విజయవాడ, ఆగస్టు 22, (way2newstv.com)
టీడీపీ ఆవిర్భవించిన తర్వాత, ముఖ్యంగా చంద్రబాబు చేతికి పార్టీ పగ్గాలు దఖలు పడిన తర్వాత.. ఆ పార్టీ ఎదుర్కొన్న మూడో ఓటమి తాజాగా జగన్ సునామీతో సంభవించిన విషయం తెలిసిందే. గతంలో తొమ్మిదిన్నరేళ్ల వరుస పాలన అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర సృష్టించిన ప్రభంజనంతో చంద్రబాబు తొలిసారి ఓటమి అనేది రుచి చూశారు. 2004 ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. అదే సమయంలో వైఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కూడా ప్రారంభించారు. దీంతో పార్టీలో చాలా మంది నాయకులు వైఎస్ చెంతకు చేరిపోయారు. అయినా చంద్రబాబు ఎక్కడా జంకలేదు.ఇక, 2009 ఎన్నికలకు వచ్చే సరికి వైఎస్ లోటుపాట్లు ప్రజల ముందు చెప్పి ఎలాగైనా వైఎస్‌ను ఓడించాలని బాబు కంకణం కట్టుకున్నారు.
టీడీపీ నావకు దారేది
ఇక, అప్పటికే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ రంగంలోకి వచ్చింది. ఇక, మిగిలిన టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ వంటి వి కూడా పోటీలో ఉన్నాయి. ఇక, బాబు విషయానికి వస్తే..ఒంటరిగా వైఎస్‌ను ఎదుర్కొనే పరిస్థితి కనిపించలేదు. ఇంతలోనే కళా వెంకట్రావు, పెద్దిరెడ్డి, దేవేందర్‌గౌడ్, గంటా శ్రీనివాసరావు వంటి సీనియర్లు ప్రజారాజ్యం పార్టీలోకి చేరిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన మహాకూటమిగా ఏర్పడి.. చిన్నపార్టీలను చెంతన పెట్టుకుని వైఎస్‌పై యుద్ధానికి సిద్ధమయ్యారు. అయినా కూడా పార్టీ విజయం సాధించలేదు.దీంతో టీడీపీ తీవ్రస్థాయిలో నష్టపోయిన పరిస్థితి ఏర్పడింది. మరోపక్క, తెలంగాణ ఉద్యమం భారీ ఎత్తున సాగడంతో కడియం శ్రీహరి, నాగం జనార్దన్‌రెడ్డి వంటి కీలక నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఇలా పరిస్థితి దిగజారినా.. మరోపక్క, ప్రత్యేక తెలంగాణ విషయం చాపకింద నీరులా ప్రవహించినా.. చంద్రబాబు పెద్దగా లెక్క చేయలేదు. వస్తున్నా మీకోసం! అంటూ ఆయన యాత్ర చేపట్టారు. నిజానికి యాత్ర చేపట్టే నాటికి ఆయన చెంతన్న ఉన్న నాయకులు కేవలం రెండు పదుల్లోనే ఉన్నారు. ఇంతలోనే రాష్ట్రం విడిపోవడం, ఏపీకి ఆయన తొలి సీఎం కావడం తెలిసిందే.ఆయన చుట్టూ భారీ ఎత్తున నాయకులు చేరిపోయారు. ఇక, పాదయాత్ర సమయంలో తనకు సహకరించిన వారికి.. పదవులు ఇచ్చి ప్రోత్సహించారు. ఇలాంటి వారిలోనే సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి కీలక నాయకలు ఉన్నారు. కట్ చేస్తే.. ఇప్పుడు జగన్ సునామీ ముందు చంద్రబాబు మరోసారి ఓటమిపాలయ్యారు. అయితే, ఇది గత రెండు ఓటముల మాదిరిగా లేదని అంటున్నారు తమ్ముళ్లు. వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు వయసు 70 ప్లస్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికీ పార్టీని నడిపించే వారు కీలకంగా లేక పోవడంతో ఎవరికి వారు పార్టీలో ఉండి సాధించేది ఏమీలేదని భావిస్తున్నారు.ముఖ్యంగా ఇప్పటికే కేసుల్లో ఉన్నవారు.. ఫ్యాక్షనిస్టులుగా ముద్రపడిన నాయకులు జగన్ దెబ్బతో.. అల్లాడి పోతున్నారు. వీరంతా.. తమను తాము రక్షించుకునేందుకు టీడీపీలోనే ఉంటే సరిపోదని భావిస్తున్నారు. ఏపీలో టీడీపీని లెక్క చేసే పరిస్థితి పూర్తిగా పోయింది. అధికారులు ఎవరూ కూడా టీడీపీ నాయకులను లెక్కచేసే పరిస్థితి కనిపించడం లేదు. పోనీ.. చంద్రబాబు పోరాడే పరిస్థితి ఉందా? అంటే ఆయనను ఆయనే కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. మరోపక్క, వచ్చే ఎన్నికల నాటికి కూడా పార్టీ పుంజుకునే అవకాశం కనిపించడం లేదు. ఒకవైపు జగన్, మరో వైపు బీజేపీ కూడా టీడీపీని దెబ్బేసేందుకు రెడీ అయ్యాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు బై చెబుతున్నవారు భారీ సంఖ్యలో కనిపిస్తున్నారు. మొత్తానికి ఈ పరిణామం.. ఎటు దారితీస్తుందో చూడాలి.
No comments:
Post a Comment