Breaking News

24/08/2019

వాటర్ మేనేజ్ మెంట్ ఇండెక్స్ లో నెంబర్ 2 ఆంధ్రా

న్యూఢిల్లీ, ఆగస్టు 24  (way2newstv.in - Swamy Naidu)
దేశంలోని జలవనరుల సంరక్షణ, తాగు, సాగునీరు సరఫరా విషయంలో రాష్ట్రాలు చేపట్టిన చర్యల ఆధారంగా నీతిఆయోగ్ గత మూడేళ్ల నుంచి ర్యాంకులను ప్రకటిస్తోంది. ఈ ఏడాది ర్యాంకులను ప్రకటించగా, వాటర్ మేనేజ్‌మెంట్ ఇండెక్స్‌లో 75 పాయింట్లతో వరుసగా మూడో ఏడాది గుజరాత్ తొలిస్థానంలో నిలవగా, 74 మార్కులతో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో నిలిచింది. తర్వాతిస్థానంలో 71 పాయింట్లతో మధ్యప్రదేశ్‌ మూడోస్థానంలో నిలిచాయి. 2018-19 నివేదికను శుక్రవారం కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, నీతిఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌, సీఈవో అమితాబ్‌కాంత్‌లు విడుదల చేశారు. భూగర్భజలాల రీఛార్జి ప్రాంతాల మ్యాపింగ్‌ను 100 శాతం పూర్తిచేయడంతోపాటు ఏపీలోని 15 లక్షల బోరుబావుల్ని పూర్తిగా జియోట్యాగ్‌ చేసి అందులోని జలమట్టాలను ఆన్‌లైన్‌ ద్వారా ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నట్లు తెలిపింది. సాగునీటి సామర్థ్య కల్పన, వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌ శతశాతం ఫలితాలను సాధించడం విశేషం. 
వాటర్ మేనేజ్ మెంట్ ఇండెక్స్ లో నెంబర్ 2 ఆంధ్రా
నీరు- చెట్టు కార్యక్రమం ద్వారా 7 వేల పంట కుంటలు, 22 వేల చెక్‌డ్యాంలను మరమ్మతు చేయడంతోపాటు కొత్తగా 102 ఎత్తిపోతల పథకాలను వినియోగంలోకి తీసుకొచ్చి 2.10 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. అలాగే భారీ, మధ్యతరహా సాగునీటి సరఫరాలోనూ ఆంధ్రప్రదేశ్‌ 80 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. వాననీటి సంరక్షణ కోసం అనంతపురం జిల్లాలో 51,825 కేంద్రాలను నిర్మించడంతో 15,783 హెక్టార్లకు అదనంగా సాగునీటి సౌకర్యం కలిగిందని, అలాగే 40 వేల మంది రైతులకు శిక్షణ ఇవ్వడం వల్ల ఈ జిల్లాలో 39,801 హెక్టార్లలో సూక్ష్మసేద్యం పెరిగిందని నివేదిక తెలిపింది. కడప జిల్లాలోని పాపాగ్ని నదిపై తక్కువ ఖర్చుతో ఆరుచోట్ల సబ్‌ సర్ఫేస్‌ డ్యామ్‌లు నిర్మించిన ప్రాజెక్టుకు 2018 నేషనల్‌ వాటర్‌ అవార్డు దక్కింది. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని గ్రామాలకూ పైపుల ద్వారా తాగు నీరు అందుతోందని నివేదిక పేర్కొంది. ఇదిలా ఉండగా, నీటి సంక్షోభం కారణంగా 2050 నాటికి దేశ జీడీపీ 6 శాతం తగ్గిపోతుందని నీతిఆయోగ్ హెచ్చరించింది. దేశంలో 2030 నాటికి నీటి కొరత భారీగా ఏర్పడుతుందని, సరఫరా కంటే డిమాండ్ రెండు రెట్లు మించిపోతుందని తెలిపింది. వార్షిక తలసరి నీటి లభ్యత 2050 నాటికి 1,140 క్యూబిక్ మీటర్లకు తగ్గిపోనుందని, ఇది అధికారిక నీటి కొరత పరిమితి 1,000 క్యూబిక్ మీటర్లకు దగ్గరగా ఉంటుందని వివరించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా ఉన్న టాప్ 10 రాష్ట్రాల్లోని ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, కేరళ, ఢిల్లీలు మాత్రం 20 నుంచి 47 పాయింట్లు సాధించడం గమనార్హం. నీటి సంరక్షణలో తక్కువ ప్రతిభచూపిన 16 రాష్ట్రాలు సమిష్టిగా జనాభాలో 48 శాతం, వ్యవసాయ ఉత్పత్తులలో 40 శాతం, ఆర్థిక ఉత్పత్తిలో 35 శాతం వాటాను కలిగిఉన్నాయి. అసోచోమ్ నివేదిక ప్రకారం.. 2030 నాటికి నీటి సరఫరాలో అంతరాన్ని తగ్గించాలంటే 20 ట్రిలియన్లు ఖర్చుచేయాల్సి ఉంటుంది. 

No comments:

Post a Comment