Breaking News

22/08/2019

మళ్లీ తెరపైకి గుర్ఖాల్యాండ్ ఉద్యమం

బెంగాల్, ఆగస్టు 22, (way2newstv.in)
జమ్మూకాశ్మీర్ లోని లడఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడంతో ఇతర ప్రాంతాల్లో కూడా ఆశలు రేకెత్తిస్తున్నాయి. తమ ప్రాంతాలను సయితం కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న డిమాండ్ కు రెక్కలు వస్తున్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో గూర్ఖాల్యాండ్ ఒకటి. పశ్చిమ బెంగాల్ లోని ఈ ప్రాంతం దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతోంది. ఉద్యమాల ద్వారా తమ డిమాండ్ ను సాధించుకునేందుకు ఇక్కడి నాయకులు పోరాడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 
మళ్లీ తెరపైకి గుర్ఖాల్యాండ్  ఉద్యమం

ఈ ప్రక్రియలో వారు పాక్షికంగా విజయవంతమయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేకపోయినప్పటికీ స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రాంతంగా గూర్ఖాల్యాండ్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించక తప్పలేదు. తాజాగా లడఖ్ ప్రకటన నేపథ్యంలో గూర్ఖాల్యాండ్ నేతలు మళ్లీ తమ డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం కానప్పటికీ కనీసం కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతున్నారు. తమ కన్నా ఎంతో చిన్నదైన లకఖ్ ను యూటీగా ప్రకటించారని వారు గుర్తు చేస్తున్నారు. 8.78 లక్షల జనాభా, 1275. 67 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల గూర్ఖాల్యాండ్ యూటీగా ప్రకటించడానికి అన్ని విధాలా అర్హమైందని గోర్ఖా జన ముక్తి మోర్చా ప్రధాన కార్యదర్శి రోషన్ గిరి పేర్కొంటున్నారు.డార్జిలింగ్ కేంద్రంగా గల గూర్ఖాల్యాండ్ లో డార్జిలింగ్, కుర్సియాంగ్, మరిక్, సిలిగురి, కలింపోగ్ సబ్ డివిజన్లున్నాయి. ప్రస్తుతం గూర్ఖా టెర్రిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ (జీటీఏ) పేరుతో పాలన నడుస్తోంది. ఇది స్వతంత్ర ప్రతిపత్తిగల ప్రాంతం. దీనికి పరిపాలన, కార్యనిర్వాహక, ఆర్థిక అధికారాలుంటాయి. శాసనాధికారాలు మాత్రం ఉండవు. నేపాల్ సరిహద్దుల్లో ఉండే గూర్ఖాల్యాండ్ ప్రాంతంలో ప్రజలు నేపాలి భాష మాట్లాడతారు. ఇక్కడ గోర్ఖా, వారిఅనుబంధ తెగల ప్రజలదే పైచేయి. తమ ప్రాంతాన్ని చట్టసభలతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఇక్కడి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడంతో పాటు రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ను అమలు చేయాలని కోరుతున్నారు. దీనివల్ల కొన్ని ప్రత్యేక అధికారాలు సమకూరుతాయి. బీజేపీ నాయకుడు, స్థానిక ఎంపీ రాజు బిస్తా కేంద్రం తమ గోడు ఆలకిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. గోర్ఖా ప్రజల సమస్యలకు మోదీ సర్కార్ 2024 నాటికి శాశ్వత పరిష్కారం చూపుతుందని చెబుతున్నారు. అయితే రాష్ట్రాన్ని పాలిస్తున్న మమత బెనర్జీ సర్కార్ రాష్ట్ర విభజనకు ససేమిరా అంటోంది. కేంద్రం తమ రాష్ట్రం జోలికి వస్తే సహించమని రాష్ట్ర మంత్రి గౌతమ్ దేవ్ హెచ్చరించారు. గతంలోని సీపీఎం సర్కార్ కూడా ప్రత్యేక గూర్ఖాల్యాండ్ రాష్ట్రానికి పూర్తి వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఇది కేంద్రం కుట్రగా సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్ లు ఆరోపించడం గమనార్హం. రాష్ట్రాన్ని చీల్చి తమను బలహీనపర్చాలన్నది కేంద్రం వ్యూహమని అవి ఆరోపిస్తున్నాయి. నాటి కాంగ్రెస్, నేటి బీజేపీ ప్రభుత్వానికి ఈ విషయంలో ఒకే వైఖరి అని చెబుతున్నాయి.గూర్ఖాల్యాండ్ ఉద్యమం ఈ నాటిది కాదు. దీనికి మూడున్నర దశాబ్దాల చరిత్ర ఉంది. తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని 1986లో ప్రజలు ఉద్యమించారు. గోర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ నాయకుడు సుభాష్ ఘీసింగ్ నేతృత్వంలో తీవ్ర ఉద్యమం జరిగింది. రాస్తారోకోలు, బంద్ లు, విధ్వంసాలతో డార్జిలింగ్ ప్రాంతం అట్టుడికింది. జ్యోతిబసు సారథ్యంలోని అప్పటి రాష్ట్ర సీపీఎం సర్కార్ ఉద్యమంపై ఉక్కుపాదం మోపింది. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్రంలోని అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం మాత్రం ఒకింత సానుకూలంగా ఉంది. సుదీర్ఘ చర్చల అనంతరం 1980లోో స్వంతంత్ర ప్రతిపత్తిగల డార్జిలింగ్ గోర్ఖా హిల్ కౌన్సిల్ ను ఏర్పాటు చేశారు. దానికి పరిమిత అధికారాలు క్పలించారు. దీనికి గోర్ఖా ఉద్యమ నాయకుడు సుభాష్ ఘీసింగ్ సారథిగా వ్యవహరించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ఘీసింగ్ విఫలం కావడంతో మరో ఉద్యమం నడుస్తుంది. బిమల్ గురుంగ్ సారథ్యంలోని గోర్ఖా జనముక్తి మోర్చా (జేఎంఎం) ప్రారంభమయింది. దీంతో గోర్ఖా టెర్రిటోరియల్ అధారిటీని ఏర్పాటు చేస్తూ 2011 సెప్టెంబరు 2న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ బిల్లును ఆమోదించింది. సిలిగురిలో నాటి కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం, బెంగాల్ లో మమత బెనర్జీతో పాటు జేఎంఎం నాయకులు సంతకాలు చేశారు. జీటీఏ ఛైర్మన్ గా బినయ్ తమాంగ్ వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ ఈ ప్రాంత ప్రజల్లో ప్రత్యేక రాష్ట్రం లేదా యూటీ డిమాండ్ నేటికీ బలంగా ఉంది. పరిమిత అధికారాలతో ప్రయోజనం లేదని, పూర్తి స్థాయి యూటీ అయితేనే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. ఆ దిశగా ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు.

No comments:

Post a Comment