Breaking News

24/07/2019

వెలిగొండ సమస్యలకు దారేదీ...

ఒంగోలు, జూలై 24, (way2newstv.in)
వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి పదేళ్ళు గడచిన నేటికీ సమస్యలు పరిష్కారం కాక నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈప్రాజెక్టు కింద పెద్దారవీడు మండలంలోని గుండంచర్ల, కలనూతల, కె నాగులవరం, సుంకేశుల గ్రామాలు ముంపుకు గురైనప్పటికీ నష్టపరిహారం మంజూరులో నేటికీ అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. నిర్వాసితులకు ఆర్‌ఆర్‌ప్యాకేజీ నేటికీ ఇవ్వకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 2005లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు ప్రాజెక్టు నిర్మాణానికి  శంకుస్థాపన చేశారు. 
వెలిగొండ సమస్యలకు దారేదీ...

అయితే ఆనాటి నుంచి ఈనాటి వరకు నిర్వాసితులకు ఆర్‌ఆర్ ప్యాకేజీ కానీ, ఇళ్ళస్థలాల కేటాయింపు కానీ పూర్తికాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. వారి పిల్లలు కూడా మేజర్లు అయి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించక అగచాట్లు పడుతున్నారని నిర్వాసితులు వాపోతున్నారు. గుండంచర్ల గ్రామప్రజలకు నేటికీ ఇళ్లస్థలాలు కేటాయింపు చేయలేదు. కలనూతల, సుంకేశుల గ్రామస్థులకు ఇళ్లస్థలాలు కేటాయించారేకానీ, వౌలిక వసతులు పూర్తికాకపోవడంతో వారి అవస్థలు అంతా ఇంతా కాదు. ప్రభుత్వాలు మారినప్పటికీ సమస్యలు మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని నిర్వాసితులు వాపోతున్నారు. అనేక పర్యాయాలు మంత్రులను, అధికారులను కలిసినప్పటికీ ప్యాకేజీ నేటికీ ఖరారు కాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో వౌలిక వసతులులేక, రోడ్లు సక్రమంగాలేక ఇబ్బందులకు గురవుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో నివసించేందుకు వౌలిక వసతులతోపాటు రోడ్డుసౌకర్యం కూడా అధ్వాన్నంగా ఉన్నాయని అంటున్నారు. తాత్కాలిక పనులు చేపట్టాలని ప్రజాప్రతినిధులను, అధికారులను కోరినప్పటికీ స్పందించడం లేదని అంటున్నారు. మార్కాపురం నుంచి గుండంచర్ల వెళ్లేందుకు రోడ్డు ఏర్పాటు చేసినప్పటికీ ఆ రోడ్డు దెబ్బతిని గుంతలమయమై అవస్థలు పడుతున్నామని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు జోక్యం చేసుకొని తమ సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని కోరుతున్నారు.

No comments:

Post a Comment