Breaking News

20/08/2019

అడవే కదా అని వదిలేస్తే...! (ఆదిలాబాద్)

ఆదిలాబాద్, ఆగస్టు 20  (way2newstv.in): 
రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల్లో అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నివేదిక వెల్లడించింది. రాష్టం మొత్తంలో మొదటి స్థానంలో ఉన్నా.. ఏటా 30 చదరపు కి.మీ. మేర అటవీ విస్తీర్ణం తగ్గిపోతుందని అధికారుల అంచనా. పచ్చదనాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం హరితహారం పథకం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తోంది. వర్షాలు కురవడంతో మొక్కలు నాటేందుకు ఇది అనుకూలమైన సమయం.. ప్రతి పల్లె, పాఠశాలలు, కార్యాలయాలు.. ఎవరికి వారు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగితే ఆదిలాబాద్‌ హరితబాద్‌గా మారుతుంది. జిల్లాలో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం హరితహారం పథకం అమలు చేస్తోంది. 2015లో ప్రారంభించిన ఈ పథకం కింద నాలుగు విడతల్లో 12 కోట్ల మొక్కలు నాటినట్లు అటవీ శాఖ చెబుతోంది.. ఈ ఏడాది మరో నాలుగు కోట్ల మొక్కలు నాటాలన్నది లక్ష్యం. 
అడవే కదా అని వదిలేస్తే...! (ఆదిలాబాద్)

ప్రభుత్వం రూ. లక్షలు ఖర్చు చేస్తున్నా.. ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఈ ఏడాది అన్ని శాఖలను భాగస్వామ్యం చేయడంతో పాటు పంచాయతీల్లో  మొక్కల సంరక్షణ బాధ్యతను ఆయా గ్రామ సర్పంచులు, కార్యదర్శులకు అప్పజెప్పారు. జిల్లా మొత్తంలో వర్షాలు కురవడంతో మొక్కలు నాటేందుకు అనుకూలం. తరువాత కురిసే వర్షాలకు మొక్కలు నాటుకునేందుకు వీలుంది. ఇప్పుడు నాటిన మొక్క ఏపుగా ఎదిగేందుకు భూమిలో పదును ఉంటుంది. భూమి మెత్తగా ఉండి, తల్లి వేరు భూమి లోపలికి బాగా చొచ్చుకుపోయి పిల్లవేరు వ్యాప్తి చెందుతాయి. మొక్కలు నాటే సమయంలో తల్లి వేరు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పచ్చదనం పెంపునకు రూ. లక్షలు ఖర్చు చేస్తున్నా, మొక్కల నాటడంలో శ్రద్ధ పెట్టకపోవడంతో ఈ ఏడాది ప్రభుత్వం మొక్కల సంరక్షణ బాధ్యత సర్పంచులు, కార్యదర్శులపై ఉంచింది. గుంతలు తవ్వడం మొదలు, వాటిని సంరక్షించుకునే వరకు ఉపాధిహామీ పథకం నుంచి ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది. ఒక్కో పంచాయతీకి 20 వేల మొక్కలు నాటాలని లక్ష్యం ఉంది. మొక్కలు నాటేందుకు, వాటిని సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలి. పచ్చదనం పెంపునకు ప్రతి పల్లె కదలాలి.. ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలి. ఇళ్లలో, రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలి. వాటిని సంరక్షించుకోవాలి. మొక్కల పెంపకంలో పాఠశాలలు స్పందించాలి. విద్యార్థులకు చిన్నతనం నుంచి పర్యావరణ ప్రాధాన్యం తెలియజేయడం వల్ల భవిష్యత్తులో వారు అందుకు తగ్గట్టుగా నడుచుకునే అవకాశముంది. ప్రభుత్వం ఉచితంగా మొక్కలు సరఫరా చేస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవసరమైన మొక్కలు తెప్పించుకొని విద్యార్థులతో నాటించాలి. ఒక్కో విద్యార్థికి రెండు, మూడు మొక్కలను దత్తత ఇచ్చి, వారి పేర్లు మొక్కల వద్ద ఉంచే ఏర్పాట్లు చేసి వాటి సంరక్షణ బాధ్యతను అప్పచెప్పాలి. ఉమ్మడి జిల్లా మొత్తంలో నాలుగు వేలకు పైగా పాఠశాలలు ఉన్నాయి. ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలలు కలిపి 20వేలకు పైగా ఉపాధ్యాయులు, అయిదు లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. వీరు పాఠశాలల్లో మొక్కలు నాటడమే గాకుండా, ఇళ్లల్లో కూడా నాటేలా చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయులు ఈ దిశగా ఆలోచిస్తే పాఠశాలల్లో పచ్చదనంతో పాటు, ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో బాధ్యత పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 1,12,077చ.కిమీ. ఇందులో 20,419చ.కిమీ అటవీ ప్రాంతం ఉంది. అడవుల వెలుపల పచ్చదనం 2,689 చ.కిమీలు మొత్తంగా రాష్ట్ర భూభాగంలో పచ్చదనం విస్తీర్ణం 23,108 చ.కిమీలు ఉన్నట్లు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నివేదిక తెలియజేస్తుంది. ఈ లెక్కన జాతీయ స్థాయి సగటు 24 శాతం కాగా, తెలంగాణ రాష్ట్రం 20.6 శాతం పచ్చదనం కలిగి ఉంది. అటవీ విస్తీర్ణంలో ఆదిలాబాద్‌ జిల్లా మొదటి స్థానంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

No comments:

Post a Comment