Breaking News

24/07/2019

ఎండుతున్న వేరుశెనగ

కడప, జూలై 24, (way2newstv.in)
వేసవి ముగిసిన సమయానికి రైతుల్లో ఖరీఫ్ ఆశలు చిగురించాయి. తొలకరిజల్లులకు దుక్కులు దున్ని వేరుశనగ విత్తుతున్నారు. పెట్టుబడి కూడా అధిక మొత్తంలోనే పెట్టారు. చివరకు వాతావరణ ప్రభావంతో మొలకెత్తడం కష్టతరంగా మారింది. దీంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. సుండుపల్లె మండల పరిధిలోని రైతులు ఖరీఫ్ సీజన్‌లో వర్షాధార పంటగా వేరుశెనగను సాగు చేశారు. అంతేకాకుండా అంతరపంటగా కంది, అలసంద వంటి పంటలను కూడా సాగు చేశారు. అయితే గత ఏడాది కంటే ఈ సారి వేరుశెనగ విస్తీర్ణం బాగా తగ్గింది. 
ఎండుతున్న వేరుశెనగ

ఈసారి చినుకుజాడ కరువైంది. సరైన వర్షాలు లేక భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోవడంతో అన్నదాతలు ఖరీఫ్ సాగుపై మొగ్గుచూపలేదు. కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు సిద్దమైన అన్నదాతల ఆశలు ఆవిరైపోతున్నాయి. అరకొరగా సాగు చేసిన వేరుశెనగ పంటకు వర్షం లేక ఎండిపోతోంది. మరికొన్ని చోట్ల వేసిన విత్తనాలు మొలకెత్తక పోవడంతో వాటికి నీటి ఆదరువు ఉన్న రైతులు మరోసారి స్ప్రింక్లర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. ఇలాగే మరో వారం రోజులు అరకొర వర్షాలైనా పడకపోతే పూర్తి స్థాయిలో వేసిన వేరుశెనగ పంట నష్టపోవాల్సిన కష్టం వాటిల్లుతుందని రైతన్న ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మండలంలోని మాచిరెడ్డిగారిపల్లె, ముడుంపాడు, పెద్దినేనికాల్వ, తిమ్మసముద్రంతో పాటు మరికొన్ని గ్రామ పంచాయతీలలో వేరుశెనగ పంటలను సాగు చేశారు. వేసిన పంటలు చేతికి రావాలంటే సరైన వర్షాలు పడాలని రైతన్నలు కోరుకుంటున్నారు.

No comments:

Post a Comment