Breaking News

20/08/2019

అన్నదాత ఆక్రందన (పశ్చిమగోదావరి)

ఏలూరు, ఆగస్టు 20 (way2newstv.in): 
రైతులే దేశానికి వెన్నెముక అని పాలకులు తరచూ చెబుతుంటారు. కర్షకుల కష్టాలు మాత్రం పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. ప్రస్తుతం జిల్లా రైతులు కష్టాల కడలిని ఈదుతున్నారు. వర్షాల కారణంగా వరి నాట్లు దెబ్బతిన్నాయి.. మరోసారి నాట్లు వేయాలంటే చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి. పంట రుణం కోసం బ్యాంకులకు వెళ్తే పరపతి దక్కని దుస్థితి. దీంతో ఏం చేయాలో అర్థంకాక ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్న వారిలో 80 శాతం మంది కౌలు రైతులే. అన్నదాతలకు ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహాయం అందడం లేదు. 
అన్నదాత ఆక్రందన (పశ్చిమగోదావరి)

ఈ కారణంగా రానురాను అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రుణార్హత కార్డులు జారీ చేసినా.. వాటి ఆధారంగా రుణాలు ఇప్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. పంట రుణం కోసం బ్యాంకులకు వెళ్తున్న కౌలు రైతులకు బ్యాంకర్లు మొండిచేయి చూపిస్తున్నారు. రుణార్హత కార్డులోని సర్వే సంఖ్య ఉన్న పొలంపై అప్పటికే భూయజమానులు రుణం తీసుకొని ఉంటున్నారు. ఈ కారణంగా ఒకే పొలంపై రెండుసార్లు రుణాలు ఇవ్వడం కుదరదని బ్యాంకర్లు చెబుతున్నారు. గతంలో రుణం పొందిన కౌలురైతులు ప్రస్తుత ఖరీఫ్‌ సాగుకు రుణం కావాలని అడిగినా బ్యాంకర్లు వివిధ కారణాలు చెబుతూ దాటేస్తున్నారు. రైతులు కొత్తగా పెట్టుబడి పెట్టలేక ఇప్పటికే చేసిన అప్పు  తీర్చే మార్గం లేక సతమతమవుతున్నారు.అప్పు దొరక్క కౌలు రైతులు ఇబ్బంది పడుతుంటే రూ.వేల కోట్ల పంట రుణాలు ఇచ్చినట్లు బ్యాంకర్లు రికార్డుల్లో చూపుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఇప్పటికే లక్ష్యాన్ని మించి పంట రుణాలు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో చూస్తే దానికి పూర్తి భిన్నంగా ఉంది. అసలు సాగుచేసే కౌలు రైతులకు ఇచ్చిన పంట రుణం రూ.వందల కోట్లలోనే ఉంది. ఆ విషయాన్ని అధికారులే ధ్రువీకరిస్తున్నారు. రూ.లక్షలోపు బంగారం రుణాలను సైతం బ్యాంకర్లు వ్యవసాయ రుణాలుగా రికార్డుల్లో చూపిస్తున్నారు. దిగుబడి.. పెట్టుబడి ఆధారంగా ఎకరాకు ఏ పంటకు ఎంత రుణం ఇవ్వాలనే విషయాన్ని జిల్లా కేంద్రం సహకార బ్యాంకు నిర్ణయిస్తుంది. దాని ఆధారంగా ఒక ఎకరా వరి సాగుకు రూ.33 వేల వరకు రుణం ఇవ్వాలి. ఈ లెక్కన మూడెకరాల వరి సాగు చేస్తున్న రైతుకు రూ.99 వేల పంట రుణం ఇవ్వాలి. అయితే మూడెకరాలకు కలిపి రూ.30 వేలు మాత్రమే బ్యాంకర్లు ఇస్తున్నారు. ప్రతి బ్యాంకు శాఖ తమ వార్షిక టర్నోవర్‌లో 18 శాతం వ్యవసాయ అనుబంధ రుణాలు ఇవ్వాలి. అయితే అధికశాతం బ్యాంకులు ఈ నిబంధనను పాటించడం లేదు. జిల్లా అధికార యంత్రాంగం ఎన్ని ప్రయత్నాలు చేసినా బ్యాంకర్లు మాత్రం మొక్కుబడిగా రుణాలు ఇస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.

No comments:

Post a Comment