Breaking News

26/07/2019

నిమ్మకు నీరెత్తినట్లు ఇంటర్ బోర్డు వ్యవహారం

హైద్రాబాద్, జూలై 26, (way2newstv.in)
రాష్ట్రంలో జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపు ఏటా పరీక్షల ముందు వివాదాస్పదం కావడం, సౌకర్యాలు లేక అనుబంధ గుర్తింపు ఇవ్వలేదని ఇంటర్మీడియట్ బోర్డు వాదించడం, అన్నీ ఉన్నా గుర్తింపు ఇవ్వలేదని జూనియర్ కాలేజీల యాజమాన్యాలు ఆరోపించడం షరా మామూలుగా మారిపోయంది. పరీక్షల ముందు అనుబంధ గుర్తింపు అంశం వివాదాస్పదం అవుతోందని తెలిసినా బోర్డు తీరు మారకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు సైతం అదే కోవలో వ్యవహరిస్తున్నాయి. గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంటే సవాలక్ష నిబంధనలు పాటించాలని భావిస్తున్న చాలా కాలేజీలు ఆ ఊసు లేకుండానే గుట్టుచప్పుడు కాకుండా క్లాసులు నిర్వహిస్తున్నాయి. సంవత్సరం చివరిలో మరో కాలేజీ ద్వారా విద్యార్థులతో పరీక్షలు రాయిస్తాయి. 
నిమ్మకు నీరెత్తినట్లు ఇంటర్ బోర్డు వ్యవహారం

ఈ దందా ప్రైవేటు కార్పొరేట్ కాలేజీల్లో పబ్లిక్‌గా జరుగుతున్నా, లంచాలు మరిగిన జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌లో బహిరంగంగా ప్రకటనలు జారీ చేస్తూ వీధికి ఒకటి చొప్పున గుర్తింపు లేని కాలేజీలు నడుస్తున్నా జిల్లా విద్యాశాఖాధికారులు తమకేమీ పట్టనట్టు ఉదాసీనంగా వ్యవహరించడానికి కారణం యాజమాన్యాలు పెద్ద ఎత్తున అధికారుల చేతులు తడపడమేననే ఆరోపణలున్నాయి. ఇంటర్ బోర్డు అధికారులు ఎవరూ ఏనాడూ ఏ జూనియర్ కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేసిందీ లేదు, అక్కడ ఎవరు పనిచేస్తున్నారో, వారి రికార్డులు ఏమిటో, వారి విద్యార్హతలు ఏమిటో పరిశీలించిందీ లేదు. ఏ కాలేజీలో ఏ సబ్జెక్టుకు ఎవరు పనిచేస్తున్నారో, ఎంతకాలంగా పనిచేస్తున్నారో, వారికి జీతభత్యాలు ఎంత చెల్లిస్తున్నారో వంటి రికార్డులను ఎన్నడూ ఏ జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారీ పరిశీలించకపోవడం గమనార్హం. ఏ అధికారి ఎన్నడు ఏ కాలేజీలో తనిఖీ చేశారో ఆయా కాలేజీల్లో వీడియో ఫుటేజీలు ఇవ్వాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. కళ్లముందే లాంగ్‌టెర్మ్ పేరిట కాలేజీలు నడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పరీక్షల ముందు పది మందిని పంపండి అని కబురు చేస్తే కాలేజీలు తమకు నచ్చిన వ్యక్తులను పది మందిని పంపించి ప్రైవేటు కాలేజీలు చేతులు దులుపుకుంటున్నాయి. రోజూ క్లాసులు చెప్పే టీచర్లను కాదని, ల్యాబ్‌ల్లో పనిచేసేవారిని, లైబ్రరీల్లో పనిచేసేవారిని, ఆఫీసులో పనిచేసేవారిని పరీక్షల ఇన్విజిలేషన్‌కు, స్పాట్ వాల్యూయేషన్‌కు పంపుతున్నారు. దాంతో స్పాట్ వాల్యూయేషన్‌లోనూ అనేక అనర్ధాలు జరుగుతున్నాయి. ఏ కాలేజీ తమ వద్ద పనిచేసే సిబ్బంది వివరాలను ఏ పోర్టల్‌లోనూ అప్‌లోడ్ చేయకున్నా ఇంటర్‌బోర్డు కళ్లుమూసుకుని వ్యవహరించడం వెనుక పెద్ద ఎత్తున నిధులు చేతులు మారడమేననే ఆరోపణలున్నాయి. తెలంగాణలో కొత్తగా జిల్లాలు ఏర్పడిన తర్వాత సరిహద్దుల వివాదాలు కూడా ఏర్పడ్డాయి. గతంలో ఆర్‌ఐఓలు, జిల్లా విద్యాశాఖ వొకేషనల్ అధికారులు ఉండేవారు. ఇపుడు రెండు పోస్టులూ కలిపి జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారులుగా మార్చేశారు. అంటే జిల్లాకు ఒక అధికారి మాత్రమే పర్యవేక్షణకు మిగిలారు. వీరికి తోడు ఆర్‌జేడీలు ఉన్నా వారి పర్యవేక్షణ ఆఫీసులకే పరిమితం అవుతోంది. రికార్డులను డిఐఈఓ కార్యాలయాలకు తీసుకువెళ్తే కాలేజీలను తనిఖీ చేసినట్టు సంతకాలు చేసి పంపిస్తున్న వైనం ఇటీవల బట్టబయలైంది.పాఠశాల విద్యలో సమీపంలోని గెజిటెడ్ హెడ్మాస్టర్లు, ఎంఈఓలు, డీవైఈఓలు, డీఈఓలు, ఆర్‌జేడీల వ్యవస్థ ఉన్నా జూనియర్ కాలేజీలకు మాత్రం జిల్లా ఇంటర్ విద్యాధికారులకే పరిమితం కావడంతో తనిఖీలు మృగ్యమయ్యాయి. దాంతో కార్పొరేట్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. పరిమితికి మించి అడ్మిషన్లు, అడ్డూఅదుపూ లేకుండా ఫీజులు వసూలు చేస్తున్నా, బోర్డు నిబంధనలను ఉల్లంఘించి కోచింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్నా, ఆన్‌లైన్, ఆఫ్ లైన్ కేంద్రాలు నడుపుతున్నా, లాంగ్‌టెర్మ్ కోచింగ్ కేంద్రాలు నడుపుతున్నా అధికారులు మాత్రం మౌనం వహిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అనుమతి లేకుండా ఇవన్నీ ఎందుకు నిర్వహిస్తున్నారని అడిగే నాధుడే ఇంటర్ బోర్డులో లేకపోవడం విచిత్రం. రాష్ట్రంలో 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 558 ప్రభుత్వ ఆధీనంలోని గురుకుల కాలేజీలు, 1699 ప్రైవేటు కాలేజీలున్నాయి. ఇందులో 405 ప్రభుత్వ కాలేజీలకు, 492 గురుకుల కాలేజీలకు, 361 ప్రైవేటు కాలేజీలకు గుర్తింపు ఉంది, 66 గురుకులాలకు, 1338 ప్రైవేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపు మంజూరు కావల్సి ఉంది. నిబంధనలు పాటించే ప్రతి కాలేజీకి అనుబంధ గుర్తింపు జారీ చేస్తామని బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ పేర్కొన్నారు. చాలా కాలేజీలు ఎఫ్‌డీఆర్ రెన్యూవల్ చేయకపోవడం, అగ్నిమాపక శాఖ సురక్షిత ధ్రువీకరణ ఇవ్వకపోవడం, లీజు డీడ్ లేకపోవడం, భవన నిర్మాణ పటిష్టతపై ధ్రువపత్రం లేకపోవడం, శానిటరీ సర్ట్ఫికెట్, టీచింగ్ స్ట్ఫా వివరాలు లేకపోవడం, అనుబంధ గుర్తింపు రుసుం చెల్లించకపోవడం, ఆటస్థలాలు లేకపోవడం వంటి కారణాలే ఎక్కువగా ఉన్నాయని, దాంతో అనుబంధ గుర్తింపులో జాప్యం జరుగుతోందని బోర్డు కార్యదర్శి వివరించారు.

No comments:

Post a Comment