Breaking News

20/08/2019

ఆక్వాకు ఆదరణేదీ..? (కృష్ణా)

మచిలీపట్నం, ఆగస్టు 20 (way2newstv.in): 
రాష్ట్రానికి అత్యంత ఆదాయాన్ని సంపాదించి పెడుతున్న ఆక్వారంగం నిరాదరణకు గురవుతోంది. వ్యవసాయ అనుబంధ రంగంగా ఉన్నా కనీసం సేద్యంలా గుర్తించడం లేదు. ఆక్వారంగానికి జీవనాధారమైన నీటిని అందించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. ఏటా వర్షాకాలంలో పెద్దఎత్తున నీరు వస్తున్నా.. దాన్ని చెరువులకు మళ్లించే దిశగా చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఎన్నో రాయితీలు కల్పిస్తున్నా, మూలాధారమైన నీటిని అందించడంలో పూర్తిగా విఫలమవుతోంది. రాష్ట్రంలోనే కలిదిండి, కైకలూరు, నందివాడ, మండవల్లి మండలాలు ఆదాయాన్ని సమకూర్చడంలో వరుస క్రమంలో అగ్రస్థానంలో ఉన్నాయి. 
 ఆక్వాకు ఆదరణేదీ..? (కృష్ణా)

ఇందుకు ప్రధాన కారణం ఆక్వారంగమే. కృష్ణా డెల్టా ప్రాంతంలోని పశ్చిమ గోదావరి జిల్లాను అనుకొని ఉన్న కైకలూరు, గుడివాడ, బంటుమిల్లి, అవనిగడ్డ, నాగాయలంక నియోజకవర్గాల్లో నేటికీ వేల ఎకరాల్లో చేపల చెరువులు నీరు లేక ఖాళీగానే ఉన్నాయి. కృష్ణా జిల్లాలోనే 1.80 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆక్వారంగం విస్తరించి ఉంది. గడిచిన రెండేళ్లలో తీవ్ర ఎద్దడి వల్ల చేపల చెరువులకు నీరందలేదు. సుమారు 30 శాతం చెరువుల్లో పూర్తిగా, ఇంకో 30 శాతం చెరువుల్లో పాక్షికంగా నీరు లేదు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో వర్షాలు పడి బ్యారేజీలు నిండుతున్నా ఆక్వారంగానికి నీరందడం లేదు. కాలువలకు సామర్థ్యం లేకపోవడంతో నీరు వస్తున్నప్పుడు బ్యారేజీలు నిండుతున్నాయి కాని ఇక్కడ రైతుల చెరువులు మాత్రం నిండడం లేదు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిందిగా ఆక్వా రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు.ఆంధ్రప్రదేశ్‌ ఆక్వారంగం సాధిస్తున్న అద్భుతాలు ఇన్నీ అన్ని కావు.. లక్ష్యాల సాధనలో 125 శాతం.. వృద్ధిరేటులో 11 శాతం రికార్డులను నమోదు చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఇతర రాష్ట్రాలతో ఉన్న పోటీ కారణంగా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఇక్కడ ఉత్పత్తి అవుతున్న చేపలకు ప్రాంతీయంగా మార్కెట్లు లేవు. ఉన్నా అది కేవలం 5 శాతంలోపే. దీనివల్ల ఉత్పత్తిని మొత్తం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాల్సిందే. ఆంధ్రా నుంచి పశ్చిమ బంగా, ఒడిశా, మహారాష్ట్ర, బిహార్‌, దిల్లీ, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ,్‌ ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతవుతున్నాయి. ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమబంగా రాష్ట్రాలు సైతం చేపల పెంపకాన్ని చేపడుతున్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలతో పాటు నీటిని అందిస్తూ ప్రోత్సహిస్తున్నాయి. కాని ఆక్వాకు మూలంగా ఉన్న ఆంధ్రాలో మాత్రం నీటికోసం కోటి కష్టాలు అనే చందంగా తయారయ్యింది. దీనివల్ల అక్కడ తక్కువ ధరకు నాణ్యమైన పంటను పండిస్తూ మన రాష్ట్ర రైతుల ఆదాయాన్ని గండికొడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వరి రైతుల మాదిరిగానే ఆక్వా సాగుదార్లు కూడా గడ్డు కాలాన్ని ఎదుర్కొనే ప్రమాదముంది. జిల్లాలో వినియోగిస్తున్న మంచినీటి కాలువలన్నీ ఎప్పుడో బ్రిటీష్‌ కాలం నాటివి. అప్పట్లో వ్యవసాయానికి మాత్రమే వీటిని డిజైన్‌ చేసి తవ్వారు. వీటి సామర్థ్యం సైతం చాలా తక్కువగా ఉంది. వీటి ద్వారా కేవలం వరి సాగుకు మాత్రమే నీటిని అందించే వీలుంటుంది. ప్రస్తుతం విస్తారంగా విస్తరిస్తున్న చేపల చెరువులకు నీటిని అందించాలంటే ముందుగా కాలువలను మరింత పటిష్ఠ పరచాల్సిన అవసరముంది. జిల్లాలోని కాలువలు ప్రస్తుతం 600 క్యూసెక్కుల సామర్థ్యం కంటే తక్కువగా ఉన్నాయి. దీనివల్ల నీరు అందుబాటులో ఉన్నప్పుడు సైతం చెరువులకు మంచినీటిని అందించలేని పరిస్థితి తలెత్తుతోంది. దీన్ని నివారించాలంటే తప్పక కాలువల సామర్థ్యాన్ని పెంచాలి. నిర్మించినప్పటికీ, ఇప్పటికీ 100 శాతం నీటి వినియోగం పెరిగినా ఆ స్థాయిలో కాలువల సామర్థ్యం పెంచలేదు. మంచినీరు పుష్కలంగా లభించిన సమయాల్లో మంచినీటి కాలువలతో పాటు మురుగు కాలువలోనికి నీటిని విడుదల చేస్తే చేపల చెరువులకు ఆసరాగా ఉంటుంది. ప్రణాళిక బద్ధంగా కాలువలకు నీటిని సరఫరా చేస్తుండాలి. ఆక్వా రంగానికి ఆయువు పట్టయినా నీరు లేక జిల్లా లోని సాగుదారులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. గడిచిన మూడేళ్లుగా ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులతో ఆక్వారంగం కొంతమేరకు కుదేలయ్యింది. తీవ్ర వర్షభావ పరిస్థితులు, నీటి విడుదల లేకపోవడంతో డెల్టా ప్రాంతం తాగునీటికే కటకటలాడింది. ఆక్వారంగం పరిస్థితిని చెప్పనవసరం లేదు. చేపల సక్రమ పెరుగుదలకు మంచినీరు ఎంతో అవసరం. కనీసం ఏడాదికి ఒక్కసారయినా చేపల చెరువుల్లో నీటిని మార్చి కొత్త నీటిని తోడుకుంటేనే పెరుగుదల ఉంటుంది. చేపల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి రోగాలు, వైరస్‌ వంటివి సోకే ముప్పు తగ్గుతుంది. మూడేళ్ల నుంచి అదే నీటిలో చేపల పెంపకం వల్ల జిల్లా శివారులోని చాలా చెరువుల్లో ఉప్పుశాతం పెరిగి చేపల పెరుగుదల మందగించింది. కేవలం మందుల ద్వారానే చెరువుల్లో చేపలను రైతులు బతికించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కొల్లేరు పరీవాహక ప్రాంతంలో ఈ సమస్య తీవ్రతరమయ్యింది. వ్యవసాయ రైతులు అదృష్టం బాగుండి, రొయ్యల పెంపకానికి అనువైన పరిస్థితులు నెలకొనడం వల్ల కొంత మేరకు ఉపశమనం కలిగింది. లేకుంటే ఆక్వారంగం తీవ్ర నష్టాలను ఎదుర్కొనేది. ఈ ఏడాది వర్షాల రాక కాస్త ఆలస్యమైనా పెద్ద ఎత్తున కురిశాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లº పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నందున ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లºని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. పట్టిసీమ ప్రాజెక్టు నుంచి ఎంతో కొంత నీటిని తోడుకునే వీలుంటుందని వరి రైతులతో పాటు ఆక్వారైతులు సైతం నీటి విడుదలపై కోటి ఆశలు పెట్టుకున్నారు. మత్స్యశాఖ అధికారులు కూడా చేపల చెరువులకు మంచినీటిని అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ పరిస్థితులతో మత్స్యరంగానికి మంచి రోజులు వచ్చాయని రైతులు భావించారు. మంచినీటి లభ్యతతో గడిచిన రెండేల్లో వచ్చిన నష్టాలను భర్తీ చేసుకునేందుకు తహతహలాడారు. మొన్నటి వరకు తాగునీరు, సాగునీరు అంటూ చేపల చెరువులకు నీటిని తోడుకోనివ్వలేదు. ఇప్పుడు నీరు ఉన్నా.. తోడుకోనివ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న కాలువలకు, డ్రెయిన్లకు నీటిని పూర్తిస్థాయిలో సరఫరా చేస్తే చేపల చెరువులకు కొంతమేరకు ప్రయోజనం ఉంటుంది. భారీ ఎత్తున కొల్లేరులోకి నీటిని విడుదల చేయాల్సిన అవసరముంది. దీనివల్ల కొల్లేరులో పేరుకుపోయిన ఉప్పు శాతం తగ్గి స్థానికంగా ఉన్న రైతులకు, కొల్లేరులో ఉన్న కాస్తంత నల్లజాతి చేపలకు, పక్షులకు ఎంతో కొంత మేలు కలుగుతుంది.

No comments:

Post a Comment