ఖమ్మం, ఆగస్టు 19, (way2newstv.in)
సంక్షేమ విద్యార్థిని, విద్యార్థుల సౌకర్యం కోసం ప్రభుత్వం వసతి గృహాలను నెలకొల్పింది. వీటిపై పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో ఎవరి ఇష్టారాజ్యం వారిది అన్నట్లుగా ఉంటోంది.వసతి గృహాలలో నిర్వహణ పారదర్శకంగా కొనసాగేందుకు ప్రభుత్వం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. జిల్లాలో 50 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో మూడు నుంచి ఇంటర్ వరకు 5,580 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వసతి గృహాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. సీసీ కెమెరాల ఏర్పాటుతో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? లేదా అని పరిశీలన జరిపే అవకాశం ఉంది. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వాటికి ఇక చెక్ పడనుంది. వసతి గృహాల్లో విద్యార్థుల ప్రవర్తన నిరంతరం పర్యవేక్షించే అవకాశం ఏర్పడనుంది.
సంక్షేమ హాస్టల్స్ కు 3000 సీసీ కెమెరాలు
బయటి నుంచి ఎవరు వస్తున్నారు.. ఎవరు వెళుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతోందా? తెలుసుకోవడంతోపాటు విద్యార్థుల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించింది. వసతి గృహాల్లో పారదర్శకత పెంచడానికి.. అక్రమాలకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది.ఒక్కో వసతి గృహంలో ఆరు కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. వసతి గృహం ప్రాంగణం, పరిసరాల్లో ఏమి జరిగినా తెలుసుకునేందుకు వీలుగా ప్రధాన ద్వారం వద్ద, వరండాల్లో, వంట గదిలో, భవనానికి రెండు వైపుల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆయా కెమెరాలను వసతి గృహ సంక్షేమాధికారి గదిలోని కంప్యూటర్‌కు అనుసంధానం చేశారు. అనుమతి లేనివారు లోపలికి ప్రవేశించినా, అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎలా జరిగింది, ఏమి జరిగిందనేది పక్కగా తెలుసుకునేందుకు ఇవి దోహదపడతాయి. కొన్ని వసతి గృహాల్లో సరకులు సంబంధిత వార్డెన్లు, సిబ్బంది అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వాటికి ఇక చెక్ పడనుంది. వసతి గృహాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా జిల్లా అధికారులకు వెంటనే తెలిసే అవకాశం ఏర్పడింది. వసతి గృహా సంక్షేమాధికారి విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారా? లేదా తెలుసుకునే అవకాశం ఉంది. బాలికల వసతి గృహాల్లో భద్రత పెరగనుంది. అపరిచిత వ్యక్తులు వసతి గృహంలోకి ప్రవేశించినా, విద్యార్థులకు సమయానికి భోజనం అందిస్తున్నారా? అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. వసతి గృహాల్లో పారదర్శకత మరింత పెరగనుంది.
No comments:
Post a Comment