కార్యకర్తలా బయట నిలబడాల్సి వస్తోందని, అందుకే పవన్‌ని కలవటం లేదని సన్నిహితుల దగ్గర జేడీ చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఒక వరలో రెండు కత్తులు ఇమడవన్న చందంగా, పవన్‌, జేడీల పరిస్థితి ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పవర్‌‌ఫుల్‌ ఆఫీసర్‌గా జనంలో, యూత్‌లో జేడీకి ఫాలోయింగ్ ఉంది. అటు పవర్‌స్టార్‌గా, హైఓల్టేజ్‌ పొలిటికల్ లీడర్‌గా పవన్‌ కల్యాణ్‌కు కోట్లాదిమంది అభిమానులున్నారు. ఈగో ఫ్యాక్టర్స్ కూడా, వీరిద్దరి మధ్య పొరపచ్చాలకు కారణమవుతున్నాయన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి సమాజానికి ఏదో చేయాలని తపిస్తూ, రాజకీయాల్లోకి వచ్చి, ఒకే పార్టీలో ఉన్న పవన్‌, జేడీల జోడి, అలాగే ఉంటుందో, లేదంటే ఎవరిదారి వారిదే అన్నట్టుగా సాగుతుందో కాలమే సమాధానం చెప్పాలి.

No comments:

Post a Comment